T20WC 2026 : టీ20 ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ప్రారంభించింది. ఇవాళ అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (65) అర్ధశతకం చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ (42), మార్క్ చాప్మన్ (28), డారిల్ మిచెల్ (25 నాటౌట్) రాణించారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబ్ రెహమాన్ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుల్బాదిన్ నబీ (63) అర్ధశతకం బాదాడు. సెదిఖుల్లా అటల్ (29), రెహమానుల్లా గుర్బాజ్ (27), దార్విస్ రసూలీ (20) తమ వంతు ప్రయత్నం చేశారు.
మూడో వికెట్‌కు అటల్, గుల్బాదీన్ కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో ఒమర్జాయ్ (14) రనౌటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. హెన్రీ, డఫి, రచిన్ రవీంద్ర తలో వికెట్ దక్కించుకున్నారు.