పటాన్చెరు, ఆగస్టు 23: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ పర్యటనకు వెళ్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల వద్ద ఆగారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు వేలాది కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు అతి త్వరలో పటాన్చెరు ప్రాంతానికి వస్తాయని భరోసా ఇచ్చారు. కాలువల తవ్వకం జరుగుతున్నదని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి ఎకరాను పచ్చని పొలాలతో సస్యశ్యామలం చేస్తామని అభయమిచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. మరొక్కసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, కలెక్టర్ శరత్‌కుమార్, ఎస్పీ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.