
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన 317 జీవోపై రాష్ట్ర బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ జీవోపై ఉద్యమం పేరుతో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులే ఇలాంటివాళ్ల లాగులు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ బదిలీల్లో ఎఫెక్ట్ అయిన ఉద్యోగులు 58వేల వరకు ఉన్నరు. వారిలో ఇంకా ఉద్యోగంలో చేరని వారు 57 మంది మాత్రమే. దీన్ని పట్టుకొని ఉద్యమమట! ఇదేనా తెలివి? రేపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే కరీంనగర్ జిల్లా వారికి ఉద్యోగాలు వద్దా? సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలవారికి ఉద్యోగాలు వద్దా? అక్కడ ఖాళీలు రావద్దా? ఇంత దిక్కు మాలినతనంగా, దరిద్రంగా ఆలోచిస్తారా? మీకు సామాజిక బాధ్యత ఉన్నదా?’ అని రాష్ట్ర బీజేపీ నేతలపై సీఎం నిప్పులు చెరిగారు. ‘మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టినం.
స్టేట్ లెవల్ పోస్టులు అంటే 30% నాన్‌లోకల్ వాళ్లు వస్తరు. అది కూడా మల్టీ జోనల్ పోస్టులు అంటే నాన్‌లోకల్‌కు అవకాశం ఉండదు. కనీసం 1 లేదా 2 శాతం బయటికి పోతే 98% తెలంగాణ బిడ్డలకు రావాలని చేసినం. అది తప్పా? మీకేమైనా పరిపాలన తెలుసా? ప్రజల బాధ తెలుసా? వీళ్లు చెప్పింది అనుసరిస్తే.. రేపు రాబోయే 40-50వేల ఖాళీల్లో నాలుగు ఖాళీలు కూడా రావు. ఏ జిల్లాలో ఇలా ఎక్కడా ఖాళీలు రావు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని కోరుకుంటే ఆ జిల్లాలో ఉద్యోగాలు రావద్దా? 33 జిల్లాలు ఎందుకు చేసుకున్నం? ఎందుకు జోనల్ వ్యవస్థను చేసుకున్నం? ఎక్కడున్నవాళ్లకు అక్కడే ఉపాధి అవకాశాలు రావాలి. పరిపాలన అంతటా అందాలె. అందరూ బాగుపడాలి. పిల్లలందరికీ చదువులు రావాలి. అందరికీ సంక్షేమం అందాలనే చేసుకున్నాం. అంతేకాని ముద్దుపెట్టుకోవటానికి చేసుకున్నమా?’ అని ప్రశ్నించారు.
దేశంలో 15లక్షల ఖాళీలుంటే ఇక్కడ ధర్నానా?
కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేస్తున్నారన్న బీజేపీ నేతల విమర్శలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. ఇక్కడున్న బీజేపీ నేతలు సిగ్గు తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇచ్చిందెంత? డైవర్ట్ చేసింది ఏంది? ఏవీ డబ్బులు? అయినా దానిమీద రిపీటెడ్‌గా చెబుతూనే ఉంటం. అయినా సిగ్గులేకుండా అదేమాటా?’ అని చురకలు అంటించారు. అరటిపండు ఒలిచినట్టు బండారం బయటపెడుతుంటే.. బీజేపీ నేతలు తట్టుకోలేక అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వాళ్ల తప్పులు పెట్టుకొని మా మీదనా ఏడుపు? దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల్లో 15 లక్షల ఖాళీలుంటే ఇక్కడ ధర్నా చేస్తారా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘మేము ఇప్పటికే 1లక్షా 3వేల ఉద్యోగాలు ఇచ్చినం. నేడో రేపో మరో 50 వేల ఉద్యోగాలు ప్రకటించబోతున్నం. మీకేం తెలుసు? మీకో నెత్తా.. కత్తా! తెలంగాణ ఉద్యమంలో ఉన్నరా? ఈ రాష్ర్టానికి జరిగిన అన్యాయం తెలుసా? కొత్త జోనల్ విధానం తెచ్చినం. రాష్ట్ర యువత హక్కులు సాధించాం. 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసినం. ఇది టీఆర్ఎస్ ఘనత కాదా? ఇదే సెక్రటేరియట్లో 8 శాతం లేరు.. హైకోర్టులో 20శాతం లేరు.. అని ఉద్యమించినం. ఇయ్యాల 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి’ అని చెప్పారు.