పోటీకి దిగుతున్న కేసీఆర్‌కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవగా, భారీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ‘కేసీఆర్ కావాలి.. కామారెడ్డి రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో గ్రామాలకు గ్రామాలే కేసీఆర్‌కు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నగర శివారులో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వివాహానికి హాజరైన ఆ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ను స్వాగతిస్తూ.. మద్దతు పలుకుతూ.. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం నుంచి పెండ్లి మండపం వరకు, ‘కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్’, ‘సీఎం కేసీఆర్ రావాలి’ ‘స్వాగతం కామారెడ్డికి స్వాగతం’ ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’ ‘జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్’ వంటి నినాదాలతో ఆ పెండ్లి ప్రాంగణం దద్దరిల్లింది. ప్రజలు ముఖ్యంగా యవత హాల్లో దారికి ఇరువైపులా నిలబడి నినాదాలతో హోరెత్తించారు.
తమ సెల్ ఫోన్లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకొనేందుకు, సీఎంతో కరచాలనానికి మహిళలు, యువతీ యువకులు పోటీపడ్డారు. సార్.. సార్ అంటూ తమ అభిమానాన్ని చటడానికి ప్రయత్నించారు. వారి ఉత్సాహం, ఆసక్తిని గమనించిన కేసీఆర్ అభివాదం, కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ ముందుకు సాగారు. మహిళలతో ఫొటోలు దిగారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జాజాల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.