CM KCR | హైదరాబాద్ : ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎలాంటి విరామం లేకుండా, రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ, ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్. అలా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈసారి కూడా బీఆర్ఎస్సే అధికారంలోకి రాబోతుందని, గతంలో కంటే అధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ శ్రేణుల్లో, ప్రజల్లో విశ్వాసం నింపారు కేసీఆర్. కాంగ్రెస్ గెలిచేది లేదు, సచ్చేది లేదు.. ఆ పార్టీ గెలిస్తే డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దెవా చేస్తూ కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించారు.
అక్టోబర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ రోజు నుంచి నేటి దాకా అలుపెరగకుండా.. ప్రచార సభల్లో పాల్గొని బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను చైతన్యపరిచారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రచారానికి ఓ మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. అనంతరం ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడ్డ ప్రతిపక్షాలను ఎండగడుతూ.. వారి హయాంలో ఎలాంటి మోసం జరిగిందో ప్రజలకు విడమరిచి చెప్పారు కేసీఆర్. రైతుబంధు, ధరణి, 24 గంటల కరెంట్, దళితబంధు వంటి అంశాలను కేసీఆర్ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ మాయమవుతాయని, వారు అదే విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారని కేసీఆర్ ప్రజలకు వివరించారు. అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా దగా పడ్డ దళిత జాతిని అభివృద్ధి చేసేందుకు దళితబంధు తీసుకొచ్చామన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకే విడుతలో దళితబంధు తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక గిరిజనులకు కూడా పోడు పట్టాలిచ్చి వారికి రైతుబంధు అందేలా చేశామన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అని ప్రచారాన్ని కొనసాగించిన కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి రాజ్యం, ఎమర్జెన్సీ, ఎన్కౌంటర్లు, రక్తపాతం జరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని, వారిని ఓటు బ్యాంకుగానే చూశారని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇచ్చారని, రామారావు ఆ బియ్యం ఇవ్వడంతోనే పేదల కడుపు నిండిందని కేసీఆర్ ప్రజలకు విడమరిచి చెప్పి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టారు.
ఇక ఆయా నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా, స్థానికంగా కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలను కేసీఆర్ బట్టబయలు చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో పరిశ్రమలను మూయించిందే కాంగ్రెస్ పార్టీ అని, కార్మికులను రోడ్డు న పడేసిందే కాంగ్రెస్ నేతలు అని కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, పరిశ్రమలు కూడా తరలిపోయేలా చేశారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కరువుకు, వలసలకు నిలయంగా మారిందని సీఎం గుర్తు చేశారు. పాలమూరు ఎత్తిపోతలపై 196 కేసులు వేసి ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
ఈ దేశంలో జాతీయ పార్టీలకు స్థానం లేదని, 2024 ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీల వల్ల ప్రజలకు ఉపయోగం లేదని, బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పబోతుందని కేసీఆర్ పలు సభల్లో ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం సెక్యులర్ పార్టీ అని, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కర్ఫ్యూ, మతకల్లోలాలు జరగలేదని స్పష్టం చేశారు. దాని కారణంగానే రాష్ట్రానికి వేల సంఖ్యలో పెట్టుబడులు తరలివచ్చి, లక్షల మంది ఉపాధి కల్పించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.
తన పర్యటనలో భాగంగా హెలికాప్టర్లలో తిరుగుతూ రోజుకు నాలుగు నియోజకవర్గాలను చుట్టివచ్చారు కేసీఆర్. రెండు, మూడు సార్లు హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ఒక గంట ఆలస్యమైనప్పటికీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లి ప్రచార సభల్లో పాల్గొని, కార్యకర్తలను, ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ విధంగా కేసీఆర్ దాదాపు 45 రోజుల పాటు తీరిక లేకుండా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.
ఆనవాయితీ ప్రకారం నవంబర్ 4వ తేదీన సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. 9వ తేదీన ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.