CM KCR | ధరిణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా? రైతులను వేస్తావా? నీ పాలసీ ఏంది? అంటూ ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలేంటని నిశితంగా గమనించాలి. ఈ జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క ఆయన, రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు కంఠోపాఠంగా చెబుతున్నరు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని చెబుతున్నరు. అవసరం లేదని చెబుతున్నరు. మళ్లీ వీఆర్వోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు.. మళ్లీ ఎమ్మార్వోలు.. మీ భూములపై పెత్తనం వాళ్ల చేతుల్లోకి పోతుంది’ అంటూ హెచ్చరించారు.
‘రైతుబంధు డబ్బులు హైదరాబాద్‌లో విడుదల చేస్తే సెల్ఫోన్లు మోగుతున్నయ్. ఆ డబ్బులను మీ ఇష్టంగా పెట్టుబడికి వాడుకుంటున్నరు. మంచి పంటలు పండిస్తున్నరు. పంటల డబ్బులు వస్తున్నయ్. ఎవరైనా చనిపోతే బీమాడబ్బులు పైరవీలు లేకుండా వస్తున్నయ్. మరి ధరణిని తీసివేస్తే ఈ డబ్బులు ఎట్ల వస్తయ్ ? మరి డబ్బులు ఎలా వస్తయ్. ధరిణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా? రైతులను వేస్తావా? నీ పాలసీ ఏంది? ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాదు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తే ఏమతది.. ఒక రైతుకు పదెకరాల భూమి ఉంటే మళ్లీ పహానీ నకళ్లు, అగ్నికల్చర్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. వాళ్లు నీకెంతున్న భూమి. సరే నీకెంత వస్తుంది రూ.లక్ష వస్తుందంటే.. నాకు రూ.30వేలు ఇవ్వని మళ్లీ చేయి చాపుతాడు. ఇవాళ రైతుల కడుపులో చల్ల కదలకుండా ఏ ఆఫీస్‌కి వెళ్లకుండా దరఖాస్తు పెట్టకుండా.. మీ అకౌంట్లు ధరణి వల్ల ప్రభుత్వం వద్ద ఉంది కాబట్టి డబ్బులు బ్యాంకు అకౌంట్లలో చేరుతున్నయ్. ఒక్క రూపాయి విడుదల చేస్తే.. ఒక్క పైసా తరుగుపోకుండా ఆ రూపాయి మీ బ్యాంకులో చేరుతున్నది’ అన్నారు.
‘కాంగ్రెస్ నాయకులు వ్యవసాయం గురించి ఏం నాలెడ్జ్ ఉందో.. రైతుల గురించి ఏం అవగాహన ఉన్నదో తెలియదు కానీ.. తీసివేస్తమని మాట్లాడుతున్నరు. మళ్లీ దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. లంచాల రాజ్యం మళ్లీ రావాల్నా? ఆలోచన చేయాలి. ప్రజలు కట్టే పన్నులను పని లేక రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నడు అని పీసీసీ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు. రైతుబంధు ఉండాలనుకుంటే రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావ్ ఇద్దరూ బంపర్ మెజారిటీతో గెలవాలి. ఇద్దరిని గెలిపిస్తే రైతుబంధు మార్చి తర్వాత రూ.12వేలు అవుతుంది. ఆ తర్వాత రూ.16వేలు అవుతుంది. రైతుబాగుంటేనే గ్రామాలు చల్లగుంటేనే పది మందికి పని దొరుకుతుంది.. అందరూ బతుకతరు. ఆ ఉద్దేశంతే ధరణిని తీసుకువస్తే దాన్ని తీసి బంగాళాఖాతంలో వేయాల్నా? రైతుబంధు వేస్టా..? ఎవరు వేస్ట్ గాళ్లు? ఎవరిని బంగాళాఖాతంలో వేయాల్నో మీరు నిర్ణయం చేయాలని మాట్లాడుతున్నా’నన్నారు.
