హైదరాబాద్, మార్చి 3 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కూడా పాల్గొంటారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు.
19 మంది అమరుల కుటుంబాలకు కేసీఆర్ అండ
చైనా సైనికులు భారత్‌లోని గల్వాన్‌లోయపై పట్టు సాధించడానికి మన సైనికులతో రెండేండ్ల క్రితం ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ కల్నల్ భిక్కుమళ్ల సంతోష్‌కుమార్‌తోపాటు 19 మంది సైనికులు చనిపోయారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని ఆనాడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ 19 మంది సైనికుల్లో ఇద్దరు జార్ఖండ్‌కు చెందినవాళ్లున్నారు. వీరి కుటుంబ సభ్యులకు రాంచీలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు రాంచీలో జరిగే కార్యక్రమాన్ని సమన్వయంచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు హర్విందర్‌సింగ్, రిజ్వీ గురువారం బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాంచీకి సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తదితరులు వెళ్లనున్నట్టు సమాచారం.
అమర కుటుంబాలను ఆదుకొన్న ఏకైక నేత సాధారణంగా సరిహద్దుల్లో ఎవరైనా సైనికుడు వీరమరణం పొందిన సందర్భంలో ఆతని సొంత రాష్ట్రంలోని ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. కొన్ని రాష్ర్టాలైతే కనీసం స్పందించనైనా స్పందించవు. స్పందించినా.. నామమాత్రంగానే సహాయం చేసి చేతులు దులుపుకొంటాయి. అమరయోధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.. తాను మొదట భారతీయుడని.. ఆ తరువాతే తెలంగాణ బిడ్డ అని నిరూపించారు. సరిహద్దుల్లో శత్రువులను అడుగుకూడా కదపకుండా అడ్డుకోవడంలో దేశంకోసం ప్రాణాలర్పిస్తున్న యోధుల కుటుంబాలను ఆదుకోవాలన్న సమున్నతమైన ఆదర్శాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరించి
చూపిస్తున్నారు. ఇది కేసీఆర్‌కు మాత్రమే సాధ్యం.