ఇంటికొక బిడ్డను ఇవ్వాలని అడిగిన. పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను తీసుకొచ్చి మీ పాదాల ముందు ఉంచిన. సాధించుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు వేద్దామా? ఈనగాచి నక్కలపాలు చేద్దామా? సాధించుకున్న తెలంగాణను మనమే తీర్చిదిద్దుకోవాలె. ఆలోచించండి. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటే మన రాజ్యం అవుతుంది. మన కల సాకారం చేసుకుందాం.
– 2014 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్
కాంగ్రెస్ అరాచక పాలనే తెలంగాణ వెనుకబాటు, కరువుకు కారణం. మరోసారి వారికి అధికారం ఇస్తే పంటికి అంటకుండా రాష్ర్టాన్ని మింగేస్తారు. ప్రభుత్వానికి ఏడు నెలల సమయం ఉన్నా కాంగ్రెస్ పిచ్చిప్రేలాపనలు, అవాకులు చెవాకుల వల్లే ప్రజల ముందుకు వచ్చిన. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ఉద్యోగుల ైస్థెర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు తెరదింపేందుకే బీఆర్ఎస్ త్యాగం చేసింది.
-2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్
CM KCR | ఆ గొంతు వింటే ఒక ధైర్యం.. ఆయన మాట్లాడితే ఒక భరోసా. పిడికిలెత్తి నినదిస్తే ఒక ఉత్సాహం. ఆ వ్యక్తి.. శక్తి.. కేసీఆర్. నాయకుడికి నిర్వచనం అడిగితే కేసీఆర్ పేరొక్కటి చాలు. అందుకే తెలంగాణ ప్రజ వెనుక నిలిచారు. వెంటనడిచారు. కేసీఆర్‌కు పదవులంటే లెక్కలేదు. అందుకే తెలంగాణ కోసం పలుమార్లు రాజీనామా పత్రమై రణగర్జన చేశారు. ఎన్నికలంటే ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. ప్రతీసారీ బ్యాలట్తో జనబాహుళ్యపు బావుటాయై మరింత పైకి లేచారు.
‘ఎన్నికలొస్తే నా అంత కూల్‌గా ఎవరూ ఉండరు..’ అని కేసీఆర్ మాత్రమే చెప్పగలరు. అలా ఉండగలరు కూడా. తెలంగాణ ప్రజలపై ఆయనది చెక్కుచెదరని నమ్మకం. ప్రజలకూ ఆయనపై అచంచల విశ్వాసం. అంతులేని అభిమానం. అధికారిక సమావేశాల్లో రాజనీతిజ్ఞుడిగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడే కేసీఆర్.. ఎన్నికల సమరాంగణంలో బక్కపలచని యుద్ధభేరిగా మారిపోతారు. బహిరంగ సభ.. కేసీఆర్ బహుముఖ ఆయుధం. అందుకే ఒక్కో బహిరంగ సభ ఒక జనసునామీ. ఆ సభల్లో కేసీఆర్ మాటలు ప్రత్యర్థులపై మరఫిరంగులై పేలుతాయి.
తెలంగాణ రాష్ర్టాన్ని స్వప్నించి, సాధించిన కేసీఆర్..రెండు పర్యాయాలు రాష్ర్టాన్ని బంగారుతునకగా మార్చారు. మూడో ములుపులో గెలుపు పిలుపుకోసం మరోసారి రణన్నినాదం చేయబోతున్నారు. తొలిదశల్లో 17 రోజుల్లో 41 సభలతో అప్రతిహత జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. వరుసగా రెండుసార్లు హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి విజయఢంకా మోగించిన గులాబీ అధినేత.. ఈసారి కూడా అక్కడినుంచే రథారూఢుడై కదలనున్నారు. చెప్పింది చేసే కేసీఆర్.. చేసిందీ, చేయబోయేదీ చెప్పబోతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విపక్షాల ఆట మొదలు కాకముందే అధికారపక్షం జనంగుండెలో గులాబీ జెండా ఎగురవేయబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 15వ తేదీన ఎన్నికల ప్రచార కార్యక్షేత్రంలోకి దిగనున్నారు. ఉద్యమాల పోరుగడ్డ హుస్నాబాద్ అడ్డా నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల యుద్ధరంగంలో విపక్షాన్ని పూర్వపక్షం చేయనున్నారు. జనాన్ని ఒప్పించి..మెప్పించేందుకు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేశారు. ప్రజారంజక మ్యానిఫెస్టోతో విపక్షాల మైండ్‌బ్లాంక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఒక దశ ప్రచారాన్ని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పూర్తిచేశారు.
