సిటీబ్యూరో/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కోర్టు ప్రధాన బిల్డింగ్‌లో ప్రత్యేకమైన బాంబు అమర్చామని, కొద్దిసేపట్లోనే బ్లాస్ట్ అవుతుందంటూ వచ్చిన సమాచారంతో పోలీసులతో పాటు న్యాయవాదులు అలర్ట్ అయ్యారు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు బాంబులు బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ వచ్చాయి.
తెలంగాణలోని నాంపల్లి సీబీఐ, కరీంనగర్ కోర్టులతో పాటు రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లాకోర్టు, అనంతపురం కోర్టుల్లో 12 ఆర్డీఎక్స్ బాంబులు పెట్టామని ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అవి పేలుతాయని అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు కోర్టుకు చేరుకుని న్యాయమూర్తులతో పాటు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేశారు. బాంబ్‌స్కాడ్, డాగ్ స్కాడ్లతో కోర్టులోని ప్రతీరూమ్ను, పార్కింగ్ ఏరియాను తనిఖీ చేశారు.
అనుమానాస్పద వస్తువుల కోసం అణువణువూ గాలించారు. ఇది కేవలం బెదిరింపు మెయిలా లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించడానికి ఇలా మెయిల్ పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడినుంచి వచ్చింది, ఎవరు పంపారన్నదానిపై విచారణ చేస్తున్నారు. నాంపల్లి కోర్టులకు బాంబ్ బెదిరింపు మెయిల్స్ రావడం ఇది రెండోసారి. ప్రత్యేక సీబీఐ కోర్టులో జగన్, వివేకాహత్య, రేవంత్‌రెడ్డిలకు చెందిన కేసులు కొనసాగుతుండడం విశేషం. కేసుల విచారణ కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి బెదిరింపు కాల్స్‌పై గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సిన అవసరముంది.