CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ధరణి వద్దంటున్న, వ్యవసాయానికి మూడుగంటలే కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను జీవించి ఉన్నంతకాలం.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ధరణిని పోనివ్వనని అన్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దెబ్బతింటామని ప్రజలకు హెచ్చరించారు. ఓటే మన తలరాతను మార్చుతుందని అన్నారు. ఎన్నికలు అనగానే ఆగమాగం కాకుండా, ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మకుండా, మంచికి ఓటేస్తే భవిష్యత్తుకు మరింత భరోసా ఉంటుందని ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నాటి జనగామ గుర్తొస్తేనే కన్నీళ్లు ఆగవు
నాటి జనగామను యాది జేసుకుంటేనే కండ్ల వెంబడి నీళ్లొస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బచ్చన్నపేటలో కొంతమంది కలిసి మాట్లాడాలని అడిగితే అక్కడ ఆగానని, మండల కేంద్రంలో నాలుగైదు వందల మందే ఉన్నారని, అందరూ ముసలోళ్లేనని, ఒక్క యువకుడు కూడా లేడని గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల సంది వరుసగా కరువు పడిందని, బచ్చన్నపేట చెరువు మొత్తం అడుగంటిపోయిందని, బావుల్లో చుక్కనీరు లేదని, బోర్లళ్ల నీళ్లు పోస్తలేవని చెప్తే తనకు దుఃఖం తన్నుకొచ్చిందని అన్నారు. యువకులంతా పొట్టచేత పట్టుకుని అన్నమో రామచంద్రా అనుకుంటూ వలసపోయారని వారు తెలిపారని అన్నారు. ఆ దుస్థితిని చూసి ఆరోజు తాను ఏడ్చానని, కానీ.. ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డప్పుడు.. ఎవరూ జనగామను ఎంపిక చేయలేదని, అప్పుడు తానే స్వయంగా పెన్నుతో జనగామను జిల్లా కేంద్రం చేయాలని టిక్ చేశానని తెలిపారు. ఆ తర్వాత భవనగిరిని ఎంపిక చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రెండు మంచి గ్రోత్ సెంటర్లు అయ్యాయని పేర్కొన్నారు. పాత వరంగల్ జిల్లా మొత్తంలో అత్యధికంగా వరి పండించే తాలుకానే జనగామగా మారిందని తెలిపారు. ఇప్పటికీ బచ్చన్నపేట చెరువు ఎలా ఉన్నదని అడుగుతూ ఉంటానని తెలిపారు. ఆ నాడు ఎండిపోయింది కానీ.. ఇప్పుడు 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ చెప్పేవాళ్లని గుర్తు చేశారు. అది విన్నప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉండేదని, ఇవాళ చూస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులో పరిశ్రమలు, ఐటీ కారిడార్‌తో జనగామను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఆ దుస్థితికి టీడీపీ, కాంగ్రెస్సే కారణం
జనగామ నెత్తినే నీళ్లకుండ వంటి ప్రాజెక్టులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం.. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయని, ఇకపై కాళేశ్వరంతో లింకై ఉన్న మల్లన్నసాగర్ నీళ్లు కూడా వస్తాయని చెప్పారు. మల్లన్నసాగర్ 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అని, దానినుంచి కూడా నిండిన కుండలాగా ఉండే తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు లింక్ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ కరువొచ్చినా జనగామలో మాత్రం కరువనేది రాదని పేర్కొన్నారు. కొన్ని పంట కాలువలు, మరికొన్నింటికి మరమ్మతులు కావాలని రాజేశ్వర్‌రెడ్డి అడిగారని, మచ్చుపహాడ్‌కు నీళ్లు తరలిస్తే 16 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారని, వీటితోపాటు అన్నింటినీ పరిశీలించి తప్పనిసరిగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంకో మూడు లిఫ్టులు ఏర్పాటు చేసుకుంటే జనగామకు వందశాతం నీళ్లు అందుతాయని చెప్పారు. తెలంగాణలో గులాబీ జెండా ఎగిరిన వెంటనే చంద్రబాబునాయుడు వెళ్లి దేవాదులకు ఆ చివరను శంకుస్థాపన చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారని, కానీ పూర్తి చేయలేదని మండిపడ్డారు. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసినా అసంపూర్తిగానే మిగిలిపోయిందని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల నదిలో పుష్కలంగా నీళ్లు పారినా.. దేవాదుల ప్రాజెక్టుకు మాత్రం అందలేదని గుర్తుచేశారు. ఆ సమస్యను గుర్తించి పరిష్కరించామని తెలిపారు. అక్కడ సమ్మక్క బ్యారేజీని నిర్మించామని, ఏడున్నర టీఎంసీల నీళ్లతో ఏడాదంతా ఆ బ్యారేజీ నిండే ఉంటుందని చెప్పారు. ఆ బ్యారేజీని పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకే అంకితం చేశామని అన్నారు. జనగామలో మే నెలలో కూడా నీళ్లకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ పక్కనుండే వ్యక్తి గెలిస్తే లాభమే
పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందే జనగామ నియోజకవర్గంలోని అనేక విషయాలు తెలుసుకొని, అవి వెరవేర్చాలని తనను కోరడం మంచి విషయమని కేసీఆర్ అన్నారు. రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తీసుకునివస్తే, నెలలోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకు దగ్గరివాడని, జనగామ అభివృద్ధికి అద్భుతంగా కష్టపడ్డారని ప్రశంసించారు. ‘బంగారమోలె గెలిచే సీటు. పోడగొట్టుకోవద్దు. ఈ టర్మ్‌లో యువకుడికి అవకాశం ఇద్దామని, పల్లారాజేశ్వర్రెడ్డిని పంపిద్దామని నేనే స్వయంగా ఆలోచన చేసిన. రాజేశ్వర్‌రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి. 24 గంటలు నా ఇంట్లోనే ఉంటడు. ఒక్క ఎలక్షన్ కోసం కాదు. పార్టీ ఏ పాలసీ ఉన్నా.. ముఖ్యమైన నిర్ణయమున్నా ప్రతిదాంట్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి భాగస్వామ్యమైతడు. చెరువు కోసం వేచిచూసే పనిలేదు. నీరటే మీ దగ్గరున్నడు. కేసీఆర్ పక్కనుండే వ్యక్తే మీ ఎమ్మెల్యేగా ఉంటే ఏ పని ఆగదు. బ్రహ్మాండంగా పనులు పూర్తయితై. ప్రజలంతా దీవించి, బ్రహ్మాండమైన మెజార్టీతో ఆశీర్వదించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. నియోజకర్గంలోని పనులన్నీ పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకుంటానని కేసీఆర్ ప్రకటించారు.
లక్ష మెజార్టీతో పల్లా గెలుపు ఖాయం
బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య అనుభవమున్న వ్యక్తి అని, ఇదే జనగామ ప్రజలు ఆయన్ను నాలుగుసార్లు దీవించారని, ఈ ప్రాంతానికి గొప్పగా సేవలందించారని కేసీఆర్ గుర్తుచేశారు. పొన్నాల కాంగ్రెస్‌పార్టీలో బాధపడి గాయపడి, బయటికొచ్చారని, తాను పిలవగానే తనపై నమ్మకంతో పార్టీలోకి వచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ వెంట వస్తానని, జనగామతోపాటు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. పొన్నాల దీవెన, ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి ఆశీర్వాదంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమైందని చెప్పారు. జనగామ ప్రజలు పల్లాకు లక్ష మెజార్టీనందించి రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగించే సమయంలో తాను ఇదే నియోజకవర్గంలోని చేర్యాలకు వస్తానని, చేర్యాల అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నదని కేసీఆర్ చెప్పారు. చేర్యాలలో సభలో అందరినీ మరోసారి కలుస్తానని తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దివ్యంగా దళితబంధు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా.. ఏ నాయకుడికైనా దళితబంధులాంటి పథకం పెట్టాలన్న ఆలోచన వచ్చిందా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఇలాంటి ఆలోచన వచ్చిందా? అన్నది రాష్ట్రంలోని దళితులు ఆలోచించాలని కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక దళితబంధు అమలుచేస్తే దళితుల జీవితాలు ఇట్లా ఉండేది కావని పేర్కొన్నారు. తానే ఆలోచించి ధైర్యంచేసి, ఏడాదికి కొంత మంది చొప్పున పది లక్షలిచ్చి దివ్యంగా దళితబంధును అమలు చేసుకుంటున్నామని చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
భువనగిరికి ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్
భువనగిరి హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి.. ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌కు దిశా నిర్దేశం చేసినట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఎన్నికల తర్వాత త్వరలోనే భువనగిరికి ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నేనే తీసుకుంటా. దీనితోపాటు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టించే బాధ్యత నాదే’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతాయని కేసీఆర్ ఆకాంక్షించారు.
