యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 7: సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విద్యుత్తు భారం భారీగా తగ్గనుంది. ఈఆర్సీ రిలీజియన్ క్యాటగిరీ కింద రిటైల్ సరఫరా టారిఫ్, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ ప్రకటించడంతో స్వామివారి ఆలయానికి నెలకు రూ.15 లక్షల వరకు ఆదా కానుంది. ప్రతి నెలా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వస్తున్నదని, ప్రస్తుతం ప్రకటించిన ప్రత్యేక రాయితీతో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో ఎన్ గీత గురువారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ను కలిసి తిరుమల తిరుపతి తరహాలో రిలీజియన్ క్యాటగిరీ కింద ప్రత్యేక రాయితీ ఇవ్వాలని కోరినట్టు ఆమె తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవస్థానాన్ని విస్తరించడంతోపాటు విద్యుద్దీపాలంకరణ, సీసీ కెమెరాల ఏర్పాటు, క్యూకాంప్లెక్స్‌లలో ఏసీలు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, లడ్డూ ప్రసాద తయారీలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగిందని చెప్పారు. రోజుకు సుమారు రూ.40 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వస్తున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇం దుకు స్పందించిన సీఎం కేసీఆర్ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)ను ఆదేశించా రు. రాయితీ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన ఈఆర్ఎస్ రంగారావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుకు ఈవో ఎన్ గీత, విద్యుత్తు విభాగం ఈఈ ఊడేపు రామారావు ధన్యవాదాలు తెలిపారు.