మంచిర్యాల, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు కావాలా? వద్దా? 24 గంటల కరెంటు ఇవ్వాలా? వద్దా? ధరణి ఉండాలా? ఉండొద్దా? అన్న సీఎం కేసీఆర్ ప్రశ్నలకు కావాలి.. ఇవ్వాలి.. ఉండాలి.. అంటూ సభల్లో ప్రజల నుంచి వెల్లువలా వచ్చిన అద్భుత స్పందన ఇది.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రి, పెద్దపల్లి జిల్లా మంథని, పెద్దపల్లి పట్టణాల్లో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు బాల్క సుమన్, దాసరి మ నోహర్రెడ్డి, పుట్ట మధు ఆధ్వర్యంలో జరిగిన ఆయా సభలకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఊరూరా జనం తరలిరావడంతో రహదారులన్నీ గులాబీ వనాలుగా మారా యి. చిన్నా, పెద్ద, మహిళలు, వృద్ధులు గులాబీ జెండాలతో సభలకు దారిబట్టారు.
చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల నుంచి, మంథని నియోజకవర్గంలోని తొమ్మిది, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. కేసీఆర్ ప్రసంగం సాగుతున్నంత సేపు ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. మధ్యమధ్యలో సీఎం వేసిన ప్రశ్నలకు జనం సమాధానాలిస్తూ.. కరతాళ ధ్వనులతో మద్దతు తెలిపారు. కళాకారులు మిట్టపల్లి సురేందర్, మధుప్రియ, ఇతర కళాకారులు ఆటపాటలతో జనంలో ఉత్సాహం నింపారు. వారి పాటలకు గులా బీ కండువాలు ఊపుతూ జనమంతా సం దడి చేశారు. జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్ ని నాదాలతో ప్రాంగాణాలన్నీ మార్మోగాయి.