CM KCR | స్టేషన్ ఘన్పూర్ : ఇందిరమ్మ రాజ్యం పేరిట ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని కేసీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఉద్యమాలే కదా..? ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడ్సింది. మందిని పట్టుకుపోయి జైళ్లో పడేసిండ్రు కదా..? మంచినీళ్లు, కరెంట్ లేకుండే కదా..? ఇవాళ ఎవ్వళ్లకు కావాలి ఇందిరమ్మ రాజ్యం. ఎవ్వళ్లు కోరుతున్నారు.. ఇందిరమ్మ రాజ్యం కావాలని మనం కోరుతున్నామా..? ఆ దిక్కుమాలిన రాజ్యం. ఏముండే, ఏం జరిగింది. ఏం లేదు. బలిసినోడు బలిసిపోయిండు.. తిండికి లేనోడు తిండికి పోయిండు. ఇందిరమ్మ రాజ్యం అంత సక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది. రూ. 2కే బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. మాడిన కడుపులు ఉన్నాయని, ఎండుతున్న డొక్కలు ఉన్నాయని నాడు 2 రూపాయాలకే బియ్యం పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. మనం ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య పరిణితితో ఈ నిర్ణయాలు చేయాలి అని కేసీఆర్ సూచించారు.
కడియం శ్రీహరి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ శ్రీహరికి ఇచ్చామని రాజయ్యను చిన్నచూపు చూడం. ఆయన కూడా మంచి హోదాలో, పదవిలో ఉంటారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు మాట ఇస్తున్నా.. రాజయ్య కూడా మంచి హోదాలో బ్రహ్మాండంగా ఉంటారు. ఆయన కూడా సేవ చేస్తనే ఉంటారు. దానికి ఇబ్బందేం లేదు. కానీ శ్రీహరి గురించి ఆయన చరిత్ర చాలా పెద్దది. ఘనపురంలో ఆయన ఎట్ల పని చేసిండో, అభివృద్ధి కోసం ఎట్ల తండ్లాడిండో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు ప్రజల రైతుల గురించి ఎంత సేవ చేసిండో నేను మీకు చెప్పే అవసరం లేదు. ఆయన గెలిస్తే బ్రహ్మాండంగా ఘనపురం అభివృద్ధి జరుగుతది. ఆయన కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు. ఘనపురం మున్సిపాలిటీ, కొన్ని విద్యాసంస్థలు రావాలని కోరారు. అవన్నీ చేయించే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కడియం శ్రీహరి మంచి, ఉత్తమమైన నాయకుడు, గెలిపించాలని కోరుతున్నా అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.