భువనగిరిలో పైళ్ల గెలుపు తథ్యం..
తనకున్న సర్వే రిపోర్టుల ప్రకారం భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి 50వేల పైచిలుకు మెజార్టీతో గెలువబోతున్నట్టు కేసీఆర్ చెప్పారు. అందుకు ప్రజలు పైళ్ల శేఖర్‌రెడ్డిని దీవించాలని కోరారు. తాను పెద్ద గ్రౌండ్లో సభ పెట్టమని చెబితే.. ‘సర్ ఇది నాకు సెంటిమెంట్. గతంలోనూ ఇదే సభ ద్వారా గెలిచినా. కచ్చితంగా ఇక్కడనే పెట్టుకుందాం’ అని పైళ్ల చెప్పినట్లు సీఎం తెలిపారు. అందుకు తాను ఓకే చెప్పానని, ఈ సభలో ప్రజలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ‘మీ అందర్నీ కోరేది ఒక్కటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించండి. శేఖర్‌రెడ్డిని దీవించండి’ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. హెలిక్యాప్టర్‌లో ఎక్కడికైనా పోతే ప్రతి గ్రామంలో ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా దళారీ వ్యవస్థ లేదు. వడ్లన్నీ ప్రభుత్వమే కొంటున్నది. తెలంగాణ రైతు ముఖం ఇప్పుడిప్పుడే కాస్త తెలివైతున్నది. రాష్ట్రంలో అమ్మవారి దయతో లక్ష్మీదేవి తాండవం చేస్తున్నది. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఓటు ఆచితూచి వేయకుంటే.. కొత్తోళ్లు అధికారంలోకి వస్తే.. మళ్లీ పాతరోజులే వస్తాయి.
-సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్‌తో కలిసి నడుద్దాం: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సహకారంతో భువనగిరి నియోజకవర్గంలో రూ.600 కోట్ల అభివృద్ధి చేశాను. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనందరం సీఎం కేసీఆర్‌తో కలిసి నడుద్దాం. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్డు విస్తరణతోపాటు పెద్దచెరువు, బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాం. కిసాన్ నగర్ అర్బన్ కాలనీ రోడ్లను అభివృద్ధి చేశాం. నేడు అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నది. భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల, ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని, భువనగిరి వరకు మెట్రో రైలు పొడిగించాలని, నరసింహ రిజర్వాయర్ నిర్మాణ క్రమంలో భూమి కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, భువనగిరి, పోచంపల్లిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను. మరొక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఇవి సాధ్యం చేసి చూపిస్తాను.
4 ఏండ్లు మేధోమథనం చేసి ధరణి తెచ్చా..
నాలుగేండ్ల మేధోమథనం చేసి ధరణిని తీసుకొచ్చానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు రైతు భూమి మీద రైతుకు మాత్రమే హక్కు ఉంటుందని చెప్పారు. రైతు వేలిముద్ర లేకుంటే వీఆర్వో నుంచి రెవెన్యూ మంత్రి వరకూ ఎవరూ ఏం చేయలేరని, చివరికి ముఖ్యమంత్రి తలుచుకున్నా ఆ భూమిని వేరేపేరు మీదకు మార్చలేడని అన్నారు. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సునాయాసంగా జరుగుతున్నదని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పల్లెలు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ వచ్చి ధరణిని తీసేసి కొట్లాటలు పెట్టాలని చూస్తున్నదని, కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తున్నదని అన్నారు. దీనిని అందరూ గ్రహించాలని సూచించారు.