కేసీఆర్ అంటే జనసునామీ. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ప్రసంగాలకు మైమరిచిపోని వారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్ష నేతలే అబ్బుపరడతారు. రెండు పర్యాయాలు జనరంజక పాలన అందించిన సీఎం కేసీఆర్‌కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసని అన్ని రాజకీయ పార్టీల్లోని కొందరు నేతల అభిప్రాయం. ‘మా వాళ్ల కంటే కేసీఆర్ 30-40 ఏండ్లు ముందుంటారు. కేసీఆర్‌ను పట్టుకోవటం.. అంచనా వేయటం అసాధ్యమైన విషయం. కేసీఆర్ అమ్ములపొదిలో ఉండే అస్ర్తాలు, వాటికి వచ్చే జనామోదం మేము ఇప్పుడు కాదు ఉద్యమకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కేసీఆర్‌ను తట్టుకోవటం కష్టం’ అని కాంగ్రెస్‌లోని తలపండిన ఓ సీనియర్ నేత ఇటీవల వారి పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే కుండబద్దలు కొట్టారట. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటకు కేసీఆర్ ఏ స్థాయిలో విలువ ఇచ్చి దాన్ని అమలు చేసేందుకు ఎంత వరకైనా వెళతాడని సదరునేత విశ్లేషించిన తీరుపై ఆ పార్టీలో ముసలం బయలుదేరిందని విస్తృత ప్రచారం సాగుతున్నది.
సీఎం కేసీఆర్ వ్యూహాన్ని అంచనావేయటం విపక్షాలకు అంతుచిక్కదని మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేపట్టిన విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈసారి ఆచరించనున్నారు. ప్రచార షె డ్యూల్ ఖరారు కావటంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొన్నది. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎన్నికల స మరానికి సమాయత్తం చేయటంలో మంత్రుల పర్యటనలు తోడ్పాటును అందించాయి. ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కావడంతో ప్రజలను పూర్తిగా బీఆర్ఎస్వైపు మళ్లించేందుకు కేసీఆర్ తనదైన వ్యూహంతో ఎన్నికల కదనరంగంలోకి అడుగిడబోతున్నారు.
కేసీఆర్ 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. కాంగ్రెస్ నేతల విషప్రచారంతో ఆయన 2018లో ప్రభుత్వాన్ని 7 నెలల ముందే రద్దు చేసి ప్రజల ముందుకు వెళ్లారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని రెండు ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడూ అదే చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్ఎస్ సహా కాంగ్రెస్ పార్టీలోని అసలైన తెలంగాణవాదులు తమ ప్రయివేట్ చర్చల్లో విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన సరిగ్గా 15 రోజుల ముందు ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే 107 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. అలాగే 2018 ఎన్నికల సమయంలో 87 సభలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో సమయంలో ఒక రోజు (నవంబర్ 26, 2018వ తేదీన) 15 నియోజకవర్గాలను కవర్‌చేస్తూ 9 బహిరంగ సభల్లో పాల్గొని చేసిన ప్రసంగం దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించింది.
ఇంటింటీకి మంచినీళ్లు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగను అని చెప్పి మిషన్‌భగీరథను తెచ్చిన మొనగాడు కేసీఆర్, ఇప్పుడు మూడోసారి ప్రజల ముందుకు వస్తున్నారంటే మరో అద్భుత ప్రణాళిక ప్రజల కండ్ల ముం దు కదలాడుతున్నది. విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యే మ్యానిఫెస్టో సిద్ధం అవుతున్నదని ఇటీవల రేఖామాత్రంగా కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు మం త్రులు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్న ది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన కేసీఆర్, మూడోసారి ప్రజల ఇండ్ల ముం దు ముత్యాల పందిరిని పరిచేందుకు సిద్ధం అయ్యారనే ఆసక్తి ప్రజల్లో కలుగుతున్నది. అన్ని సూచీల్లోనూ ఒకప్పుడు అట్టడుగున ఉన్న తెలంగాణ తొమ్మిదిన్నరేండ్లలోనే అగ్రస్థానానికి చేరింది. వీటన్నింటినీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, ఇంకా చేయాల్సింది ఉన్నదని చెప్పనున్నారు. అందుకే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలను, రాష్ర్టాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనున్నారు.
