న్యూఢిల్లీ, మార్చి 19: బంగారం కొండ దిగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధర అయితే ఏకంగా రూ.7 వేలు తగ్గింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.7,000 లేదా 4.37 శాతం తగ్గి రూ.1,53,300కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,60,300గా ఉన్నది.
ఈ ఏడాది మొదట్లో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.83 లక్షలకు చేరుకున్న పుత్తడి ధర ప్రస్తుతానికి రూ.29,700 లేదా 16.23 శాతం తగ్గినట్టు అయిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణ భయాలు చుట్టుముట్టనుండటంతో అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు యథాతథ స్థితికి మొగ్గుచూపడం కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ రీసర్చ్ దిలీప్ పార్మర్ తెలిపారు.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు గ్లోబల్గా సిల్వర్ ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. కిలో వెండి రూ.17,800 లేదా 7 శాతం తగ్గి రూ.2,38,700కి చేరుకున్నది. జనవరి 29న రికార్డు స్థాయి రూ.4.04 లక్షలకు చేరుకున్న కిలో వెండి ప్రస్తుతం రూ.2.38 లక్షలకు పడిపోయింది. నికరంగా రూ.1,65,800 లేదా 41 శాతం తగ్గినట్టు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 100 డాలర్లకు పైగా పడిపోయి 4,700 డాలర్ల దిగువకు జారుకున్నది. గత రెండు రోజుల్లో గోల్డ్ ధర 300 డాలర్లు తగ్గినట్టు అయింది. అలాగే వెండి కూడా 4.88 డాలర్లు లేదా 6.48 శాతం పతనం చెంది 70.49 డాలర్లకు చేరుకున్నది.