నృసింహసాగర్తో లక్ష ఎకరాలకు నీళ్లు
బస్వాపూర్ రిజర్వాయర్‌కు ‘నృసింహసాగర్’గా నామకరణం చేశామని, ఆ పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలను సాగునీరు అందుతుందని, భువనగిరి నియోజకవర్గం మొత్తానికి నీరు అందుబాటులోకి వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును సైతం త్వరలోనే ప్రారంభించుకోబోతున్నట్టు తెలిపారు. కలలో కూడా ఊహించని విధంగా కాళేశ్వరం నీళ్లతోని బస్వాపూర్ ప్రాజెక్టును నింపుతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరిలో అరాచకశక్తులను పెంచి పోషించిందని, వాళ్లు ప్రజలను గోస పెట్టారని, అటువంటి అరాచక, కిరాతక మూకలను బీఆర్ఎస్ ఏరిపారేసిందని గుర్తుచేశారు. కాబట్టే.. భువనగిరి ప్రజలు సుఖంగా, శాంతియుతంగా బతుకుతున్నారని, భువనగిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
‘రాష్ట్రంలో కులం, మతంలేకుండా ముందుకుపోతున్నాం. పదేండ్లలో ఒక మత కల్లోలం లేదు. గడబిడ లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. పారిశ్రామిక విధానం బాగుండటంవల్ల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ, పరిశ్రమల్లో 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలొచ్చినయి. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాల్సిన అవసరముంది. కొంత మంది ఏదో ఏదో చెప్పుతరు. అది కరెక్ట్కాదు. హిందువులు, ముస్లింలు ఇదే విధంగా కలిసి ఉండాలి. కేసీఆర్ జీవించి ఉన్నంతకాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా కొనసాగుతుంది.
-సీఎం కేసీఆర్
బీఆర్ఎస్కు నీరాజనం
వరంగల్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ సోమవారం నిర్వహించిన జనగామ, భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అంచనాకు మించి అనూహ్యం ప్రజలు తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ట్రాలీలు, బైకుల్లో ప్రజలు భారీగా జనం తరలివచ్చారు. సీఎం రాకముందే సభా ప్రాంగణాలు మొత్తం జనం తో నిండిపోయాయి. జనగామలో గాయకుడు ఏపూరి సోమన్న బృందం, భువనగిరిలో సింగర్ మధుప్రియ బృందం, ఇతర కళాకారులు పాటలు అలరించాయి. మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో తరలివచ్చారు. ఒగ్గుడోలు, కొమ్ముడోలు కళాకారులు సంప్రదాయ పద్ధతిలో మెప్పించారు. గిరిజనులు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారీ ర్యాలీతో సభకు వచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగం సాగినంత సేపు.. ఈలలు, చప్పట్ల మార్మోగాయి.
కాంగ్రెస్‌తో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే ధరణి ఎత్తేస్తరు, పైరవీకారులొస్తరు, వకీళ్లను పట్టుకొని మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాలి. కరెంటు మాయమైతది, దళితబంధు ఆగమైతది, అన్నీ పోతై.. మళ్లీ దళారుల రాజ్యం వస్తది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి.
-సీఎం కేసీఆర్
జనగామకు పెద్ద పాలేరుగా పనిచేస్తా: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
పెద్దసారు కేసీఆర్ తన మీద నమ్మకంతో జనగామ అభ్యర్ధిగా వెళ్లమన్నప్పుడు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు వెళ్తే అందరూ ఆశీర్వదిస్తున్నారని జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రేమ, అభిమానం, నమ్మకం, విశ్వాసం తన మీద కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైన అని తనకు తెలుసునని చెప్పారు. ‘పెద్దసారు జనగామ జిల్లా ఇచ్చారు. రైతులకు సాగునీరు ఇచ్చారు. మెడికల్ కాలేజీ ఇచ్చారు. ఇంకా ఏం కావాలో సారుకు తెలుసు’ అని పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, బొమ్మకూరు ద్వారా ఇస్తున్నారని, ఎక్కడైతే పంట కాలువలు, చెక్‌డ్యాంలు, మినీ లిఫ్ట్‌లు కావాలో వాటన్నింటిని ఇవ్వాలని జనగామ ప్రజల తరుపున విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. జనగామకు మెడికల్ కాలేజీ ఇచ్చారని దానితోపాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు. చీటకోడూరు రిజర్వాయర్‌ను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్వద్ద నుంచి అవసరమైన నిధులు తెచ్చి జనగామ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం తొలి ఎజెండాగా పెట్టుకుంటానని చెప్పారు. జనగామకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రంగప్ప చెరువు అభివృద్ధి, ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్, డీసీపీ ఆఫీస్, స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాలని, బచ్చన్నపేట, చేర్యాల, నర్మెటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కావాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని కోరారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఈ పనులన్నీ పట్టుబట్టి చేస్తానని మాట ఇచ్చారు.
