తుంగతుర్తి: ఎన్నికలు వచ్చినప్పుడు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేస్తేనే ప్రజలు గెలుస్తరని, లేకపోతే ప్రజలు ఓడిపోతరని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగుతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తుంగతుర్తి ప్రాంతం అంతా పోరాటాల గడ్డ అని, ఈ ప్రాంత ప్రజలు గోదావరి జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత కొట్లాడినా ఏ పార్టీ కూడా కనికరించలేదని సీఎం మండిపడ్డారు.
2014కు ముందు తుంగతుర్తికి ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఏ చెరువులో కూడా చారెడు నీళ్లు కనిపించేవి కావని, ఇప్పుడు ఏ చెరువైనా ఒక్క వాన పడితే మత్తడి దుంకే పరిస్థితి ఉందని సీఎం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుని గోదావరి జలాలను తెచ్చుకోగలిగినం కాబట్టే ఈ ప్రాంతానికి ఇప్పుడు జలకళ వచ్చిందన్నారు. దాదాపు 1.20 లక్షల నుంచి 1.30 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తున్నయని, దాంతో తుంగతుర్తి ప్రజానీకం మొకాలు తెల్లబడ్డయని తెలిపారు.
దేవాదుల నీళ్లు కూడా తిరుమలగిరి మండలంలో ఏడెనిమిది ఊళ్లకు రావాల్సి ఉందని, వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నయని, తప్పకుండా తొందరలోనే ఆ నీళ్లు కూడా వస్తయని సీఎం చెప్పారు. బునాదిగాని కాలువ ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు నీళ్లు రావాల్సి ఉందని, అందుకోసం కాలువను వెడల్పు చేస్తున్నమని, బస్వాపూర్ ప్రాజెక్టుతో కూడా ఆ కాలువకు అనుసంధానం జరుగుతున్నదని సీఎం తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయితే తుంగతుర్తిలో సుమారు రెండు లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు పారుతయని అన్నారు.
గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండె
గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని నక్సలైట్ అని, ఇంకోటి అని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండేదని సీఎం గుర్తుచేశారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో ఆ రోజు నుంచే మొత్తం రాష్ట్రం పరిస్థితిని సమీక్ష చేసుకున్నమని, ఎన్నికలు పూర్తయినయని, టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో గెలిచి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అయినా తెలంగాణ ఇవ్వకుండా 14, 15 ఏళ్లు కాంగ్రెస్ ఏడిపించిందని విమర్శించారు.
తెలంగాణ ఇచ్చినం అనేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి
చివరికి కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే, మీరంతా నాకు మద్దుతుగా పోరాడితే ఆ దెబ్బకు దిగొచ్చి తెలంగాణ ఇచ్చిండ్రని సీఎం తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చినం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలె అని కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మందిని జైల్లో పెట్టిండ్రని, కేసుల పేరుతో వేధింపులకు గురి చేసిండ్రని ఆయన గుర్తుచేశారు.
చివరికి చెరుకు సుధాకర్‌ను కూడా పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేసిండ్రని సీఎం చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళిక రాస్తున్నప్పుడు తనతోపాటే పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉన్నరని, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వేస్తే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేదని ఆయన తెలిపారు. అనుకోకుండా విధి వంచితులు అయ్యే అభాగ్యుల కోసం, ఆసరా లేని వారి కోసం పెన్షన్లు అని తెలిపారు.
విధి వంచితుల కోసమే పెన్షన్లు
‘కొందరు అనుకోకుండా విధి వంచితులు అయితరు. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతరు. మహిళలు భర్తలను కోల్పోయి వితంతువులుగా మారుతరు. వృద్ధులు బిడ్డలను కోల్పోయి ఆసరా లేకుండా పోతరు. ఇలా అనేక మంది ఉంటరు. వాళ్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అందుకోసం పెన్షన్లు ఇవ్వాలె అని చెప్పిన. దాంతో అధికారులు లెక్కలు తీసి రూ.600 ఇస్తే చాలన్నరు. నేను కోపం చేసి కనీసం రూ.1000 అయినా ఉండాలన్నా. అధికారంలో వచ్చిన తర్వాత అనుకున్నట్లే ఇచ్చినం. ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చినం’ అని సీఎం చెప్పారు.
రైతుబంధు పథకం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ
రైతుబంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని సీఎం చెప్పారు. ఈ రైతుబంధు పథకాన్ని ఇటీవలే స్వర్గస్తులైన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారని గుర్తుచేశారు. దేశంలో 70 ఏళ్లుగా స్థిరపడి ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు.