CM KCR | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి రావడం కోసం అలవిగాని హామీలిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండి పడ్డారు. ఆదివారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతిపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ‘పక్క రాష్ట్రంలో రూ.1000కి మించి ఇస్తలేరు.. తెలంగాణలో రూ.4000 పెన్షన్ ఇస్తారా.. ప్రజల్ని అడిగితే చెప్పిన్రు.. చేస్తామంటరు ఆయింత వచ్చినంక చేతులు లేబడితే ఎట్ట’ అని నిలదీశారు.
‘ ఇంతకుముందు కూడా అనుభవాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తమన్నరు. మేం చెప్పినం.. కాంగ్రెస్ అంత గొప్పొళ్లం కాదు. రూ.లక్ష వరకు చేస్తమన్నం..2018 ఎన్నికల్లో ప్రజలు ఓట్లు గుద్దుడు గుద్దితే మాకు 88 సీట్లు వచ్చినయి.. మీకేమో 19 సీట్లొచ్చినయి.. అలవిగానివి చెబితే గూడ.. ఎటుబడితే అటు చెబితే ఎవరూ నమ్మరండి.. మేం గుడ పెంచుతం.. ఏవిధంగా పెంచాల్నో పెంచుతం తప్పకుండా.. ఎక్కడికి తీసకపోవల్నో ఆలోచిస్తం..ఒకటేసారి పెంచం’ అని స్పష్టం చేశారు.
‘మీరనుకుంటున్నరు సీట్లు కొట్టకపోదమని.. కానీ మా దగ్గర చాలా అస్త్రాలున్నయి.. మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రజల్లోకి తీసుకపోతే జరుగతది.. ప్రజలకు సంక్షేమం చేసేదే మేము.. రాష్ట్ర ఆదాయం పెంచింది మేము.. సంక్షేమం అమలు చేసి నడిపించింది మేం.. ఆరేండ్ల నుంచి ఏడేండ్ల నుంచి మొదలు రూ.1000 ఇచ్చినం తర్వాత రూ.2000 ఇచ్చినం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కాలే.. మొదలు వెయ్యే ఇచ్చినం.. ఆర్థిక రంగ పురోగతి పెంచుకుంటూ రూ.2000 ఇచ్చినం.. కల్యాణ లక్ష్మి మొదలు రూ.51 వేలు ఇచ్చుకున్నం. చేతిల కొంచెమంత బలం పెరిగినంక దాన్నిగూడ పెంచుకున్నం. గొర్రెల యూనిట్‌కు గూడ కాస్త కాస్ట్ తక్కువ బెట్టుకున్నం.. మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిండు.. ధరలు పెరిగినయి అన్న అంటే యూనిట్ కాస్ట్ పెంచినం..లక్ష నుంచి రూ.1.75 లక్షల కు పెంచినం.. రైతు బంధు రూ.4,500 నుంచి రూ.5000 లకు పెంచినం’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
‘దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులే తెలంగాణ ఉద్యోగులే.. ఉద్యమ సమయంలోనే చెప్పినం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలిస్తాం అని చెప్పినం.. చూపిచ్చినం అన్నమాట నిలుపుకున్నం.. మాకు మానవీయ ద్రుక్కోణం ఉంది. దేశ చరిత్రలో మీ కాంగ్రెస్ చరిత్రలో గానీ, ఇతరుల చరిత్రలో గానీఎక్కడ ఇయ్యలే..చిన్న చిన్న ఉద్యోగుల గురించి మీరు పొద్దున మొసలి కన్నీరు గార్చినరు. నిజమే.. 30 శాతం ఎంప్లాయిస్ కి పీఆర్సీ ఇస్తే.. ఔట్ సోర్సింగ్.. ఇంకో సోర్సింగ్ చిన్న చిన్న ఉద్యోగులకు 30 శాతం వేతనం పెంచినం.. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం.. వాళ్లకు ఎప్పుడు పెంచరు కన్సాలిడేడెట్ వేతనం పెంచుతరు తప్ప.. అసెంబ్లీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30 శాతం పెంచినం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడినం.. రాబోయే రోజుల్లో మధ్యంతర భ్రుతి ఇస్తాం.. త్వరలో పీఆర్సీ ఇస్తాం.. దేశం ఆశ్చర్యపోయేటువంటి పేస్కేల్ ఇస్తం మా ఉద్యోగులకు..బ్రహ్మాండంగా పెంచుతం.. ఏం చేసుకుంటం.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే.. స్వల్ప కాలంలో ఐఆర్ ఇచ్చి.. పీఆర్సీ ఇచ్చిన మేరకు మంచి వేతనాలు పెంచుకుంటాం` అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘సింగరేణిలో ఔట్ సోర్సింగ్ పెట్టిన్రు.. మీరే పెట్టిన్రు. మేం దాన్ని ఇంకా బెటర్ చేసినం.. రాష్ట్రంలో మేం అధికారంలో వచ్చిన తొలిసారి 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం. మళ్లీ లక్ష ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ కొనసాగుతున్నది. షార్ట్ టైంలో ఆల్ టైం రికార్డు ఇది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. `సింగరేణిని నిండ ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. 100 శాతం తెలంగాణ కంపెనీ.. సమైక్య రాస్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నడపలేక కేంద్రంలో అప్పులు తెచ్చినరు.. ఆ అప్పులు తీర్చలేక కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెట్టిన ఘనులు మీరే.. సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీయే.. మీ పరిపాలన నిర్వాకమే.. 100 శాతం తెలంగాణ కంపెనీలో 49 శాతం వాటా పుట్టిచ్చిందెవరు.. కాంగ్రెస్ పార్టీ పాలన ఫలితమే’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
‘వీళ్ల (కాంగ్రెస్) పది సంవత్సరాల పాలన తర్వాత మేం వచ్చినం.. వీళ్ల పాలనలో సింగరేణి టర్నోవర్ కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే. తాజాగా సింగరేణి టర్నోవర్ రూ.33 వేల కోట్లు.. లాభాలు రూ.419 కోట్ల నుంచి రూ.2,222 కోట్లకు పెంచినం.. కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి కార్మికులకు దసరా దీపావళి బోనస్ రూ.83 కోట్లు ఇస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది రూ.1000 కోట్ల బోనస్ ఇవ్వబోతున్నది. టీడీపీ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిన్రు. కాంగ్రెస్ పార్టీ హయాంలో డిపెండెంట్లను పునరుద్దరించలే.. కొనసాగించినరు. కాంగ్రెస్ పాలనతో గని కార్మికుడు మరణిస్తే రూ.లక్ష మొహాన పడేసినరు. మా ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు డిపెండెంట్ ఉద్యోగం తీసుకోని వారి కుటుంబాలకు రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తున్నాం. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటే రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తున్నాం. సింగరేణి జాగల్లో పేదలు గుడిసెలేసుకుంటే 76 నంబర్ జీవో ద్వారా వారికి పట్టాలిచ్చి ఆదుకున్నం. సింగరేణి మీద మీ నుంచి మేం నేర్చుకోవాల్సిందేం లేదు’ అని కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.