వడ్లపై బీజేపీని వదలబోమంటున్న టీఆర్ఎస్
మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న గులాబీ శ్రేణులు
కదిలి..కదిలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 : గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం. యాసంగి వడ్లు కొనని మోదీ ప్రభుత్వం, అసత్య ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతల భరతం పట్టుడేనని సోమవారం నాటి పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. కేంద్ర మంత్రుల అహంకారపూరిత వ్యాఖ్యలకు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిఘటన ఎలా ఉంటుందో వారం పదిరోజులుగా జరుగుతున్న వరుస నిరసనల హోరు కండ్లకు కడుతున్నది.
కదిలి..కదిలించి..
రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర కుట్రపూరిత వైఖరిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. కేంద్రం దుర్నీతిని పార్లమెంటు సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు ఎండగట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందంతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో నిప్పు రాజేశాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. 6న ముంబై, నాగపూర్, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులను స్తంభింపజేశారు. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 8న అన్ని గ్రామపంచాయతీల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిష్టిబొమ్మలను దహనం చేసి, రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. చివరగా సోమవారం ఢిల్లీ వీధులను తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీఎంతోపాటు మొత్తం మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దగ్గరి నుంచి అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఒక అంశంపై ఢిల్లీపై తిరుగుబాటు జెండా ఎగురవేయటం దేశ చరిత్రలో తొలిసారి. రైతుల పట్ల టీఆర్ఎస్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించటం అని జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతున్నది.
ఇక కదన కార్యాచరణే?
కేంద్రం తెలంగాణపై ప్రదర్శిస్తున్న మోసపూరిత, కుట్రపూరిత వైఖరికి నిరసనగా కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధం చేయబోతున్నదా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కేంద్రం దుర్మార్గాన్ని, రాష్ట్ర బీజేపీ నేతల నీచ కూతలను ఉపేక్షించబోమని కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉన్నది. సీఎం ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతున్నది. మంగళవారం క్యాబినెట్ సమావేశంలో వడ్ల కొనుగోలుపై ఉద్యమ కార్యాచరణ నిర్ణయించే అవకాశం ఉన్నది.