CM KCR |కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తున్న. రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని, ధరణిని తీసేస్తామని చెప్తున్న ప్రతిపక్షాలకు బుద్ధివచ్చేలా ఓటేయాలి. ఓట్లు గుద్దితే పోలింగ్ బాక్సులు పలగాలె.
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు మొనగాళ్లని, అనతికాలంలోనే రికార్డుస్థాయిలో పంటలు పండించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. ‘కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తు న్నా’ అని పేర్కొన్నారు. రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని, ధరణిని తీసేస్తామని చెప్తున్న ప్రతిపక్షాలకు బుద్ధివచ్చేలా ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఓట్లు గుద్దుతే పోలింగ్ బా క్సులు పలగాలె’ అని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మిర్యాలగూడ, హుజూర్నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వా ద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజ లు ఎన్నికల ఒరవడిలో కొట్టుకొని పోవద్దని సూచించారు. ప్రజలు గెలిచేదే నిజమైన ఎన్నిక అని, అప్పుడే పాలకులు ప్రజలకు మంచి పనులు చేస్తారని చెప్పారు. ‘యువత ఆలోచన చేయాలి. ఎందుకంటే దేశం మీది, రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది, రేపటి బతుకుదెరువు మీది. కాబట్టి అల్లాటప్పాగా, ఆషామాషీగా ఓటు వేయకండి. ఆలోచించి ఓటు వేయండి. అదే మన తలరాతను, భవిష్యత్తును నిర్ణయిస్తది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉండే బ్రహ్మాండమైన ఆయుధం ఓటు. దానిని దుర్వినియోగం చెయ్యొద్దు’ అని దిశానిర్దశం చేశారు.

Kce Meeting
ఉచితంగా ఎరువుల బస్తాలు ఇస్తానని మాట ఇచ్చి తప్పాడంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘రైతులకు ఎరువులు ఎలా ఇద్దామని నేను ఆలోచిస్తున్న సమయంలో అశోక్ గులాఠీ అనే వ్యవసాయ శాస్త్రవేత్త నాతో మాట్లాడిండు. మీరు రైతుల మేలు కోరి తపిస్తున్నారు. మీ ఖజానా శక్తి ఏమిటో నాకు తెల్వదు. రైతులకు ఒక్క రూపాయి ఇస్తారా? రూ.రెండువేలు ఇస్తారా?.. ఎంత ఇవ్వదలుచుకున్నా రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బుకు రైతు యజమాని కావాలె. ఎందుకంటే కొందరి దగ్గర పోయిన సంవత్సరం తెచ్చుకున్న ఒకటిరెండు ఎరువుల బస్తాలు మిగిలి ఉండొచ్చు. కాబట్టి నేరుగా డబ్బు ఇస్తే ఒక రైతు విత్తనాలు కొనుక్కోవచ్చు, ఒక రైతు పురుగుల మందు కొనుక్కోవచ్చు. కూలీల కోసమో, ట్రాక్టర్ కోసమో వాడుకోవచ్చు. అప్పుడే సరిగ్గా వాడుకోగలరు. అప్పుడే మీరు అనుకున్నట్టుగా పంటలు పండుతాయి’ అని చెప్పారు. ఆ మేరకే రైతుబంధును పంపిణీ చేస్తున్నాం. ఫలితంగా ఒకప్పుడు 30-50 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణలో ఇప్పు డు 3 కోట్ల టన్నులు దాటింది. మిగతా ప్రాజెక్టుల పనులు కూడా పూర్తయితే 4 కోట్ల టన్నులతో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలోనే అగ్రస్థానానికి చేరుతాం. కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తున్నా’ అని తెలిపారు.
కండ్లముందు జరిగిన చరిత్రను కూడా కాం గ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘నేను మళ్లీ చెప్తున్నా.. నాగార్జునసాగర్‌ను కట్టాల్సిన జాగాలో కట్టలేదు. దానివల్ల ఎంతో అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కడితే.. ఈ బాధలుండేవి కాదు. మూసీనది దాటేవరకూ నల్లగొండకు నీళ్లు వచ్చేవి. నాటి ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు టక్కుటమార విద్యలతో దానిని మార్చుతుంటే.. నోరుమూస్కొని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు. నేను ఈ నిజాలు చెబితే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎగిరెగిరి పడ్డడు. నాగార్జున సా గర్ నెహ్రూ కట్టిండని అంటుండు.. నేనే కట్టానని చెప్పానా? లేదే? మాకు అబద్ధాలు చెప్పే అవసరం ఉన్నదా? కట్టాల్సిన కాడ కట్టలేదు. రావాల్సిన నీళ్లు వస్తలేవు అంటున్నాం. ఆంధ్ర నాయకులు కుడి కాల్వకు నీళ్లు ఎక్కువ పట్టుకుంటూ.. ఎడమ కాల్వను ఆగం పట్టించారని మొదటినుంచీ మొత్తుకుంటున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు అని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ప్రాణాలు పణంగా పెట్టి తాను పోరాడుతుంటే తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులు ఒక్కడైనా రాజీనామా చేసిండా? అని ప్రశ్నించారు.
