జనగామ : తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం.. నరేంద్ర మోదీ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. జనగామ యశ్వంత్‌పూర్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం. దేశం గురించి కూడా కొట్లాడాలి. జాతీయ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి. సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించాం. మీరు కూడా దీవెనలు ఇస్తే ఢిల్లీ కోటలను బద్ధలు కొడుతాం. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. జనగామ టౌన్లో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని ముట్టుకుంటే నాశనం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్రత్తలా మీరు ఉండండి. మా జాగ్రత్తలా మేం ఉంటాం అని కేసీఆర్ సూచించారు.
ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు. మెడికల్ కాలేజీ ఇవ్వరు. నువ్వు ఇవ్వకున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను తరిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం. ప్రజల శక్తితోనే తెలంగాణను సాధించుకున్నాం. అద్భుతమైన పంటలను పండించుకున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.