CM KCR | నిర్మల్ : కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కత్తులతో దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ రాష్ట్రంలో పదేండ్ల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉందని కేసీఆర్ తెలిపారు. ఈ పదేండ్లలో కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు. గడిబిడి లేదు. చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులు పట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో పొడిచారు. దేవుడి దయ వల్ల ప్రాణపాయం తప్పింది. పేగు కట్ చేస్తే బతికి బయటపడ్డడు. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గమైన సంస్కృతి అని కేసీఆర్ నిప్పులు జెరిగారు.
ఇవాళ కొంత మంది నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఆ నాయకుల గురించి దళిత సమాజం ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. దళిత జాతి బాగా అణిచివేయబడింది. అణగదొక్కబడింది. అంటరానితనం అనే వివక్షకు గురైంది తరతరాలు యుగయుగాలుగా. ఆనాడే నెహ్రూ ఈ స్కీంను ప్రారంభిస్తే ఈనాడు దళితుల పరిస్థితి ఇలా ఉండేదా..? ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. దళితులకు ఏం చేయలేదు. దేశంలోనే తొలిసారిగా.. దళితబంధు స్కీం పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. దఫాదఫాలుగా దళిత సమాజాన్ని ఉద్ధరించాలని ముందుకు పోతున్నాం. పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న పాత కేసులు ఎత్తేశాం. రైతుబంధు కూడా అందించాం. రైతుబీమా ఏర్పాటు చేశాం. త్రీ ఫేజ్ కంరెట్ ఇస్తున్నాం. అదే విధంగా రాష్ట్రాన్ని సామరస్యంగా, శాంతియుతంగా ముందకు తీసుకుపోతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, చెక్ డ్యాంలు వచ్చాయి. వరద నివారణ చర్యలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు అని కేసీఆర్ తెలిపారు. స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ తప్పకుండా చేపట్టి రైతులకు లాభం చేస్తాం. సబ్ మర్జ్‌డ్ గ్రామాలకు లిఫ్ట్ కావాలని అడిగారు మంజూరు చేయిస్తాను. మంచి పద్ధతుల్లో సామరస్యంగా, శాంతియుతంగా, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటున్నాం. కొత్త మేనిఫెస్టో మీ ముందు పెట్టాం. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తుంది ఈ తెలంగాణ. ఇంకొన్ని ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్లు దాటుతుంది. పంజాబ్‌ను దాటేసి పోతాం. ఈ తరుణంలో వాస్తవాలు, నిజాలు తేల్చి కచ్చితంగా న్యాయం, ధర్మం వైపు నడిస్తే ఎన్నికల్లో మీరు గెలుస్తరు అభ్యర్థుల కంటే ఎక్కువగా, అప్పుడే మీకు లాభం జరుగుతది అని కేసీఆర్ సూచించారు.