తెలంగాణ రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ మద్దతుతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆర్థికంగా బలపడుతున్న గ్రామీణ రైతాంగం కార్లు, టూవీలర్లు కొంటున్నరు. ఇయ్యాల ఇంటికో బండి, వాడకో కారున్నది. గతంలోలా రోడ్లు ఖాళీగా ఉంటలేవు. రోడ్లు నిరంతరం ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణను చాలెంజ్‌గా తీసుకోవాలి. పల్లె, పట్టణం అనే భేదం లేకుండా రోడ్ల మీద వాహనాల రద్దీ పెరిగిపోయింది. రాత్రీపగలూ వాహనాల రవాణాతో తాకిడికి గురయ్యే రోడ్లను పటిష్ఠంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలది.. రవాణాను నిరంతరం సౌకర్యవంతంగా ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖలదే.
– సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరవాలని, ఒక్కసారి రోడ్డు వేస్తే అది చెక్కు చెదరొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రోడ్ల మరమ్మతుకు వారంలోగా కార్యాచరణ రూపొందించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ రెండోవారంలోగా టెండర్లు పూర్తికావాలన్నారు. రాష్ట్రంలో రోడ్లు రవాణా ఒత్తిడి వల్ల, కాలానుగుణంగా మరమ్మతులకు గురవుతున్నాయని, వాటిని గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా తీర్చిదిద్దాలని చెప్పారు.
ప్రగతిభవన్‌లో గురువారం రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో అభివృద్ధి పనుల పరిమాణం రోజురోజుకూ పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకొని, బాధ్యతల వికేంద్రీకరణ చేపట్టాలని సూచించారు.
ఇంజినీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా విభిన్నంగా ఆలోచన చేయాలన్నారు. వానలు, వరదల కారణంగా తెగిపోయిన రోడ్లకు, సాధారణ రోడ్ల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలాగే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను తయారు చేసుకొని, రోడ్లను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లు ఎకడెకడ ఏ మూలన దెబ్బతిన్నాయనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజినీర్ల దగ్గర ఉండాలని చెప్పారు.
ఆర్అండ్బీలోనూ ఈఎన్సీ విధానం
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, దెబ్బతిన్న వాటిని వెంటనే మరమ్మతు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చెకు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు నిరంతర పర్యవేక్షణ బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదేనని స్పష్టంచేశారు. ఆ దిశగా ఆయా శాఖల్లో పరిపాలన సంసరణలు అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవాలని సూచించారు.
ఇతర శాఖల మాదిరే ఆర్అండ్బీ శాఖకు కూడా ఈఎన్సీ అధికారుల విధానం అమలు చేయాలన్నారు. ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండే విధంగా, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని చెప్పారు. పటిష్ఠంగా పనులు జరగాలంటే ఎస్ఈల సంఖ్య, ఈఈల సంఖ్య ఎంత ఉండాలో ఆలోచన చేయాలని సూచించారు. పని విభజన జరగాలన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశమున్నదని తెలిపారు.
బాధ్యతల పునర్విభజనతో సత్ఫలితాలు
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ, పంచాయితీరాజ్శాఖలను పటిష్ఠం చేసుకొనేందుకు పలు మార్గాలను అనుసరించాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. శాఖల్లో బాధ్యతల పునర్విభజన, వానలకు, వరదలకు కొట్టుకుపోయిన రోడ్ల (ఎఫ్డీఆర్) మరమ్మతులు, నిర్వహణ, మరమ్మతులు తదితరాలకు కిందిస్థాయి ఇంజినీర్లు సత్వరం నిర్ణయం తీసుకొని పనులు చేపట్టేలా నిధుల కేటాయింపు వంటి మార్గాలను అవలంబించాలని దిశానిర్దేశం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచి, వారంలోగా కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు.
అందుకు సంబంధించిన కార్యాచరణపై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు దెబ్బతింటున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో రైతులు, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లను చైతన్యం చేయాలని సీఎం చెప్పారు. కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్నారు. పంచాయితీరాజ్ శాఖ ఇంజినీర్లు వారి శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
రోడ్ల మరమ్మతు నిరంతర ప్రక్రియ
రోడ్ల మరమ్మతును నిరంతర ప్రక్రియగా భావించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇంజినీర్లు ఎకడికకడ రోడ్లను దూరాల వారీగా పని విభజన చేసుకోవాలని చెప్పారు. ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు వర్షాపులను నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల సుమన్, పైలట్ రోహిత్‌రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావు, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం సెక్రటరీలు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, హన్మంతరావు, శ్రీనివాసరాజు, రవీందర్రావు, రొనాల్డ్ రోస్, ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీల్లో ప్రత్యేక విభాగాలు
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్ఠంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న దవాఖానల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక ఫ్లోర్‌ను కేటాయించాలని చెప్పారు. దవాఖానల నిర్మాణాల నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. అన్ని విభాగాలకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటుచేయాలని చెప్పారు. మెడికల్ విద్యార్థులకు, ప్రజల వైద్య సేవలకు అనుగుణంగా నూతన దవాఖానలు ఉండాలన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని ఆదేశించారు.
ఆర్అండ్బీకీ మెయింటెనెన్స్ నిధులు
అటవీ భూముల కారణంగా రోడ్ల నిర్మాణం ఆగిపోతే, అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. రోడ్లకు వాడే మెటీరియల్ ఉత్పత్తికి హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకోవాలని, తద్వారా సమయాన్ని, నాణ్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. రోడ్ల మరమ్మతుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు మాదిరే ఆర్అండ్బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచామని తెలిపారు. కిందిస్థాయి ఇంజినీర్లు ప్రతి చిన్న పనికి హైదరాబాద్ వచ్చి సమయం వృథా చేసుకోకుండా, వారి స్థాయిని బట్టి స్వయంగా ఖర్చు చేసేలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్ఈ స్థాయిల్లోని ఇంజినీర్లలో ఎవరి దగ్గర ఎన్ని నిధులు కేటాయించాలో చర్చించి నిర్ణయించాలని సూచించారు. రోడ్ల మెయింటెనెన్స్ పనులు సమర్థవంతంగా ఉండాలంటే ఆ బాధ్యతను ఏ స్థాయి ఇంజినీరుకు అప్పగించాలో కూడా నిర్ణయించుకోవాలని తెలిపారు.
వానలు, వరదల కారణంగా తెగిపోయిన రోడ్లకు, సాధారణ రోడ్ల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇరిగేషన్ శాఖలాగే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను తయారు చేసుకొని, రోడ్లను నిత్యం పర్యవేక్షించాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, వానలకు, వరదలకు దెబ్బతిన్న వాటిని వెంటనే మరమ్మతు చేయాలి. చెకు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు నిరంతర పర్యవేక్షణ బాధ్యత ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలదే.
– సీఎం కేసీఆర్