హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ క్రియాహీనమైన, నిష్క్రియాపరమైన, అవివేకమైన, అసమర్థ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కొండంత రాగం తీసి..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. సాధించిన విజయాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తు విజన్ ఏంటి అన్నదానిపై ఈ సమావేశాల ద్వారా సందేశమిస్తారని దేశమంతా ఆసక్తిగా చూసింది. అలాంటిదేమీ జరుగలేదు. ప్రధాని ఏం మాట్లాడిండో భగవంతునికే ఎరుక. కేంద్రమంత్రులు కేసీఆర్‌ను తిట్టి నోటిదూల తీర్చుకొని పోయిండ్రు తప్ప.. ఏ విషయంలోనూ ఏం చెప్పినట్టు లేదు. నాలుగు రోజులుగా ఏమన్నా చెప్తారేమోనని చూస్తున్నా.. అయినా ఏం లేదు.
బబ్రాజమానం.. భజగోవిందం..
రాష్ట్రపతి ఎన్నికల కోసం మేం బలపర్చిన అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌కు వచ్చారు. కో ఇన్సిడెంట్‌గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మా సమావేశం ఒకేసారి జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానిని నేను కొన్ని ప్రశ్నలు అడిగా. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా సమాధానాలు చెప్పాలని అడిగా. ఆయన అవినీతి విధానాలు.. దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు.. బీజేపీ అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రశ్నలు అడిగా. ఇవన్నీ ప్రజలకు సంబంధించినవే. ఒక్కదానికీ ఆయన సమాధానం చెప్పలే.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మంత్రులు.. ఎవ్వరూ చెప్పలే. ఎందుకంటే వాళ్లల్లో సరుకులేదు.. సబ్జెక్టులేదు. ఆబ్జెక్టులేదు. అన్నీ శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు. డబ్బా.. బబ్రాజమానం భజగోవిందం. దేశ ప్రజలను బీజీపీవారు ఆశోపాతులను చేసిన్రు. అశక్తులమని వాళ్ల డొల్లతనాన్ని వాళ్లే రుజువు చేసుకున్నరు. దేశప్రగతిపై గంభీరమైన దృక్పథం, అవగాహన, వ్యూహం, దార్శనికత బీజేపీ దగ్గర లేవని రుజువు చేసుకున్నరు. ఇక తెలంగాణకు చేసిందేం లేదు. వాళ్ల వల్ల అయ్యింది లేదు. పోయింది లేదు. తెలంగాణ వచ్చినంక వాళ్లు ఇచ్చిందేం లేదు. దేశానికి ఏం చేయలే.. తెలంగాణకు ఆయింత ఏం చేయలే. బీటింగ్ ఎరౌండ్ ది బుష్ అన్నట్టు జరిగింది తప్ప.. మరేం లేదు.
మీరు ప్రశ్నించిందే.. మేం ప్రశ్నిస్తున్నం..
యశ్వంత్‌సిన్హా సభలో నేను స్పష్టంగా అడిగిన. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ గొంతు చించుకొని ‘ఏ దేశంలో పతనం కాని రూపాయి విలువ అతి భయంకరంగా మన దేశంలోనే పతనమవుతున్నది. నేను సీఎంగా అడుగుతున్న.. నేను తెలుసుకోవాలనుకుంటున్నా’ అంటూ చాలా గంభీరంగా ప్రశ్నించారు (వీడియో చూపిస్తూ). ఇప్పుడు మేం అదే అడుగుతున్నం.
