మహబూబాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మానుకోట జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. గురువారం సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభ వేదికగా సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మహబూబాబాద్‌కు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లను కేటాయించడంతోపాటు తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ‘మహబూబాబాద్ మున్సిపాలిటీ బాగా మారింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను, మున్సిపల్ చైర్మన్‌ను అభినందిస్తున్న.
పార్టీ ఆఫీసు ప్రారంభించి, నేను బస్సుల వస్తుంటే చూసిన. ఇంకా కొన్ని డ్రెనేజీలు, సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నయి. గిరిజన ప్రాంతాలు బాగా అభివృద్ధి కావాలి. అందుకే ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్న. కలెక్టర్ శశాంక ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను సమన్వయం చేసుకుని సద్వినియోగం చేయాలి. గ్రామాలకు ఇచ్చే నిధులను సర్పంచుల నిర్ణయం మేరకు ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటది’ అన్నారు.
కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
జిల్లాకు చేరుకొన్న సీఎం కేసీఆర్.. తొలుత జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను సీఎం కట్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత గుమ్మడికాయ కొట్టి, పూజలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలిని సీఎం కేసీఆర్ ఆశీర్వదించి, కుర్చీలో కూర్చోబెట్ట్టారు.
అక్కడినుంచి కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సమీకృత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అర్చకులు పూజలు చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణం నుంచే జిల్లా కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంకను కుర్చీలో కూర్బోబెట్టారు. కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సీఎం అభినందనలు తెలిపారు.
అనంతరం కలెక్టర్ శశాంక సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత కలెక్టరేట్ ఆవరణను సీఎం కేసీఆర్ పరిశీలించి.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌కు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సభర్వాల్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకొన్నారు.
గ్రామాలు మరింత అభివృద్ధి
సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు ఇస్తామని మానుకోట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సంతోషం. దీంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. సైడ్ కాల్వలు, సీసీరోడ్లు నిర్మించుకోవచ్చు. ఒకప్పుడు గ్రామాల్లో వసతులు లేక ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినంక ఊళ్లు బాగుపడుతున్నయ్. ఇప్పటికే పల్లెల్లో సీసీరోడ్లు, సైడ్ కాల్వలు, శ్మశానవాటిక, ప్రకృతివనాలు ఏర్పాటు చేసిన్రు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చి చెత్తను తీసుకుపోవడంతో గ్రామాలు శుభ్రంగా ఉంటున్నయ్.
– పురం రాజమణి, సర్పంచ్, అమినాపురం
కేసీఆర్‌కు సర్పంచ్‌లు రుణపడి ఉంటారు
మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సర్పంచ్‌లకు వరాల జల్లు కురిపించిన్రు. ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తామనడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేసిన్రు. వీటితో పల్లెల్లో సౌకర్యాలతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటున్నది. ఈ ప్రత్యేక నిధులతో జీపీలు మరింత అభివృద్ధిలోకి వస్తాయి. కేసీఆర్‌కు సర్పంచ్‌లు అందరం రుణపడి ఉంటాం.
– షఫియుద్దీన్, సర్పంచ్, లక్ష్మీపురం(బీ), మహబూబాబాద్