స్టేషన్ ఘన్పూర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 50 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని, అయినా సిగ్గులేకుండా ఇప్పుడు మళ్ల ఓట్లడుగుతున్నదని ఆయన మండిపడ్డారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు.
‘తెలంగాణను ఆంధ్రాలో కలిపి కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటుకు 58 ఏండ్లు గోస పడ్డం. ఆఖరికి 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తమని చెప్పి పొత్తుపెట్టుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచింది. కానీ తెలంగాణ ఇయ్యలే. కుట్రలు చేసింది. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసింది. చివరికి ఉద్యమం బలోపేతమై, మనకు దేశంలోని 33 పార్టీలు మద్దతిచ్చినంక తెలంగాణ ఇచ్చింది. ఆమరణ దీక్షకు పోయిన తర్వాత ఇక దిక్కులేదని దిగొచ్చింది’ అని సీఎం చెప్పారు.
‘కాంగ్రెస్ పాలనలో పెన్షన్లు ఎంత ఉండె..? కరెంటు ఎట్లుండె..? వ్యవసాయం ఎట్లుండె..? ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ఎట్లున్నది..? అని మీరు ఆలోచించాలె. మేం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమాన్ని మొదట ఎంచుకున్నం. సమాజంలో అనుకోకుండా విధి వంచితులు అయిన వారి కోసం రూ.1000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినం. మా అధికారులు రూ.400 పెన్షన్ చాలు సార్ అంటే.. పేదలు బిర్యానీ తినకపోయినా సరే, పప్పో పులుసో చేసుకుని తినేలా ఉండాలని చెప్పిన. రూ.1000 పెన్షన్ను తర్వాత రూ.2000 చేసినం. భవిష్యత్లో దాన్ని క్రమంగా రూ.5,000 దాకా పెంచబోతున్నం’ అని తెలిపారు.
‘కంటి వెలుగు పెట్టి లక్షల మందికి కంటి పరీక్షలు చేయించినం. పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నం. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నం. మంచినీళ్ల కోసం ఊర్లళ్ల కొట్లాటలు లేకుండా మిషన్ భగీరథతోటి ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నం. మరె కాంగ్రెస్ ఏం చేసింది..? కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్లు, కేసీఆర్ కంటే పొడుగున్నోళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు కాంగ్రెస్ రాజ్యంల. కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యలే కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనల. మళ్ల ఇయ్యాల్ల వచ్చి సిగ్గులేకుండా ఓట్లడుగుతున్నరు కాంగ్రెస్ నాయకులు. దయచేసి మీరు ఆలోచన చేయాలె’ అని సీఎం సూచించారు.