హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకు బీఆర్ఎస్ పార్టీ చోటు కల్పించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాలకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు.
2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఓటమిపాలైన కోవా లక్ష్మీతోపాటు మెదక్, ఆలేరు, ఇల్లందు, మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పద్మా దేవేందర్ రెడ్డి, గొంగడి సునితా మహేందర్‌రెడ్డి, హరిప్రియా నాయక్, సబితా రెడ్డిలకు ఈసారి కూడా టికెట్లు కేటాయించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్ నిరాకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి 2018 గెలుపొందిన సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితను పోటీకి నిలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
అలాగే, బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయన్నారు.
రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని అన్నారు. చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలోనూ అలానే చేశామని, ఈ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు.