Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ప్రియురాలు వేరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేని, జిమ్ ట్రైనర్ అయిన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నగరంలోని గెలెయారా బలగా లేఔట్ పరిధి, మహాలక్ష్మి లేఔట్లో నివాసం ఉంటున్న కిరణ్ (26) అనే వ్యక్తి జిమ్ ట్రైనర్‌గా చేసేవాడు. అతడు బాడీ బిల్డర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అతడు మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు ఉన్న అప్పుల్ని కూడా చాలా వరకు కిరణ్ తీర్చాడు. ఇద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగింది. కిరణ్.. ఆమెను తన తల్లి, కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. రాబోయే వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె కోసం గిఫ్ట్ కూడా కొన్నాడు. కానీ, ఆమె మాత్రం కిరణ్‌ను మోసం చేసింది. ఇటీవల వేరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు.. తన పెండ్లి ఆహ్వాన పత్రిక, చీరను అతడికి చూపించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు శనివారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా కిరణ్ డిప్రెషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం కూడా అతడు ఆందోళనగా ఇంటికి చేరుకున్నాడు. తనకు ఒక పెన్, పేపర్ కావాలని అడిగాడు. ఎందుకు అని అడిగితే.. ఆర్థిక అంశాల గురించి రాసుకోవాలని చెప్పాడు.
తల్లి దగ్గరినుంచి వాటిని తీసుకుని, తర్వాత తన గదికి వెళ్లి ఉరివేసుకున్నాడు. అనంతరం అతడు గది నుంచి బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో తలుపు బద్దలు కొట్టి చూసేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక లేఖ కూడా రాశాడు. తన ఆత్మహత్యకు ప్రేయసి, ఆమె తల్లి కారణం అని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.