సిద్దిపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో గురువారం ఉదయం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐవోసీ కార్యాలయం వెనుక ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద 11 గంటలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక వాహనంలో ఆర్వో కార్యాలయానికి చేరుకొనే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు గులాబీపూలు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి బన్సీలాల్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. గజ్వేల్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేరుకోవడంతో పట్టణం గులాబీమయంగా మారింది. కార్యకర్తలు జై కేసీఆర్, జైజై కేసీఆర్, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తిరిగి 11.46 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భరత్‌కుమార్ తదితర నేతలు రాగా ఆయన కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.