ఈ నెల 15 నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించే ఎన్నికల ప్రచారాన్ని తొలి విడతగా 17 రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. 17 రోజుల్లో 42 నియోజకవర్గాలు కవరవుతున్నాయి. ఇందులో గజ్వేల్ మినహా మిగితా 41 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. నిన్నమొన్నటిదాకా కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వారికి, ప్రత్యేకించి ఆయన ఆరోగ్యంపైనా ఇష్టారీతిగా మాట్లాడినవారికి ఈ షెడ్యూల్ చూసి మైండ్ బ్లాంక్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకముందే తాము తొలి దశ ప్రచారం పూర్తి చేశామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
‘ఇంటికొక బిడ్డను ఇవ్వమని అడిగిన. పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను తీసుకొచ్చి మీ పాదాల ముందు ఉంచిన. సాధించుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు వేద్దామా. ఈనగాచి నక్కలపాలు చేద్దామా? సాధించుకున్న తెలంగాణను మనమే తీర్చిదిద్దుకోవాలె. ఆలోచించండి. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటే మన రాజ్యం అవుతుంది. మన కల సాకారం చేసుకుందాం’ అని 2014 ఆగస్టు 17న వరంగల్ జిల్లా మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు పోరుగర్జన సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తెలంగాణను ఆలోచింపజేసింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియమ్మ రుణం తీర్చుకుందాం అని కాంగ్రెస్ చేసిన కపట నాటకాన్ని తెలంగాణ సమాజం నమ్మలేదు. గులాబీ దళపతికి 63 సీట్లు ఇచ్చి అజేయశక్తిగా నిలిపింది.
‘కాంగ్రెస్ అరాచక పాలనే తెలంగాణ వెనుకబాటుకు, కరువుకు కారణం. మరోసారి వారికి అధికారం ఇస్తే పంటికి అంటకుండా రాష్ర్టాన్ని మింగేస్తారు. ప్రభుత్వానికి ఏడు నెలల సమయం ఉన్నప్పకీ కాంగ్రెస్ చేస్తున్న పిచ్చిప్రేలాపనలు, అవాకులు చెవాకుల వల్లే ప్రజల ముందుకు వచ్చిన. తెలంగాణలో అభివృద్దిని కొనసాగించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ఉద్యోగుల ైస్థెర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు తెరదింపేందుకే బీఆర్ఎస్ త్యాగం చేసింది. రాష్ట్రంలో సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలను విస్తరించుకుంటూ పోతున్నాం’ అని హుస్నాబాద్‌లో 2018 ఎన్నికల సమర శంఖారావంలో కాంగ్రెస్‌పై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
ఉద్యమాల పోరుగడ్డ హుస్నాబాద్ నియోజకర్గం రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పాలనకు అంకురార్పణ కాబోతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. 2014లో జరిగిన తొలి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అజేయశక్తిగా నిలిపిన హుస్నాబాద్ గడ్డ, 2018 ఎన్నికల్లోనూ తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపింది. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం కాబోతున్నదని బీఆర్ఎస్ ధీమాతో ఉన్నది. 2014లో 63 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్, 2018లో 88 స్థానాలకు చేరింది. ఇప్పటికే నెలకొన్న రాజకీయ వాతావరణం, పలు జాతీయ సంస్థలు తేల్చిన సర్వేలతోపాటు, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆదరణతో ఈసారి తప్పకుండా సెంచరీ కొడతామని బీఆర్ఎస్ అచంచల ఆత్మవిశ్వాసంతో ఉన్నది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హుస్నాబాద్‌లో ప్రా రంభిస్తుండటం తమ హ్యాట్రిక్ విజయానికి సంకేతమని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. 2018లో సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దుచేసిన తెల్లారే (సెప్టెంబర్ 7న) హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే ఎన్నికల శంఖారావం పూరించారు. మొదటిసారి 63 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ రెండోసారి 88 స్థానాలతో తన జైత్రయాత్రను అద్వితీయం చేసింది. ఇక ఈసారి ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కేసీఆర్ ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు అదే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు.