హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపైనా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన లఘుచర్చలో భాగంగా మంత్రి పువ్వాడ మాట్లాడారు. పోలవరం కట్టకముందు గతంలో గోదావరికి ఎంతవేగంగా వరద వచ్చినా, అంతే వేగంగా తగ్గుముఖం పట్టేదని, రోజుకు ఐదు నుంచి 10 అడుగుల వరకు వరదనీటి ప్రవాహ తగ్గేదని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణదశలో ఉండగానే రోజుకు అర అడుగు, అడుగుకు మించి వరద తగ్గడం లేదని.. రాక్‌ఫిల్ డ్యాం వద్ద స్పిల్‌వేలోనే 100 టీఎంసీల నీరు నిలిచి ఉంటున్నదని వివరించారు.
గతంలో ధవళేశ్వరం ప్రాజెక్టు వరకు 25 నుంచి 30 లక్షల క్యూసెక్కుల నీళ్లు సులువుగా వెళ్లేవని.. ఇప్పుడు పోలవరం దగ్గరే ఆగుతున్నాయని పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు అయితే ఏపీ ప్రభుత్వం 50 లక్షల క్యూసెక్కులకు పెంచాలని ప్రయత్నిస్తున్నదని పువ్వాడ విమర్శించారు. ప్రాజెక్టు 50లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలం, బూర్గంపాడు సహా ఏవీ మిగలవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముంపునకు సంబంధించి సరైన స్టడీ జరుగలేదని పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీని అనేకసార్లు ప్రశ్నించాం. కేంద్రాన్ని నిలదీశాం. ఎప్పుడూ రాములవారి గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో ఉన్న రాముడు మునుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికే మా ఏడు మండలాలను, లోయర్ సీలేరు ప్రాజెక్టు తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు భద్రాచలం రాముడిని, ఇక్కడి ప్రజలనూ ముంచుతున్నారు..’ అని మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ముందుచూపు లక్షల ప్రాణాల్ని కాపాడింది..
‘భద్రాచలంలో ఆ సీతారామచంద్రస్వామి కనపడని దేవుడు అయితే.. సీఎం కేసీఆర్ కనిపించే దేవుడు. ఈ ఇద్దరి వల్లనే గోదావరి వరద ముప్పు నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం. వరద వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్.. జిల్లా మంత్రిగా నన్ను , కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. ఆయన ముందుచూపుతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం కారణంగానే అంత పెద్ద వరద వచ్చినా ఒక్క ప్రాణమూ పోకుండా కాపాడగలిగాం’ అని మంత్రి పువ్వాడ చెప్పారు. భద్రాచలం చరిత్రలో 1986లో గోదావరికి వచ్చిన 79.3 అడుగుల వరదే రికార్డ్ అని, అప్పుడు దాదాపు 30 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చిందని మంత్రి గుర్తుచేశారు. అంతటిస్థాయిలో ఈసారి వరద వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడగలిగామని చెప్పారు. రెండు హెలికాప్టర్లు పెట్టి.. నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి 30వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద సంఖ్యలో వరద బాధితుల తరలింపు గతంలో ఎప్పుడూ జరుగలేదని పేర్కొన్నారు.
ప్రజల గోడు పట్టని కేంద్రం
ఏపీలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలూ తమను తెలంగాణలో కలుపాలని మొర పెట్టుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని పువ్వాడ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మేం ఆంధ్రప్రదేశ్‌లో ఉండం. మమ్మల్ని తెలంగాణలో కలపండి అని ముంపు గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అక్కడ కరకట్టలు సరిగా లేకపోవడం వల్ల భద్రాచలం పట్టణంలోకి వరద నీరు వస్త్తున్నది. వరద ముప్పు వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు’ అని తెలిపారు. ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లఘుచర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసన సభాపక్షనేత భట్టి విక్రమార్క వివరణ కోరుతూ.. ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం, పోలవరం ఎత్తు పెంపుతో వచ్చే ముప్పు అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విభజన చట్టం అమలయ్యేలా మార్గదర్శకత్వం చేసేలా ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.