ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు తెలుగు నుడికారానికి గుడి కడుతాయి. ఆయన మాటల్లో అచ్చతెనుగు మాటలు, సామెతలు, జాతీయాలు జాలువారుతాయి. సాహిత్య సౌరభంతో గుబాళిస్తాయి. విన్నాకొద్దీ వినాలనిపిస్తాయి. ‘తెలంగాణ కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు’ అంటూ యతి ప్రాసలతో మతిపోగొట్టడం ఆయనకే సాధ్యం. ‘పంచుడో-దంచుడో, ఇచ్చుడో-సచ్చుడో’ వంటి నినాదాలతో జనాలను ఉర్రూతలూగించారు. అప్పుడప్పుడూ మారుమూల మరుగున పడిన మాటలను బయటకి తీస్తూ ఔరా అనిపిస్తారు. ఏవేవో చారిత్రిక, పౌరాణిక ఘట్టాలను, పాత్రలను గుర్తుచేసి అబ్బురపరుస్తారు. తాజాగా ఖమ్మం జిల్లా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇద్దరు స్థానిక నాయకుల గురించి తెచ్చిన పోలికలు ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ పోలికలు ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారా అనే చర్చ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆ ఇద్దరి పేర్లు ఆయన బయటికి అనకపోయినా అందరికీ తెలిసిందే. ‘కరటక, దమనకుల్లా వారు మోపయ్యార’ని ఆయన తనదైన రీతిలో చమత్కరించారు. చివరికి ‘వారు సుందోపసుందుల్లా ఒకరినొకరు ఓడగొట్టుకుంటార’ని కూడా ఆయన అన్నారు.
సాహిత్య పిపాసి అయిన సీఎం కేసీఆర్ తెలుగు జాతీయాలను ఒడుపుగా విసిరి చురకలు వేయడం గమనార్హం. ఇందులో మొదటిదైన కరటక, దమనకుల పాత్రలు నీతికథల్లో వచ్చేవి. చిన్నయసూరి రాసిన పంచతంత్రంలో కరటక, దమనకులు అనేవి రెండు జిత్తులమారి గుంటనక్కలు. మోసకారి మాటలతో తంపులు పెట్టడం వాటి ప్రత్యేకత. నయవంచనతో పబ్బం గడుపుకోవాలని చూస్తుంటాయి. చివరికి తాము తీసిన గోతిలో తామే పడుతాయి. ఇవి దుష్టబుద్ధి గల నక్కలు. అవసరమైనచోట ప్రాణమిత్రులుగా నటిస్తూ, సహాయం చేస్తున్నట్టు కనిపిస్తూనే మోసం చేసే లక్షణాలున్నాయి ఈ కరటకుడు, దమనకుడు పాత్రలకు. తోడుదొంగలు, మోసగాళ్ళు. ఎదుటి వారిని మోసం చేయటానికి ఒకరు ఆ ఎదుటి వ్యక్తికి విరోధిగానూ, మరొకరు మిత్రుడిగానూ నటిస్తుంటారు. విరోధిగా నటించేవాడైనా, మిత్రుడిగా నటించేవాడైనా ఆ ఇద్దరిదీ ఎదుటివ్యక్తిని మోసం చేసి లాభపడాలన్నదే ఆలోచన. అందుకే ఎవరైనా ఇతరులను మోసం జేసే ఇద్దరు వ్యక్తులు జంటగా తిరుగుతుంటే వారిని కరటక దమనకులు అంటూ.. వారితో జాగ్రత్తగా ఉండాలని ఇతరులను హెచ్చరిస్తారు. వ్యవహారంలో జోగడు బాగడు తరహాలో ఈ రెండు పాత్రల పేర్లను వినియోగిస్తుంటారు.
ఇక సుందోపసుందులు పురాణ పాత్రలు. వారు ఘోరమైన తపస్సు చేసి ఇతరుల చేతిలో చావకుండా బ్రహ్మ నుంచి వరం పొందుతారు. వారి అరాచకాలు శృతిమించినప్పుడు దేవతలు తిలోత్తమను పంపి తగాదాలు పెట్టిస్తారు. వారిలో వారే ఆమె కోసం కొట్టుకొని అంతమవుతారు. అంటే సీఎం కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావించిన ఆ ఇద్దరూ చివరికి తమలో తామే తగవుపడి పరస్పరం దెబ్బతీసుకుంటారని పోలిక వెనుక గల ఉద్దేశం.
– తుమ్మలపల్లి రఘురాములు