శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాఢ్యమి రోజున శ్రీపరాభవ నామ నూతన తెలుగు సంవత్సరానికి ఉమ్మడి జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు ఉగాది పండుగను గురువారం ప్రజలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా జరుపుకొన్నారు. వేకువ జామునే ఇళ్ల గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి.. తీరొక్క పూలతో అలంకరించారు. ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించి పండుగ శోభ తీసుకొచ్చారు. ఇంటిల్లిపాది ఇష్ట దైవాలకు పూజలు చేశారు. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించారు. పండుగ సందర్భంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.