ఊరేదైనా, నియోజకవర్గం ఏదైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా ఎర్రటి ఎండలోనైనా, చలి ముసిరిన సందెవేళ అయినా.. అతడు వస్తున్నడంటే ఉత్సాహం ఉప్పెనవుతుంది. సభలు జనసంద్రాలవుతాయి. కారులో వస్తే పూలవర్షం కురిపిస్తారు. బస్సుల్లో బైలెల్లితే హారతులతో స్వాగతిస్తారు. హెలికాప్టర్లో ఉన్నా.. కిందినుంచే చేతులూపుతూ కేరింతలు కొడతారు. ఆ ప్రజానాయకుడు.. కేసీఆర్! జనమనోరథ సారథి.. కేసీఆర్! పదేండ్లలో మాట పదును తగ్గలేదు. పదేండ్లలో ప్రజాకర్షణ తగ్గలేదు. అతని మాటొక మంత్రం.. తూటా లెక్క సర్రున గుండెలోకి దూసుకుపోతది. అతని రూపే ఒక ఉత్సాహం.. వేల వోల్టుల కరెంటును నరానరాన నింపేస్తది.
కేసీఆర్ ప్రసంగం ప్రవాహంలా సాగుతుంది. తెలంగాణ యాస తలపాగా చుట్టుకుంటుంది. మాటలు మట్టివాసనై పరిమళిస్తాయి. ఒక ఉరుములాంటి మాట ఆయన నోటి నుంచి వెలువడితే చాలు, జనహోరుతో దిక్కులు దద్దరిల్లినట్టే! ఆలోచన-ఆవేశం సమపాళ్లలో దట్టించి మాట్లాడితే లక్ష శతఘ్నులు ఒక్కసారి పేలినట్టే! కేసీఆర్ కండ్లముందు కనబడితేచాలు, ఆపమన్నా ఆపనన్ని ఈలలు, చప్పట్లు. ‘నేనిక్కడ మొత్తుకుంటుంటే.. మీరక్కడ మొత్తుకుంటున్నరు. మీటింగ్ అయిపోయినంక ఇద్దరం కలిసి దుంకుదాం’ అని బహిరంగ సభల్లో జనాన్ని ఆయన వారించిన సందర్భాలనేకం.
కేసీఆర్ పర్యటనల జోష్‌తో జిల్లా జిల్లా శిగమూగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన బీఆర్ఎస్ 30 ఎన్నికల సభలు జనసునామీని తలపిస్తున్నాయి. ఏ ప్రజాఆశీర్వాద సభ చూసినా ఇదే పరిస్థితి. జననేత కోసం మిద్దెలు, చెట్లు ఎక్కి మరీ జనం ఎదురుచూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకుంటే.. ఆ నియోజకవర్గంలో జరిగే కేసీఆర్ సభకు తక్కువలో తక్కువగా నాల్గోవంతు మంది హాజరవుతున్నారని ఒక అంచనా. అంటే ప్రతి నలుగురిలో ఒక్కరు సభకు వస్తున్నట్టే. అదీ ఆయన ప్రజాకర్షణ.. ప్రజాదరణ.. అదీ ఆయన సమ్మోహనశక్తి. అదీ క్రేజీఆర్!
సిద్దిపేట నియోజకవర్గం 4 నవంబర్ 2023
గులాబీ వాన
సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి మురిసిపోయింది. తమ ప్రాంత ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనైంది. ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రతిసారి కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తారు కేసీఆర్. ఈసారి కూడా అదే పాటించారు. శనివారం పూజలు చేయడానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గులాబీ పూలవర్షంలో ముఖ్యమంత్రి
తడిసి ముద్దయ్యారు.
బాల్కొండ నియోజకవర్గం 2 నవంబర్ 2023
అదిగదిగో సారు
మోతె మట్టిని ముడుపుగట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న రోజునుంచీ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కేసీఆర్ వెంట నడిచింది. గురువారం ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ వేల్పూరు రాగా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సభకు హాజరైన ఓ మహిళ తన కుమారుడిని భుజాలపై ఎత్తుకుని.. ముఖ్యమంత్రిని చూపిస్తూ, ఇలా పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అని నినదించింది.
