సుల్తాన్‌బజార్,అక్టోబర్ 11 : సీఎం కేసీఆర్ ధార్మిక భావన కలిగిన గొప్ప ఆధ్మాత్మికవేత్త అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మతోపాటు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అర్చక, ఉద్యోగుల స్థితిగతులు మార్చడంలో సీఎం కేసీఆర్ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీలోని తిరుపతి, సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, ద్వారక తిరుమల వంటి ఆలయాల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చే కంట్రిబ్యూషన్‌లో తెలంగాణ వాటా కింద రూ.1,160 కోట్ల నిధులు రాష్ట్ర దేవాదాయ శాఖకు జమ చేయాల్సి ఉన్నదని, ఈ విషయంలో చొరవ చూపాలని వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీనికి వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంబంధిత అధికారులు తనకు ప్రతిపాదనలతో నివేదికను అందజేస్తే వెంటనే నిధులను కేటాయిస్తామన్నారు. సుబ్బారెడ్డిని కలిసిన వారిలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నాయకులు జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, గుదిమెళ్ళ విజయ్‌కుమార్, ఆచార్యులు శ్రీరాముల యాదగిరి, అర్చక జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు ఉన్నారు.