హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి గడ్డతో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కోనాపూర్ గ్రామాన్ని గతంలో పోసాన్పల్లి అని పిలిచేవాళ్లని, అది తన అమ్మమ్మ ఊరని చెప్పారు. కారుగొండలో తన మేనమామలు ఉండేవారని తెలిపారు. తన చిన్నతనంలో అమ్మ, అమ్మమ్మతో కలిసి కామారెడ్డికి వస్తే రైలుకట్ట పక్కనున్న బాదల్ సింగ్ మార్వాడీ ఇంట్లో ఉండేవాళ్లమని చెప్పారు. కారుగొండకు చెందిన నిమ్మల జివ్వారెడ్డి ఇంట్లో కూడా ఉండేవాళ్లమని వెల్లడించారు. అంతకు మించిన అనుబంధం తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నదని గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా జలసాధన ఉద్యమాన్ని ప్రారంభించినం. నీళ్ల విషయంలో తెలంగాణ ఎంత దోపిడీకి గురైందో ప్రజలకు తెలియజేసేందుకు 45 రోజులపాటు జలసాధన ఉద్యమం చేసినం. దోపిడీని ప్రజలకు వివరంగా చెప్పేందుకు టీఆర్ఎస్ తరఫున మండలానికి ఒక బ్రిగేడియర్‌ను నియమించినం. అందులో కామారెడ్డి మండల బ్రిగేడియర్‌గా నేనే పనిచేసిన’ అని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహించామని, అక్కడికి వెళ్లేందుకు కామారెడ్డిలోని దేశాయి బీడీ ఫ్యాక్టరీ, మరోచోట ‘ఒకరోజు గులాబీ కూలీ’ పని చేశానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలోనే కామారెడ్డికి చెందిన న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలంటూ తన బావ రామారావు, మిత్రుడు తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తద్వారా ఉద్యమానికి మద్దతిచ్చిన మొదటి బార్ అసోసియేషన్‌గా రికార్డు సృష్టించిందని చెప్పారు. ఆ తర్వాత కామారెడ్డిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, ఉప్పెనలా తెలంగాణ అంతటా విస్తరించిందని వివరించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తనని కామారెడ్డిలో నిలబెట్టడానికి గంప గోవర్ధనే చొరవ తీసుకున్నాడని తెలిపారు. కామారెడ్డికి తప్పకుండా రావాలని, కామారెడ్డి మరింత అభివృద్ధి కావాలని పదవిని త్యాగం చేసి తనను నిలబెట్టారని ప్రశంసించారు. గోవర్ధన్‌ను మరింత ఎత్తు పెంచే బాధ్యత, బరువు తనపై పడ్డదని పేర్కొన్నారు. తప్పకుండా గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని, ఆ బాధ్యత తనదేనని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తున్నాయని, కామారెడ్డికి కేసీఆర్‌తోపాటు పరిశ్రమలు, ఐటీ రంగం కూడా వస్తాయని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తునకలా చేసి మీకు అప్పగిస్తానని చెప్పారు. అందరం కలిసి కామారెడ్డిని అభివృద్ధి చెసుకుందామని పిలుపునిచ్చారు.
గత ఎన్నికల సమయంలో గంప గోవర్ధన్‌ను అభ్యర్థిగా నిలబెట్టి, తాను ప్రచారం చేస్తున్నప్పుడు కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చానని, ఆ మేరకు కామారెడ్డిని జిల్లా చేశామని, మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేశామని సీఎం తెలిపారు. ఈసారి గంప గోవర్ధన్‌తోపాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నాయకులు తనను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చాలాసార్లు అడిగారని చెప్పారు. దేవుని ఆశీస్సులతో వచ్చి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను గెలిస్తే ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ‘కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా! కేసీఆర్ వెంబడి చాలా వస్తాయి. మంచి విద్య అందేలా విద్యాసంస్థలు వస్తాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పరిశ్రమలు వస్తాయి. కాళేశ్వరం పెండింగ్ పనులు పూర్తి చేసి రెం డేండ్లలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెప్పించి చూపిస్తా. ఇట్లా ఊహకు కూడా అందని అభివృద్ధి కార్యక్రమాలతో కామారెడ్డి పట్టణంతోపాటు పల్లెల రూపురేఖలు మారుతాయి. ఆ బాధ్యత నాది’ అని స్పష్టం చేశారు.