హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్. సింగరేణి 100% తెలంగాణ కంపెనీ. సమైక్య రాష్ట్రంలో కాం గ్రెస్ హయాంలో వీళ్లకు పరిపాలన చేతకాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారు. అవి తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీనే అనేది అందరికీ తెలిసిన చరిత్ర. కాంగ్రెస్ పదేండ్ల పాలన తర్వాత మేం అధికారంలోకి వచ్చాం.
కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ రూ.12 వేల కోట్లు. ఇప్పుడు రూ.33 వేల కోట్లకు పెంచాం. రూ.419 కోట్లు ఉం డే సింగరేణి లాభాలను రూ.2,222 కోట్లకు పెం చాం. దసరా, దీపావళి బోనస్ రెండూ కలిపి రూ. 83 కోట్లు ఇచ్చేవారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభు త్వం సింగరేణిని బ్రహ్మాండంగా కాపాడింది. టర్నోవర్ పెంచింది. నష్టాలను తగ్గించి, లాభాలను పెం చాం. ఈరోజు సింగరేణి కార్మికులకు ఒక శుభవార్త చెప్తున్నాం. ఈసారి రూ.వెయ్యికోట్ల బోనస్ ఇవ్వబోతున్నాం. టీడీపీ హయాంలో వారసత్వ ఉద్యోగాలు తొలగించారు.
కాంగ్రెస్ దానిని పునరుద్ధరించలేదు. గని ప్రమాదంలో కార్మికులు చనిపోతే రూ. లక్ష వాళ్ల మొఖాన పడేసి చేతులు దులుకునేటోళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తున్నది. ఒకవేళ వారసత్వ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తున్నం. సింగరేణి కార్మికులు ఇం డ్లు కట్టుకుంటమని అడిగితే వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. గడ్డం గీసుకునేటోళ్లు, బట్టలు ఉతికేటోళ్లు.. అనేక రకాల పేదలు వచ్చి సింగరేణి జాగల్లో గుడిసెలు వేసుకుంటే 20 వేల మందికి జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం. ఇదీ సింగరేణిలో మేం సాధించిన ప్రగతి. కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.