పాట్నా: కక్షిదారుడు కోర్టుకు రాలేని స్థితిలో ఉండగా, న్యాయస్థానమే అతని వద్దకు వెళ్లి తీర్పు చెప్పిన అరుదైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పాట్నాలోని జిల్లా కోర్టుల ప్రాంగణంలో సోమవారం ఈ దృశ్యం కన్పించింది. ఒక బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వద్దకే సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి అవినాశ్ కుమార్ వెళ్లి తీర్పు చెప్పారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జై నారాయణ్ సింగ్ వయసు 95 ఏండ్లు. అతను కనీసం కాళ్లు కూడా కదిలించలేని స్థితిలో ఒక వాహనంలో రాగా, న్యాయమూర్తి అతని వద్దకు వెళ్లి తీర్పును చదివారు. ఈ కేసులో జై నారాయణ్ సింగ్‌ను.. న్యాయమూర్తి దోషిగా ప్రకటించారు. అతని వృద్ధాప్యం వల్ల రూ.2 వేలు జరిమానా విధించారు.