సీఎం కేసీఆర్ దూత పల్లా: మంత్రి ఎర్రబెల్లి
జనగామ, చేర్యాల ప్రాంతాలంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని, అందుకే ఆయన దూతగా నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పంపించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లాలో మూ డుకు మూడు నియోజకవర్గాలు గెలిపిస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12కు 12సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ ఐకాన్: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్సార్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. నాటి జనగామ ఎట్లుండే.. నేటి జనగామ ఎట్లా మారిందో మీ కండ్ల ముందున్నదని, అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ది ప్రజా మ్యానిఫెస్టో
తనకు కులం, మతం, జాతి భేదాలు లేవని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు జనహితమైన మ్యానిఫెస్టోను తీసుకొచ్చినట్టు కేసీఆర్ తెలిపారు. రైతుబంధు సాయాన్ని పెంచామని చెప్పారు. మహిళలకు సాధికారత పథకం తీసుకొచ్చామని, రైతుబీమా తరహాలో 93 లక్షల కుటుంబాలకు ‘కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా’ పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడ్డ 3-4 నెలల్లో బీమా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణలా రాష్ట్రం తయారైందని, మనమెందుకు సన్నబియ్యం తినొద్దనే తెల్లరేషన్ కార్డుదారులందరికీ రాబోయే మార్చి తర్వాత సన్నబియ్యమే ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే ప్రజలు బీఆర్ఎస్నే ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
భువనగిరిలో కరువు గోస తీర్చినం
కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో అద్భుతమైన పంటలు పండుతున్నాయని, ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలని చేసిన ఎన్నో పోరాటాలు, మరెన్నో కలలను సాకారం చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి జలాలతో ఇక్కడున్న కాలువలు, చెరువులు నింపడం ద్వారా గొప్పగా పంటలు పండించుకుంటునట్టు వెల్లడించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం రావడంతో.. ఈ జిల్లాకు ‘యాదాద్రి భువనగిరి’ అంటూ ఆ దేవునిపేరు పెట్టుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాకపోతే యాదాద్రి భువనగిరి జిల్లా అయ్యేది కాదని అన్నారు. భువనగిరి ఓ జిల్లాగా అవతరించడం మీ అందరి పోరాట ఫలితమేనని తెలిపారు.
భూముల ధరలకు రెక్కలు
తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని కొందరు సన్నాసులు భయపెట్టినట్టు నాటి విషయాలు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాకతో స్వరాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలొచ్చినట్లు చెప్పారు. ‘యాదగిరి గుట్ట దగ్గర భూములకు పొద్దునొక రేటు, మధ్యాహ్నమొక రెటు, సాయంత్రమొక రేటు నడుస్తున్నదని, ఎక్కడ చూసినా భూ ములు కోట్ల ధర పలుకుతున్నాయని చెప్పా రు. ఎక్కడా లక్షల రూపాయల మాటనేది లేదని, తెలంగాణలో బ్రహ్మాండంగా భూము ల ధరలు పెరిగినయ్’ అని కేసీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. భూమిలేని నిరుపేదల కోసం కేసీఆర్ బీమా, సన్నబియ్యం, సౌభాగ్య లక్ష్మి, గృహనిర్మాణం వంటి పథకాలు ప్రకటించామని తెలిపారు. ఎన్నికల తర్వాత బస్వాపూర్ ప్రాజెక్టు ప్రారంభానికి తప్పకుండా వస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇన్నేండ్లలో కాంగ్రెస్ ఎందుకియ్యలేదు? కాంగ్రెస్ ప్రభుత్వాలున్న చోట 24 గంటల కరెంట్ ఇస్తున్నదా? నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిన్రు. అక్కడ పంటలన్నీ ఎండిపోతున్నయి. రైతులు ధర్నాలు చేస్తున్నరు. తెలంగాణలో 24 గంటల కరెంట్ అందాలంటే, రైతుల భూములు మరొకరి పాలు కావొద్దంటే, సేఫ్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కావాలంటే.. కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలి.
-సీఎం కేసీఆర్