మోదీ ఎందుకు సమాధానమివ్వరు? మీరు స్వచ్ఛమైనవారైతే, జవాబుదారియే అయితే, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఏ ప్రధాని హయాంలో లేనంతగా మోదీ ప్రభుత్వంలో దారుణంగా డాలర్‌తో పోల్చితే రూ.80 వరకు విలువ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీరు ప్రశ్నించినట్టే ఇతరులు కూడా ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నించరు? ఇది ప్రజాస్వామ్యమా? కుట్రల రాజ్యమా? దేశంలో ప్రజాస్వామ్యం నడపాలనుకుంటున్నారా? కుతంత్రాలు చేయాలనుకుంటున్నారా? రూపాయి విలువ పడిపోవడం నిజం కాదా? ఇది మీ అసమర్ధత, అవివేకం, చేతగానితనం కాదా? దీనిపై దేశప్రజలకు మీరు సమాధానం చెప్పాలికదా! ఏదో డబ్బాల రాళ్లు వేసి నాలుగు మాటలు లడలడా వాగుతమంటే కుదరదు.
గూండాగిరీ చేస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? గూండాగిరీ చేస్తున్నారా? జడ్జీలను, సీఎంలను భయపెడతారు. నాలుగింట మూడొంతుల మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలను కూడా బెదిరిస్తారా? ఏక్నాథ్ షిండేలను పుట్టిస్తామంటున్నరు! తమాషా అవుతున్నదా? ఇంత అహంకారం ఎందుకు? ఏయే రాష్ర్టాల్లో ఏయే పార్టీలను ఎలా కలుపుకొన్నారో వివరిస్తూ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ శీర్షికతో ఇండియాటుడే పత్రిక కథనం ప్రచురించింది. ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో ఏక్‌నాథ్‌షిండే వస్తడట. ముషీరాబాద్‌లో ముఠాగోపాల్ దెబ్బకు గింగిరాలు తిరిగి, ఢిల్లీలో ఎవరి కాళ్లో పట్టుకొని వేరే రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన ఒకాయన మతి తప్పి మాట్లాడుతున్నడు. అసలు కట్టప్ప కథ తెలుసా ఈ సన్నాసికి! నువ్వు చెప్పే కట్టప్ప నిన్నే పొడిచిపారేస్తడు తెలుసా? మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నిన్న 20 శాతం కరెంటు చార్జీలు పెంచారు. ప్రజలకు ఇది బహుమానం.
జర్నలిస్టులను నక్సలైట్లంటరా?
ప్రముఖ జర్నలిస్టులు హిందూ పేపర్‌కు చెందిన ఎన్ రామ్, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ తదితరులు ఊటీలో సమావేశం పెట్టుకొంటే వాళ్లను నక్సలైట్లని ఫొటో పెట్టిండు ఒకడు. మీకు జర్నలిస్టులు నక్సలైట్లలా కనిపిస్తున్నరా? ఎంత కండ్లు నెత్తికెక్కుతున్నయ్ మీకు? మీరు ప్రజాస్వామ్య హంతకులు కారా! ఎక్కడిదాక మీ ఉన్మాదం? సుప్రీం కోర్టు, హైకోర్టు, జర్నలిస్టులు అంటే లెక్కలేదు. మూడింట రెండింట మెజారిటీతో గెలిచిన ప్రభుత్వమంటే గౌరవం లేదు. ఎవరిని ఉద్ధరించడానికి మీ లొడలొడ?
భయపడే వాళ్లం కాదు
మేము భయపడే వాళ్లం కాదు. సొల్లు పురాణం కాదు.. ఎక్కడ అవినీతి ఉన్నదో చూపించు. కేసీఆర్ ఎవరికీ భయపడడు. ఎందుకంటే.. నా దగ్గర మనీ లేదు.. లాండరింగ్ లేదు. నాకు కొంచెం వ్యవసాయ భూమి ఉన్నది. దొంగతనం చేసినోడు ఎవరైనా భూమి కొనుక్కుంటారా? దాచి పెట్టేదా భూమి? ప్రజల ముందు పరుచుకొని ఉంటుంది. పిట్ట బెదిరింపులకు.. ఎవరూ భయపడరు. మాతోటి గోక్కుంటే.. అగ్గితోటి గోక్కున్నట్టే.. జాగ్రత్త. నువ్వు గోకినా.. గోకకపోయినా.. నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.