కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూశ్ కు మెదడు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనడం చేతగాక.. నూకలు తినమని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పీయూశ్ గోయల్‌కు విపరీతమైన గర్వం, అహంకారం వుందన్నారు.
అన్నం అందించే వారికి నూకలు తినమని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నూకలు తినమని చెప్పి, తెలంగాణ ప్రజలను అవమానించారని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కేంద్రానికి పరిపాలన చేతకావడం లేదని, తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో క్యా చమత్కార్ హై రావ్ సాబ్ అంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తనతో అన్నారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్క యాసంగిలోనే తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగైందని, దేశంలో ఎక్కడా లేని స్థాయిలో తెలంగాణలోనే వరి సాగైందని తెలిపారు. ఇదే తెలంగాణ చమత్కార్ అని కేసీఆర్ పీయూశ్ గోయల్‌కు ఈ సందర్భంగా దీటైన సమాధానమిచ్చారు. తాము దద్దమ్మలని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం తమతో చేతకాదని కేంద్రం చెప్పేస్తే సరిపోతుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ధాన్యం కొనడం కేంద్రానికి చేతకావడం లేదని, చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రతి సారీ ఓ మెలిక పెట్టి, కేంద్ర ఆహారభద్రత చట్టం కింద ఉన్న బాధ్యతను కేంద్రం విస్మరించి, నాటకాలు ఆడుతోందని సీఎం విరుచుకుపడ్డారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కేంద్రం అనేక వేల టన్నుల బాయిల్డ్ రైస్ ఎగుమతి చేశారని, అయినా అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.