హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వైఫల్యాలను విడమరిచి చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పాలన వైఫల్యం, మోదీ సర్కారు నిర్వాకాన్ని ఎండ గట్టారు. ప్రధానంగా దేశ విద్యుత్తు రంగంలో మోదీ ప్రభుత్వం విఫలమైన తీరును గణాంకాలతో సహా వివరించారు. దేశంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 4,10,339 మెగావాట్లు ఉన్నా విద్యుత్తు కోతలు ఎందుకు ఉన్నాయని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ గత డిసెంబర్ వరకు గణాంకాలను వివరించారు.
దేశవ్యాప్తంగా 34 థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు మూలనపడ్డాయి. వీటి సామర్థ్యం అక్షరాల 40,130 మెగావాట్లు. మూలకుపడిన వాటి లో మహారాష్ట్రలో 4, ఛత్తీస్‌గఢ్‌లో 10, ఒడిశాలో 5, ఉత్తరప్రదేశ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 3 ఉన్నాయి. ఇవేగాక మరికొన్ని రాష్ర్టాల్లోనూ థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు ఏండ్ల తరబడి పనిచేయడం లేదు. ఈ ప్లాంట్లకు కోల్ లింకేజీ లేకపోవడంతోపాటు నిబంధనలు పాటించకపోవడం, పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నా ఈ ప్లాంట్లను వినియోగంలోకి తేవడంలో కేంద్రం విఫలమైందని, ఫలితంగా దేశంలో పలు ప్రాంతాల్లో విద్యుత్తు కోతలున్నట్టు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
దేశంలో 114 ఏండ్లకు సరిపోయే బొగ్గు నిల్వలున్నాయి. మొత్తం 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలుండగా, అందులో థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు అనుకూలమైనవి 180 బిలియన్ టన్నులు. ఏడాదిలో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి 5,256 మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం ఉంటుంది. ఈ లెక్కన దేశం మొత్తంలో ఏటా 3 లక్షల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను నడిపిస్తే.. 180 బిలియన్ టన్నుల బొగ్గును పూర్తిగా వినియోగించడానికి 114 ఏండ్ల సమయం పడుతుంది. అంటే 114 ఏండ్లపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.
సంప్రదాయ ఇంధన వనరులు 2,35,809
సంప్రదాయేతర ఇంధన వనరులు 1,74,530
మొత్తం 4,10,339