CM KCR | ఖమ్మం : గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద అని కేసీఆర్ ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యే టికెట్ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తుంటే.. వాళ్లది ఏంది.. వెయ్యి నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓటు వేస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద. గిరిజనులకు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా..? ఇంత బాహాటంగా మాట్లాడుతారా..? ఇంత అహకారంతోని మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తది. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నానని గిరిజనులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
వందకు వంద శాతం రైతుబంధు కొనసాగిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో రైతుబంధు వచ్చే ఏడాది నుంచి రూ. 12 వేలు ఇస్తాం. క్రమంగా రూ. 16 వేలకు పెంచుతాం. ధాన్యం కొనుగోలు కొనసాగిస్తాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకాలను తీసుకువస్తున్నాం. ప్రజల మీద భారం పడకూడదని గ్యాస్ సిలిండర్‌ను 400కే అందించాలని నిర్ణయించాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా వస్తది. ఖమ్మంలో రెండు సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది. అయినా బీఆర్ఎస వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తది. ఎవడో ఎల్లయ్య, మల్లయ్య గెలిస్తే అయ్యేది ఏం లేదు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే జిల్లా అభివృద్ధికి, సీతారామ ప్రాజెక్టు కోసం పాటుపడుతారు అని కేసీఆర్ తెలిపారు.