2003లో మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ప్రాంత రైతులు నీళ్ల కోసం వస్తే.. అందర్నీ జమచేసి నాగార్జునసాగర్ కట్టపైకి వెళ్లి నాటి ప్రభుత్వానికి ఒకటే చెప్పిన. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి తూము పగల గొట్టడం లేదు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే 5 లక్షల మందితో వస్తా.. తూము విప్పుతా అని హెచ్చరించిన. నాటి మిర్యాలగూడ యువకులు సార్ 70 వేల మందిమి ఉన్నాం. తూము విప్పేద్దాం.. ఏమైతది? అన్నారు. తూము విప్పితే నీళ్లు రావు.. పోలీసుల వస్తారు. తెలివితో ఉండండి.. మీకెందుకు తెల్లారేసరికి నీళ్లు వస్తయని చెప్పి.. అన్నట్టే నీళ్లు విడిచిపెట్టారు
– సీఎం కేసీఆర్
కాంగ్రెస్ 50 ఏండ్లు పాలించినా మిర్యాలగూడ, హుజూరాబాద్‌లోని చివరి ఆయకట్టు భూములకు నీళ్లు ఎందుకు రాలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి పంటకూ నీళ్లకోసం ఉద్యమాలు ఎందుకు జరిగేవని నిలదీశారు. ‘తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టెయిల్ ఎండ్‌పై కొట్లాడలేదు. వాళ్లకు మంత్రి పదవొస్తే చాలు. ప్రజలేమైపోయినా మారు మాట్లాడకపోయేవాళ్లు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయని, 9 ఏండ్లలో 18 సార్లు కృష్ణా నీళ్లు ఇచ్చి, హుజూర్నగర్ టెయిలెండ్ రైతుల బాధలు తీర్చినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆసిఫ్‌నగర్ కెనాల్ ద్వారా నల్లగొండ ఉదయసముద్రానికి, అక్కడి నుంచి పెద్దదేవులపల్లి చెరువులోకి నీళ్లు వస్తాయని, దీంతో సాగర్ ఆయకట్టు రైతుల నీళ్ల సమస్య శాశ్వతంగా తీరిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లటంతో దిండి లిఫ్ట్ ఆలస్యమైందని, ఇప్పుడు కోర్టు చిక్కులన్నీ పోవటంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు. అది పూర్తయితే దేవరకొండలో ఐదు రిజర్వాయర్లు, బరాజ్ కూడా వస్తాయని, దీంతో నియోజకవర్గ ప్రజల దరిద్రం పోతుందని అన్నారు.
‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడితే గడ్డం తీసుకోను అంటడు. శపథాలు కడుతడు. తీసుకుంటే మాకేంది.. తీసుకోకుంటే మాకేంది. ఇక్కడ కావాల్సింది శపథాలు కాదు.. ప్రజలకు పనులు కావాలె, నీళ్లు కావాలె, కరెంటు కావాలె. ఇటీవల కృష్ణా నదిలో తగినన్ని నీళ్లు రాక శ్రీశైలం దగ్గరే ఆగిపోయాయి. దీంతో నాగార్జునసాగర్‌కు నీళ్లు రాలేదు. అప్పుడు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భగత్ వంటి నేతలు నాకు ఫోన్ చేసి పంటలు ఎండుతున్నయ్.. 10 రోజులు నీళ్లు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. నేను అధికారులను పిలిపించి మాట్లాడి.. వెంటనే నీళ్లు వదలాలని చెప్పిన. ఇప్పుడు కూడా హుజూర్‌నగర్‌కు ఐదురోజులు నీళ్లు అడుగుతున్నారని, తేదీలు చెప్తే నీళ్లు వదిలేలా చూస్తా’
– సీఎం కేసీఆర్
తెలంగాణలో గులాబీ జెండా ఎగిరినంక టీఆర్ఎస్ నాయకులే ప్రతి విషయంలో కొట్లాడారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ‘నాడు కాంగ్రెస్ నాయకులు నీళ్ల కోసం సీఎం దగ్గరకు ఎందుకు పోలేదు? నీళ్లు ఇస్తవా చస్తవా? రాజీనామా పడేయమంటవా అంటే నీళ్లు ఇవ్వరా? దెబ్బకు దిగిరాడా? కానీ వాళ్లు అడగలేదు. వాళ్లకు పదవులు, కాంట్రాక్ట్‌లు, పైరవీలు ముఖ్యం’ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేగులు తెగేదాంక కొట్లాడారని చెప్పారు. ‘తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడినప్పుడు ఉత్తమ్కుమార్రెడ్డితోసహా ఎంతోమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒక్కడంటే ఒక్కడు కూడా అరేయ్ సీఎం సన్నాసి.. అట్లెట్ల మాట్లాడతవ్రా? అని లేచి నిలబడలేదు. ఇయ్యాల హుజూర్నగర్, నల్లగొండ, నాగార్జునాసాగర్‌లో వీళ్లకు ఓట్లు కావాలె. కానీ తెలంగాణ ప్రజల బాధలు వారికి అవసరం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రులున్నారని, ఏ వాడకట్టుకు చూసినా వారికి ముఖ్యమంత్రే ఉంటారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి నేనైతానని వాడంటే.. నువ్వెట్ల అయితవ్ బే నేనవుతానని ఇంకోడంటడు. వాడెట్ల అవుతడ్రా వాడి సంగతేందో చూద్దామని మరొకడంటడు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో లేదు. హుజూర్‌నగర్‌లోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రినైతనని ఒకడు.. నేను బుడ్డరఖాన్ అయితనని మరొకడు మాయమాటలు చెప్పి వస్తున్నారు. అందుకే పార్టీ తరఫున నిలిచే వ్యక్తినే కాదు.. అతని వెనుకున్న పార్టీని కూడా చూడండి. ప్రజల గురించి వారెలా ఆలోచిస్తున్నారో చూసి ఓట్లు వేయండి’ అని ప్రజలకు సూచించారు. గత తొమ్మిదిన్నరేండ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ వెళ్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘మిషన్ భగీరథతో మంచినీళ్ల గోస తప్పింది. ఫ్లోరైడ్ బాధ పోగొట్టుకున్నాం. ప్రాజెక్టులతో సాగునీళ్లు వచ్చాయి. గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజన, ఆదివాసీల హక్కులు కాపాడినం’ అని పేర్కొన్నారు. రైతుబంధు ఉండాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగా.. సభకు హాజరైన ప్రజలంతా ‘ఉండాలి’ అని నినదించారు. దీంతో ‘ఎత్తిన చేతులతోనే నవంబర్ 30 నాడు గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలె’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. రేవంత్.. నువ్వు ఎప్పుడన్నా ఎకరం పొలం దున్నినవా? నీకు ఎవసం లేదాయె ఎద్దు లేదాయె. హైదరాబాద్‌లో ఎయిర్ కండీషన్లో ఉండి మాట్లాడుతావు. నాకు వ్యవసాయం ఉన్నది. పొలంకాడ 27 బోర్లు వేశాను. అందుకే కరెంటు ఎలా ఉండాలి.. ఎంతసేపు ఇస్తే పొలం పారుతుందో తెలుసు. అందుకే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం’
– సీఎం కేసీఆర్

ధరణిని తీసేయాలని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘ధరణి ఎందుకోసం తెచ్చినం? రికార్డులు పారదర్శకంగా ఉండాలి, రైతుల భూమి మీద హక్కులు వాళ్లకే ఉండాలె. అంతకుముందు ఆర్ఐ, ఎమ్మార్వో, ఆర్డీవో.. ఇట్లా ఒక రైతుకు 8 మంది భర్తలు ఉండేది. ఎవరికి కోపం వచ్చినా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే అయ్యేది. భూమి తెల్లారెసరికి వేరేవాళ్ల పేరుమీదికి రాసేటోళ్లు. మళ్లా మార్చాలంటే లంచం ఇవ్వాలనేవారు. ధరణి వల్ల ఇప్పుడు రైతుల భూముల వివరాలు, బ్యాంకు ఖాతాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రైతుబంధు వేసినా, రైతుబీమా వేసినా, పంటకొనుగోళ్ల డబ్బు వేసినా నేరుగా రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. భూమిపై ధరణి ద్వారా రైతులకే అధికారం ఇచ్చినం. ఆ అధికారాన్ని ఉంచుకుంటరా? పోగొట్టుకుంటారా? ఆలోచించండి’ అని సూచించారు. అనాదిగా దళితబిడ్డలు అణచివేతకు, వివక్షకు గురవుతున్నారని, వారి వెతలు తీర్చేందుకు దళితబంధులు అమలు చేస్తున్నామని చెప్పారు. దళిత సమాజం ఆలోచించాలని, ఇలా చేసేవాళ్లను ప్రోత్సహిస్తూ గెలిపించాలని కోరారు. గిరిజన సోదరులను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదని సీఎం గుర్తుచేశారు. తండాలను పంచాయతీలుగా మార్చి వారి కలను నెరవేర్చామని చెప్పారు. ఎస్టీలకు ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో వారిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
హుజూర్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. హుజూర్నగర్ అభివృద్ధి బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
రవీంద్రకుమార్ ఉద్యమ బిడ్డ, మంచి ఎమ్మెల్యే అని, ఎవ్వర్నీ బాధపెట్టే వ్యక్తి కాదని సీఎం అన్నారు. పార్టీలో చేరిన దగ్గర్నుంచి నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నారని ప్రశంసించారు. దేవరకొండ వెనుకబడినది కాబట్టి తనకు కూడా ప్రత్యేకమైన దృష్టి ఉన్నదని పేర్కొన్నారు. ‘మళ్లీ దేవరకొండకు వస్తా. మీ అందరితో ఉంటా. తెలంగాణ కోసం కొట్లాడిన విధంగా.. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కొట్లాడాలి. మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుతది. మన ప్రభుత్వమే వస్తుంది. ఎలాంటి అనుమానం లేదు’ అని సష్టం చేశారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగారని, ఎన్నికల తర్వాత జీవో ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చాలా నిజాయితీపరుడని, ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా తన వ్యక్తిగత పనుల గురించి అడగలేదని, పట్టణ అభివృద్ధి, తండాల సమస్యలు, పారిశ్రామికవాడ గురించి మాత్రమే అడిగేవారని సీఎం తెలిపారు. ఆయన తరచూ చెక్‌డ్యామ్‌లు, లిఫ్టులు కావాలని కోరతారని, ఆయన స్వయంగా రైతు కాబట్టి, వారి బాధలు తెలుసు కాబట్టి రైతులు ఇబ్బందులకు గురికావద్దనే తపన ఆయనలో ఉంటుందని అన్నారు. దామరచర్ల మెగా పవర్ ప్లాంటు భూములకు నష్ట పరిహారం ఇప్పించే విషయంలో భాస్కర్‌రావు చక్కగా చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. ఈ పవర్‌ప్లాంట్‌లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని భాస్కర్‌రావు కోరారని, ఆ విధంగా వారికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సంపదను పెంచి, పేదలకు పంచామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కల్యాణలక్ష్మిని ప్రారంభించినప్పుడు రూ.50 వేలు ఇచ్చామని, తర్వా త రూ.75 వేలకు, ఇప్పుడు రూ.లక్షకు పెంచామని గుర్తుచేశారు. ఆసరా పెన్షన్లను ముందుగా రూ.వెయ్యితో మొదలుపెట్టి రూ.2 వేలు చేశామని, మరోసారి అధికారంలోకి రాగానే రూ.3 వేలకు పెంచి, క్రమంగా రూ.5 వేలు చేస్తామని పేర్కొన్నారు. రైతుబంధును రూ.16 వేలకు తీసుకుపోతామని వెల్లడించారు. ప్రజలందరూ గౌరవంగా సన్నబియ్యం తిన్నాలనే ఉద్దేశంతో 93 లక్షల రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్‌ను తక్కువ ధరకు అందిస్తామని, మహిళలకు రూ.3 వేలు ఇస్తామని తెలిపారు. పేదలు, రైతుల సంక్షేమంలో వెనకడుగు వేసేదిలేదని హామీ ఇస్తూ బీఆర్ఎస్ను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.
సీఎం కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం. మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లలో రూ.4,600 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశాం. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పట్టణంలో ఏరియా దవాఖానను 200 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేసుకున్నాం. ఇందుకోసం రూ.16 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపడుతున్నాం. పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని అడిగాం. ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరయ్యాయి.
– మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే పయనిస్తా. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తా. ఉప ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. నాలుగేండ్లలో రూ.4 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. చెక్‌డ్యామ్‌లు, ఆర్డీవో కార్యాలయం, రూ.2 వేల కోట్లతో ముక్త్యాల మేజర్ లైనింగ్, మూసీ నదిపై చెక్‌డ్యామ్‌లు, గుండ్లపహాడ్ లిఫ్ట్ తీసుకొచ్చా. ఇక్కడ 20 ఏండ్లు పాలించినాయన ఎన్నికలప్పుడు తప్ప ఏ ఒక్క రోజూ కనపడలేదు. ఒక్కో గ్రామంలో కోటి నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టినం. నాలుగేండ్లలో నేను చేసిన అభివృద్ధి కండ్ల ఎదుట కనిపిస్తున్నది. కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మాడల్‌గా తీర్చిదిద్ది మీ రుణం తీర్చుకుంటా.
– హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణను అదర్శంగా తీసుకుంటున్నారు. ఇక్కడి పథకాలను అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రెండు లిఫ్ట్‌లు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి. డిండి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేపట్టాలని సీఎంను కోరుతున్నాం.
– దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్