సిరిసిల్ల నియోజకవర్గం – 17 అక్టోబర్ 2023
పూనకాలు లోడింగ్..
గత నెల 17న సిరిసిల్లలో ప్రజాఆశీర్వద సభకు ప్రజానీకం వేలాదిగా తరలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలికింది. ప్రధానంగా యువత ‘జై కేసీఆర్’ ‘జైజై కేసీఆర్’ అంటూ నినదించింది. ‘ఓట్ ఫర్ కారు.. ఓట్ ఫర్ బీఆర్ఎస్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించింది. తెలంగాణ అంతటా ఇదే జోష్.
హుస్నాబాద్ నియోజకవర్గం 15 అక్టోబర్ 2023
రీ సౌండ్..
సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌గా భావించే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అక్టోబర్15న నిర్వహించిన ఆశీర్వాద సభలోని దృశ్యమిది. సీఎంను చూసి యువత పొంగిపోయింది. కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తంచేసింది. మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని చెప్తూ.. కేసీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుతూ యువతులు ఇలా జోష్‌ను నింపారు.
పాలేరు నియోజకవర్గం 27 అక్టోబర్ 2023
గులాబీల జెండలమ్మ..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం జీళ్లచెర్వులో గత నెల 27న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జోష్ ఇది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ తొలి ప్రచార సభ. ప్రత్యర్థులపై సీఎం వదిలిన ఒక్కో వాగ్బాణానికి గులాబీ శ్రేణులు, అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ ‘ఎత్తర గులాబీ జెండా’ అన్నట్లు పార్టీ నాయకులు గులాబీ కండువా ఎత్తిన దృశ్యమిదీ..!
అచ్చంపేట నియోజకవర్గం 26 అక్టోబర్ 2023
ఫోటెత్తిన అభిమానం
గత నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. సభా ప్రాంగణానికి కేసీఆర్ హెలికాప్టర్ రాగా, తమ అభిమాన నేతను ఫోన్లలో బంధించేందుకు యువకులు ఇలా పోటీపడ్డారు.
సత్తుపల్లి నియోజకవర్గం 1 నవంబర్ 2023
అభిమానం.. అభివాదం!
ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉద్వేగంగా సాగింది. ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్లో వస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి చేతులూపుతూ సత్తుపల్లి ఇలా స్వాగతం పలికింది.
నారాయణఖేడ్ నియోజకవర్గం 30 అక్టోబర్ 2023
అభిమాన ప్రభం‘జనం’
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో అక్టోబర్ 30న నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో పట్టణం గులాబీమయమైంది. కేసీఆర్‌ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో సభాప్రాంగణం కిక్కిరిసి పోయింది. దీంతో ప్రజలు సమీపంలో భవనాలపైకి ఎక్కి అభిమాన నేతను కండ్లరా చూసి ఆనందానికి లోనయ్యారు.
వన్స్‌మోర్.. సీటీ మార్..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్లచెర్వులో గత నెల 27న జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన మొట్టమొదటి సభ. ఆయన్ను చూసేందుకు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభలో ఓ మహిళ ఇలా విజిల్ వేస్తూ తన ఆనందాన్ని చాటుకున్నారు.
జడ్చర్ల నియోజకవర్గం 18 అక్టోబర్ 2023
కేసీఆరే కల్పవృక్షం
అక్టోబర్ 18న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సభాస్థలికి చేరుకున్న వేలాదిమంది అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడున్న చెట్లు, పుట్టలు ఎక్కిమరీ కేసీఆర్‌ను చూసేందుకు ఎగబడ్డారు. సభ ముగిసేవరకూ ఇలానే ఉండి అభిమానాన్ని చాటుకున్నారు.
కోదాడ నియోజకవర్గం 29 అక్టోబర్ 2023
జైకొట్టె తెలంగాణ
అక్టోబర్ 29న కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా చెయ్యెత్తి మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. గులాబీవనంలా మారిన సభాస్థలిలో కార్యకర్తలు కేసీఆర్‌కు జైకొట్టారు. ప్రవాహంలా సాగిన సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఫిదా అయిపోయారు.