హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి.. పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలి.. అన్న కల చెదిరిపోయింది. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్‌గా మార్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మూడు ముక్కలు చేసింది. విశ్వనగరం ఆకాంక్షను ధ్వంసం చేసింది. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే క్రమంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా, దేశంలోని అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఉన్నదానిని విచ్ఛిన్నం చేశారు. నగర అభివృద్ధికి బ్రేకులు వేశారు. పాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా విభజన అని చెప్తున్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఐటీ, ఫార్మా, రియల్ ఎ స్టేట్ రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు లే కుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు
చారిత్రక హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి కేంద్రంగా మలచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో అనేక విప్లవాత్మక విధానాలను అమలు చేసింది. మెగా ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించి, నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలిచింది. ఐటీ, ఫార్మా, స్టార్టప్ హబ్‌గా మరింత బలోపేతం చేయడానికి మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో ఎస్ఆర్డీపీ పేరిట ఫ్లైఓవర్లు, అండర్పాస్లూ, నాలాల అభివృద్ధి, మల్టిలెవల్ పార్కింగ్ హబ్‌లు, ఐటీ కారిడార్ల విస్తరణ, నగరానికి వన్నె తీసుకొచ్చేలా ఆకాశహర్మ్యాలకు ప్రోత్సాహం, నగర వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఏకీకృత పాలనా వ్యవస్థకు పెద్దపీట వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేసింది. దీంతో అనతి కాలంలోనే హైదరాబాద్ బ్రాండ్ విలువ అంతర్జాతీయంగా పెరిగింది. ఫలితంగా అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో కొలువుదీరాయి. దేశంలో ఏ నగరానికీ దక్కని ఖ్యాతిని హైదరాబాద్ దక్కించుకున్నది.
కాంగ్రెస్ పాలనలో మూడు ముక్కలు
2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నగరానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్ఎంసీగా ఏర్పాటుచేసింది. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం కళకళలాడింది. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రూ.వేలాది కోట్లు ఖర్చు చేశారు. గత పదేండ్లలో నగర విస్తరణకు అనువుగా శివారు ప్రాంతాలను కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే ఒక్కో మున్సిపాలిటీని రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసింది. ఓవైపు నగరాన్ని ఔటర్ వరకు విస్తరిస్తూనే, మరోవైపు ఏకీకృత బృహత్ నగరానికి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో హైదరాబాద్‌ను తీర్చిదిద్దింది. కానీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు హైదరాబాద్‌ను మూడు ముక్కలుగా చేసి, విశ్వనగర ఖ్యాతిని నీరుగార్చింది. దేశంలో అన్ని మెట్రో నగరాల కంటే దీటుగా ఎదుగుతున్న క్రమంలో రేవంత్తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మహానగరం కల విచ్ఛిన్నం చేసి హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చి వేసింది.
ఊరించి.. ఉసురు తీసి
నగరం శివారు ప్రాంతాల్లో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్కార్ నాడు దూరదృష్టితోనే పలు గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. స్థానికంగా నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులు కల్పించింది. గ్రామాలకు పట్టణ స్థాయిలో అభివృద్ధి ఫలాలను అందించింది. కానీ ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి, మహానగరంగా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ సర్కార్ ఊరించింది. దీనికోసం 300 జోన్ల పరిధిలో పేరుకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించింది. దాదాపు రూ.11 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించి, ఇందులో విలీనమైన మున్సిపాలిటీలను కొత్త డివిజన్లుగా మార్చింది. తీరా ఇప్పుడు నగరాభివృద్ధిపై ఏ మాత్రం అవగాహన లేకుండా మూడు ముక్కలుగా చేసి గ్లోబల్ సిటీ కలను చెరిపివేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఆదాయ వనరులు, రాజకీయ ప్రయోజనాల కోసమే గ్రేటర్ హైదరాబాద్‌ను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని మండిపడుతున్నారు. నగర ఖ్యాతి కనుమరుగు అవుతుందనే విషయాన్ని అధికార పార్టీ పెద్దలు మరిచిపోయారని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్లో ఏకరూప అభివృద్ధి సాగగా, మూడు కార్పొరేషన్ల ఏర్పాటుతో చెరో దారిలో సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్నాళ్లు జీహెచ్ఎంసీ జోన్ల పరిధిలో ఉన్న శివారు ప్రాంతాలను కలిపి మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన నిర్ణయంతో ఇతర మెట్రో నగరాల విస్తీర్ణంలోనూ, అభివృద్ధిలోనూ వెనుకబడే అవకాశం ఉన్నది.
దుష్ట క్రీడకు తెరలేపిన కాంగ్రెస్
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన కాంగ్రెస్ సర్కార్.. దుష్ట క్రీడకు తెరలేపిందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 150 డివిజన్లు, సైబరాబాద్‌లో 76 డివిజన్లు, మల్కాజిగిరిలో 74 డివిజన్ల లెక్కన కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కూడా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జరిగింది. విభజన చేసే ఉద్దేశం ఉన్నప్పుడు 300 వార్డులకు కలిపి రిజర్వేషన్లు ఖరారు చేయడం, పాలకమండలి రద్దు కావడంతోనే మూడు కార్పొరేషన్లుగా విచ్ఛిన్నం చేయడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరిత వైఖరి స్పష్టం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిన కాంగ్రెస్ విఫల ప్రయోగం నగరవాసుల పాలిట శాపంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందులో ఒక వర్గానికి లబ్ధి చేసే అవకాశం కూడా ఉన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నగర పాలన ఛిన్నాభిన్నం కావడంతోపాటు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ మరో వర్గంతో కలిసి సులభంగా దక్కించుకొనే వెసులుబాటు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ వేసిన ఈ తప్పటడుగులతో విశ్వనగరానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయం జనాల్లో కలుగుతున్నది.
పెట్టుబడులపై తీవ్ర ప్రభావం
గత పదేండ్లలో హైదరాబాద్ విశ్వనగరం దిశగా పయనించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ విభజన ఆ ప్రయాణానికి దిశానిర్దేశం లేకుండా పోయింది. నగరాభివృద్ధికి ఒక దీర్ఘకాలిక ప్రక్రియతో అభివృద్ధి చేసి, పదేండ్లలో వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. లక్షలాది మందికి ఉపాధినిచ్చి, అంతర్జాతీయంగా ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. జీనోమ్ వ్యాలీ కేంద్రంగా, నగరంలో ఫార్మా రంగానికి మెరుగులద్దింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేసిన విభజనతో హైదరాబాద్ నగరానికి వచ్చే పెట్టుబడులు ప్రభావితం అవుతాయని అంటున్నారు. గతంలో హైదరాబాద్ మొత్తంగా ఒకే అభివృద్ధి ప్రణాళిక, ఒకే విధానం ఉండటంతో ఏయే కంపెనీలు ఎక్కడ స్థాపించాలో, ఎక్కడ స్థలాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం సులభం అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మూడు కార్పొరేషన్లలో మూడు రకాల వ్యవస్థలు ఏర్పడుతాయని, పెట్టుబడిదారుల ప్రతిపాదనలను బట్టి ఒక్కో చోటికి వెళ్లాల్సి వస్తుందని, ఇది వారికి ఇబ్బందులు కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని అంటున్నారు.