CM KCR | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 20 సీట్లలోపు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కాం గ్రెస్‌లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. వాళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు. అదొట్టి గ్యాస్. మళ్లా గదే 20లోపు సీట్లు’ అని ఎద్దేవా చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ మాట తాను ఉత్తగ చెప్పట్లేదని, తాను ఎట్లయితే నియోజకవర్గాలకు పోతా ఉన్నానో అట్ల కాంగ్రెస్ ఊడ్చుకుపోతున్నదని.. ఇంకా ఊడ్చుకుపోతదని అన్నారు.
మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభల్లో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ తిండికి ఎండపెడితే.. పదేండ్లలో రైతులను తిండిపెట్టే స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. ఇందిరమ్మ దరిద్రపు పాలన మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను గంగలో పడేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గత పాలనను, బీఆర్ఎస్ పదేండ్ల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో రాక్షస కోణం
‘స్వరాష్ట్రంలో కంటివెలుగు ద్వారా ఉచితంగా 80 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశాం. ఆపరేషన్లు చేయించాం. కాంగ్రెస్ రాజ్యంలో ఇలాంటి పథకాలు ఉండెనా? ఇంకా కాంగ్రెస్ ఎట్ల గెలుస్తుంది’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేండ్లలో ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీని అరికట్టామని తెలిపారు. మానవీయ దృక్పథంతో యావత్తు తెలంగాణను బాగుచేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు పెట్టాం అని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణముంటే.. బీఆర్ఎస్ పాలనలో అడుగడుగునా మానీయకోణం కనిపిస్తున్నదని తెలిపారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కాటగలుస్తది
తాను ప్రజల పన్నులన్నీ రైతులకు రైతుబంధు ఇచ్చి వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 24 గంటల కరెంటు వేస్ట్.. 3 గంటలు చాలని, 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలని రేవంత్ బహిరంగంగా చెప్తున్నారని, మరి 30 లక్షల పంపుసెట్లకు 30 వేల కోట్లు ఎవరిస్తరని నిలదీశారు. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే నిజంగానే కరెంటు కాట గలుస్తదని హెచ్చరించారు. ధరణిని తీసేసి భూమాత పెడ్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అది భూమాతనా? లేక భూమేతనా? అని ప్రశ్నించారు. రైతులను మళ్లీ పాత కాలానికి తీసుకుపోయి గోసపెట్టే కుట్ర అని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను పసిగట్టి.. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
మధిర మొత్తానికి దళితబంధు
‘ఇక్కడ మధిరలో ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్నడు. అయినా పక్షపాతం పట్టలె. ఎవరూ డిమాండ్ చేయకున్నా నాకు నేనుగా నాలుగు మండలాలు తీసుకుంటే దాంట్ల చింతకాని ఒకటి’ అని కేసీఆర్ వెల్లడించారు. దళితుల జీవితాలను బాగుచేయాలనే దళితబంధు పథకం పెట్టినట్టు వెల్లడించారు. మధిర బీఆర్ఎస్ అభ్యర్థి కమల్‌రాజ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగా మధిర నియోజకవర్గంలో ప్రతీ దళితకుటుంబానికి రూ. పది లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.
‘పట్టిలేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది? చేసింది ఏంది? నియోజకవర్గానికి ఆర్నెళ్లకు ఓసారి వస్తడు. చుట్టపు చూపుగా వచ్చే మనిషి ఏం బాగుచేస్తడు? వట్టిగానే మాయామశ్చీంద్ర చేస్తడు. నేనే సీఎం అని చెప్తున్నడు. ఎక్కడ నీకు సీఎం.. నీ పార్టీ గెలిస్తేనా? అదంతా అయ్యే పనికాదు. ముఖ్యంగా దళితవర్గం ఒక్క ఓటుకూడా భట్టి విక్రమార్కకు పడొద్దు. ఇప్పుడు మార్పు అంటున్నరు. మరి అదే నిజమైతే భట్టి విక్రమార్కను కూడా మార్పు చేయాలి కదా?’ అని ప్రశ్నించారు. ఎట్లాగూ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే లాభం జరుగుతుందని చెప్పారు.