‘ఇంకోటి చాలా తీవ్రమైన మాట కాంగ్రెస్ మాట్లాడుతున్నది. బహిరంగంగా మాట్లాడుతున్నరు. వాళ్లకు దేవుడు ఏం బుర్ర ఇచ్చిండో ఎంత బుర్ర ఉన్నదో తెలియదు కానీ.. కేసీఆర్ 24గంటల కరెంటు వేస్త్గా ఇస్తున్నడని అంటున్నరు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. వ్యవసాయం ఎరుకనా.. ఎన్నడన్న పొలం దున్నిండా పొలం. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందటా? మూడు గంటలు ఇస్తే ఒక మడి కూడా తడుస్తుందా? మూడు గంటల్లో పారాలంటే 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలటా.. రైతు 10హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటడా? మనం పెట్టుకునేది మూడు, ఐదుహెచ్పీ మోటర్ వాడేది. పది హెచ్‌పీ మోటర్ కాంగ్రెసోడు కొనిస్తడా? మళ్లీ గ్యారంటీగా తప్పిపోయి గెలిస్తే గోల్మాల్ చేస్తామని ఓపెన్‌గా చెబుతున్నరు. మరి వాళ్లను గోల్మాల్ చేద్దామా? మనం అవుదామా ? ఆలోచన చేయాల్సింది మీరు అని మనవి చేస్తున్నా’నన్నారు.
‘వాళ్లు ఎన్నడూ ప్రజల క్షేమాన్ని కోరలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పెన్షన్లు పెంచుకుంటున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న కొద్దీ ట్యాక్స్ వస్తున్నయ్ సంపద పెరుగుతున్నది. పెరిగిన సంపదను రైతులు, పేదలకు, పెన్షన్లకు పెంచుకుంటూ పోతున్నాం అందురూ బాగుండాలని. ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యం ఎన్నడూ ఆలోచన చేయాలి. ఎంత పెరిగినా వాళ్లు పంచుకొని తిన్నారు తప్పా.. ప్రజలకు పంచాలని చూడలేదు. రూ.2వేల పెన్షన్ ఇచ్చేది ఇండియాలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కన ఏపీలోనూ ఇస్తున్నరు. మనం కూడా ఇస్తున్నం. కర్నాటక నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చిండు.
ఆయన ఎంత తెలికళ్లోడంటే కేసీఆర్.. మా గొప్ప తనం తెలుసా? మేం రూ.600 పెన్షన్ ఇస్తున్నాం అంటున్నడు. సన్నాసి మేం రూ.2వేలు ఇస్తున్నమని చెప్పాం. కావాలంటే కర్నాటకు వచ్చి చూడు అంటున్నడు. వ్యవసాయానికి 5గంటల కరెంటు ఇస్తున్నం తెలుసా నీకు అంటున్నడు. 24 గంటల కరెంటు ఇచ్చేకాడ.. ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అంటే దేంతో నవ్వాల్నో నాకే అర్థంకావడం లేదు. వాళ్లు ఎన్నడూ పేదల గురించి ఆలోచించలేదు. మంచినీళ్లకు ఎంతో బాధ ఉండేది. కండ్ల ముందు గోదావరి.. నీళ్లకు చావాలి. భద్రాచలం, పినపాక గానీ, గూడాళ్లో వర్షాకాలం వచ్చిదంటే మంచంపట్టిన మన్యం అంటూ పేపర్లలో వస్తుండే. మిషన్ భగీరథ వచ్చిన తర్వాతం మంచం పోయింది. ఏం బాధ లేదు’ అన్నారు.
‘నాకంటే దొడ్డుగా, ఎత్తుగున్నోళ్లు ఎందరు ముఖ్యమంత్రులు కాలేదు ? మరి మంచినీళ్లు ఎందుకు రాలేదు. ఎందుకు రాలేదు ? తెలివి లేకనా? ఆలోచన లేకనా..? ప్రజలను ప్రజల ఖర్మానికి వదిలేసా? ఆలోచన చేయాలి. నదులు లేకుండెనా? కృష్ణా, గోదావరిను కొత్తగా తీసుకువచ్చానా? రెండు నదులు ఇప్పటికే ఉండేకదా? ఉన్నకాడి కొన్ని ప్రాజెక్టులు ఉండే కదా? మరి మంచినీళ్లు ఎందుకు రాలేదు. ప్రజలపై ప్రేమ ఉంటే.. నీళ్లు రావాలంటే వచ్చి తీరాలే. ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో నిలబడం.. ఓట్లు అడగమని చెప్పాను.. ఐదేళ్లలో తెచ్చి చూపించాం. కమిట్మెంట్తో చేస్తే వచ్చాయ్. రావాలనుకున్నాం.. వెంటపడ్డాం. వచ్చాయి. మీదగ్గరి నుంచి 16 మండలాలకు దుమ్మగూడెం నుంచి.. ఇవన్నీ మీకు తెలుసు. రెండు నదులు ఉండంగ కూడా పంటలను ఎండవెట్టి.. పండవెట్టి మనల్ని కరువుకు గురి చేశారు. రాత్రిళ్లు కరెంటు పెట్టబోయి పాములు, తేళ్లు కరిచి చట్టిపోయేట్టు చేశారు’ అంటూ ధ్వజమెత్తారు.