CM KCR | కరీంనగర్ : పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తుంది.. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రసంగించారు.
ధరణి పోర్టల్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయి. భూముల పంచాయితీలు తగ్గాయి. మునుపటి లాగా పైరవీకారులకు, దళారులకు ఆస్కారం లేకుండా పోయింది. రైతుబంధు డబ్బులు ధరణి పోర్టల్ ద్వారా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి. మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు చేస్తామని మాట్లాడుతోంది. ధరణి రద్దు చేస్తే అడ్డగోలుగా లంచాలు, పైరవీకారులు, దళారులు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. మరి రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. మళ్లా పైరవీకారులు, దళారులు.. మళ్లీ మొదటికి వస్తది అని కేసీఆర్ తెలిపారు.
వడ్లు పండించడంలో తెలంగాణ పంజాబ్‌ను దాటిపోయి దేశంలో నంబర్ వన్ అయిందని కేంద్రం ప్రకటించింది. పంటలు దిగుబడి పెంచి, ఆదాయం పెంచి పేదలను ఆదుకుంటూ ముందుకు పోతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డు పడుతున్నారు. రైతులోకం సిరీయస్‌గా ఆలోచించాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేశాం. వ్యవసాయాన్ని పటిష్టం చేశాం. రైతుల ముఖాలు వెలుగుతున్నాయి, అప్పులు తీరిపోయాయి. దళారీల బాధ తప్పింది. పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. చెట్లు నరుడుకు తప్ప గతంలో చెట్లు నాటారా..? కరీంనగర్లో ఒకప్పుడు అడవి ఉండే.. మొత్తం అమ్మేసి కరగనాకేసిండ్రు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చట్టం తెస్తే 7 శాతం గ్రీన్ కవర్ పెరిగింది. మంచి వర్షాలు కురుస్తున్నాయి. దీన్ని మళ్లీ చెడగొడుతాం. పైరవీకారులను తెస్తాం.. భూక్జబాలు మొదలు పెడుతాం అని దందాతో కాంగ్రెస్ వస్తుంది. దయచేసి రైతాంగం, కరీనంగర్ ప్రజలు ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, ప్రజల హక్కులు కాపాడటం కోసం. కాంగ్రెసోళ్లు 50 ఏండ్లు పరిపాలించారు. వాళ్ల కాలంలో ఏం జరిగిందో మన కండ్ల ముందరనే ఉంది. మంచి, సాగు నీళ్లు లేవు. కరెంట్ లేదు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు, వలస పోవుడు వంటివి ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు, మూడు నెలలు మేధోమదనం చేసి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపారు. ప్రజలను పిట్టల్లా కాల్చి చంపారు. లక్షల మందిని జైల్లో పెట్టారు. మళ్లీ పొత్తు పెట్టుకుని 15 ఏండ్లు ఏడిపించారు. ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు. మనం మొండిగా ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఎవడన్నా డీలాగా ఉంటే.. అయింతా గోల్ మాల్ చేసే పరిస్థితి ఉండే. ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్ ఇచ్చారు. మనం రూ. 2 వేల పెన్షన్ ఇస్తున్నాం. సంపద పెరగడంతో పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నాం. భారతదేశ చరిత్రలోనే మానవ దృక్పథంతో గుర్తించి పెన్షన్ వేల రూపాయాలు చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇక్కడొచ్చి డైలాగులు కొడుతున్నారు. ఇవాళ కూడా అనేక రాష్ట్రాల్లో 600, 700 పెన్షన్ ఇస్తున్నారు. కంటి వెలుగు ద్వారా 80 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేశాం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణిలకు సేవలందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరిచి, వైద్య వసతులు బాగా పెంచి, నమ్మకం కలిగించాం. దీంతో మాతా శిశు మరణాలు తగ్గాయి. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇటువంటి మానవీయకోణంలో ఉండే పథకాలు తీసుకున్నాం. కళ్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.