మదన్‌లాల్ మంచివాడు
ఒకప్పుడు వైరా రిజర్వాయర్‌లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే ప్రమాదముంటే చిటికెలోపల నీళ్లిచ్చామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ రాజ్యంలో ఇచ్చేవారా? ఇది కాంగ్రెస్ రాజ్యంలో సాధ్యమయ్యేదా? అంటూ ప్రశ్నించారు. వైరా ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేదని, బీఆర్ఎస్ పాలనలోనే మున్సిపాలిటీగా చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. వైరా బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ మంచివాడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మాటలు నరుకుతున్న తుమ్మలనీళ్లెందుకు తేలే?
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పాలనలో భయంకరమైన కరువు. ఇదంతా కాంగ్రెస్ పుణ్యమే. వైరా ప్రాజెక్ట్ కింద నీళ్లు పారితే ముక్కుపిండి నీటితీరువా వసూలు చేసిండ్రు. ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ గోదావరి పారుతది. మరి ఒక ముఖ్యమంత్రన్నా.. ఒక మంత్రి అన్న ఆలోచన చేసిండ్రా. ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి బాగా నరుకుతున్నడు? ఈ నరికినోళ్లు గోదావరి నీళ్లు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదు. వాళ్లకు ఈ కడుపునొప్పి ఉండెనా? అని కాంగ్రెస్ పార్టీతోపాటు తుమ్మల నాగేశ్వర్రావుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇది మన రాష్ట్రం కాబట్టే మనకు కడుపునొప్పి ఉంటదని, అందుకే గోదావరి ఒరుసుకుంటూ పారే జిల్లాలోని జూలూరుపాడు, కారేపల్లి, ఏనూరు ఇల్లెందులో కరువు ఎందుకు ఉండాలని సీతారామ ప్రాజెక్ట్‌ను కడుతున్నామని చెప్పారు.
రెడ్యా నాయక్‌ను గెలిపిస్తే హోదా పెరుగుతది..
కురవి వీరభద్రస్వామి చాలా శక్తివంతమైన దేవుడని, తెలంగాణ వస్తే తప్పకుండా తానే వచ్చి బంగారు మీసాలు పెడతానని వేడుకున్నానని, మొక్కు చెల్లించుకున్నానని కేసీఆర్ తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిజాయతీ కలిగిన వ్యక్తని, ఎప్పుడూ గిరిజనజాతి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాపత్రయపడే వ్యక్తని తెలిపారు. రెడ్యానాయక్‌ను గెలిపిస్తే ఈ సారి హోదా పెరుగుతదని భరోసా ఇచ్చారు. రెడ్యానాయక్‌ను గెలిపిస్తే మళ్లీ డోర్నకల్ వస్తానని, ఒకరోజు ఇక్కడే ఉంటానని, కోరినవన్నీ చేసిపెట్టే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
సూర్యాపేట-తుంగతుర్తిని ఆగంబట్టించారు
సూర్యాపేట-తుంగతుర్తికి నీళ్లు రాకుండా అడ్డుకొని నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ ఇబ్బందులు పెట్టిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని పెన్‌పహాడ్ కాల్వ మొదలుకొని.. అన్ని కాలువల్లో ఏడాదిలో పది నెలలు నీళ్లు పారిస్తున్నామని తెలిపారు. నేడు ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 2.15 లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నదని తెలిపారు. ఇప్పుడు ప్రజలు ఆలోచన చేయకపోతే పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తనతోపాటు కలిసి నడించిన పిడికెడు మంది నాయకుల్లో జగదీశ్‌రెడ్డి ఒకరని పేర్కొన్నారు. జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ పొందుతాడని చెప్పారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కొంతమంది అహంకారులున్నరు. వాళ్ల నోట్లకట్టలు హైదరాబాద్‌లో దొరుకుతున్నయి. డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ గడప తొకనీయం అంటరు. అసెంబ్లీ గడప తొకనీయకపోవడానికి వీడెవడు. అసెంబ్లీకి ఎవరిని పంపాలో నిర్ణయించేది ప్రజలు కదా? ఆ ఓటు మీ దగ్గర ఉంది కదా? అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ధిచెప్పాలి
-సీఎం కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరు?
కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కూడా తుంగలో తొక్కి వద్దని మొత్తుకొన్నా ఉన్న తెలంగాణను జబర్దస్తీగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిందని, ఫలితంగా 58 ఏండ్లు గోసపడ్డామని కేసీఆర్ గుర్తుచేశారు. 1969లో ఉద్యమం వస్తే 400 మంది పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిందని ధ్వజమెత్తారు. 2000 సంవత్సరం నుంచి అన్ని వర్గాల ప్రజలు, తాను మడమ తిప్పకుండా పోరాటం చేస్తే కాంగ్రెస్ దిగివచ్చి తప్పనిపరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ‘కాంగ్రెస్ 50 ఏండ్లు పాలించింది. అప్పుడు పేదల బతుకులు ఎట్లా ఉండే? దళితుల బతుకులు ఎట్లా ఉండే? రైతాంగ సమస్యలు ఎట్లా ఉండే? ఆలోచించాలి. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందనేది బేరీజు వేయాలి’ అని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అంటున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు.
దళిత సమాజం దోపిడీకి గురైన సమాజం.ఎంత కాలంలో దళితుల్లో దరిద్రం ఉంటదో ఈ దేశం మొఖం మీద మచ్చ ఉంటది తప్ప దేశానికి క్షేమం కాదు. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా దళితులపై భయంకరమైన దాడులు, అతితీవ్రమైన వివక్ష. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు తప్ప ఒక్క పనిచేశారా? దళితబంధులాంటి పథకం తెచ్చారా? తెస్తరా జీవితంల? ఇది పోవాలి. తెలంగాణ దళితబంధు భారతదేశ దళితజాతికే మార్గదర్శనం చేయాలె.
-సీఎం కేసీఆర్
బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?
‘అన్ని రాష్ర్టాలు మీటర్లు పెట్టినయ్.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేదు. అందుకే వీళ్లకు డబ్బులు కట్ చేశాం. 25 వేల కోట్లు ఆపి వాళ్ల నోట్ల మన్ను బోసినం’ అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పుకొన్నదని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెట్టిందని, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వాలని వంద ఉత్తరాలు రాసినా కనికరించలేదని అన్నారు. నవోదయ పాఠశాలలు ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం ఉన్నా తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి బీజేపీకి మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు.
మేము గెలిచిన తర్వాత ఒక్కొక్కడ్ని నడిరోడ్డుపై పండబెట్టి తొక్కుతాం బిడ్డా అని రాజగోపాల్‌రెడ్డి అంటుండు. ఈ అహంకార నాయకులు, డబ్బు మదం ఉన్న నాయకులు వీళ్లేనా నల్లగొండ శాసకులు. ఎర్రజెండాలు ఎగిరిన గడ్డపై ఈ దుర్మార్గుల ఆగడాలేంది? ప్రజలు ఆలోచన చేయాలి. లేకపోతే ప్రమాదంలో పడతారు.
-సీఎం కేసీఆర్
ఇదివరకే అమ్మను చూడు, బొమ్మను చూడు అని ఓట్లు మస్తు గుద్దుకున్నరు. ఇందిరమ్మ రాజ్యంల ఏం జరిగింది? ఎవలు బాగుపడ్డరు? ఎవలకు ఏం ఒరిగింది? ఎమర్జెన్సీ పెట్టి కొంచపోయి జైళ్లలో పారేసిన్రు. దళితులు దళితులుగానే, గిరిజనులు గిరిజనులుగానే ఉన్నరు. కరెంటు వచ్చిందా? నీళ్లచ్చినయా? మనం ఎండిపోయినం. తెలంగాణకైతే మరీ అన్యాయం. ఏదో ఒక స్టోరీ చెప్పుడు. అంతా తమాషా. ఎస్టీ, ఎస్సీలను ఓటుబ్యాంకుగా వాడుకున్నరు. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు?
-సీఎం కేసీఆర్
తెలంగాణలో ఏ ఇంచైనా కేసీఆర్‌దే.
తెలంగాణ విజయాలు ఆషామాషీ కావు..
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, హక్కుల రక్షణ కోసమని సీఎం కేసీఆర్ వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశామని చెప్పారు. అతి స్వల్పకాలంలోనే తెలంగాణ అనేక విజయాలను సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతికి గీటురాళ్లుగా నిలిచే తలసరి ఆదాయంలో 19వ స్థానం నుంచి తెలంగాణ నేడు నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ 4 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో దహన సంస్కారాలు చేసేందుకు చోటుకూడా లేదని మండిపడ్డారు, 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు తిండికి ఎండపెడితే.. పదేండ్లలో రైతులను తిండిపెట్టే స్థాయికి బీఆర్ఎస్ తీసుకొచ్చిందని చెప్పారు.