Telangana | డొక్కలెండిన పశువుల్లేవు.. బీళ్లు బారిన భూముల్లేవు.. దుమ్ముపట్టిన దర్వాజల్లేవు.. నోళ్లు తెరిచిన బావుల్లేవు.. నీళ్లక్యాన్లు మోసే సైకిళ్లు లేవు.. ప్లాస్టిక్ బిందెల కొట్లాటలు లేవు.. కరెంటు కోసం పడిగాపుల్లేవు.. బాయికాడ జాగారాల్లేవు.. పెండ్లికాని రైతు బిడ్డల్లేరు.. తెలంగాణలో 8 ఏండ్ల క్రితం ఉన్న కష్టాలేవీ ఇప్పుడు లేవు.
ఎందుకు లేవంటే.. కాళేశ్వరం జలాలతో పోటీపడుతూ గత 8 ఏండ్లలో తెలంగాణ పల్లెల్లో నిధుల ప్రవాహం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం రూ.8.41లక్షల కోట్ల నిధులను పారించింది. ఇందులో కల్యాణలక్ష్మి నుంచి పింఛన్ల వరకు పంచిన మొత్తం ఉన్నది. ఉచితవిద్యుత్తు మొదలు ప్రాజెక్టుల నిర్మాణం వరకు వెచ్చించిన నిధులు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల రూపంలో అందించిన మొత్తమూ ఇందులో మిళితమై ఉన్నాయి. సగటున ఏడాదికి పల్లెలపై కేసీఆర్ సర్కారు వెచ్చించిన నిధులు అక్షరాలా లక్ష కోట్ల పైమాటే.
8 ఏండ్లలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాల్లో వేసింది రూ.4.5 లక్షల కోట్లు. అంటే, ఏడాదికి రూ.56వేల కోట్లు ప్రజల చేతికి అందించింది. తెలంగాణలో ఉన్న మొత్తం 12,769 గ్రామ పంచాయతీల వారీగా చూస్తే.. 8 ఏండ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సగటున ఒక్కో గ్రామానికి అందిన మొత్తం రూ.66 కోట్ల పైమాటే!.
అందుకే పల్లెల్లో మౌలికసౌకర్యాలు మెరుగుపడ్డాయి. గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అదేవిధంగా 2.5 కోట్ల రాష్ట్ర గ్రామీణ జనాభా కోసం 8 ఏండ్లలో వెచ్చించిన రూ.8.41 కోట్ల నిధులను లెక్కిస్తే.. సగటున ఒక్కో గ్రామీణ పౌరుడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.3 లక్షల 36వేలు! ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఆర్థిక, ఆదాయ, ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయి. అందుకే తెలంగాణ పల్లె పరవశిస్తున్నది. జాతీయ స్థాయిలో మెరుస్తున్నది.
(నెలకుర్తి శ్రీనివాసరెడ్డి, స్టేట్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్థితిగతుల్ని మార్చడం ద్వారా ఆర్థికశక్తిని పెం చుతాయి. తద్వారా సమాజ పురోగతికి కారణమవుతాయి. అందుకు 8 ఏండ్లలో తెలంగాణ ప్రజల జీవనస్థితిగతుల్లో వచ్చిన మార్పే ఓ ఉదాహరణ. రాష్ట్ర ఆవిర్భావంతో స్వపరిపాలన సా ధ్యంకాగా, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కింది. ప్రగతి రూపుదిద్దుకున్నది.
సుదీర్ఘ మథనం తర్వాత అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల ఆర్థికస్థితిని మెరుగుపర్చాయి. ఒకనాడు బుక్కె డు బువ్వకు ఏడ్చిన పల్లెలు నేడు పది మందికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ద్వారా గ్రామీణ జనం బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4.46లక్షల కోట్ల వరకు జమ చేసింది. మౌలికవసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు 8 ఏండ్లలో మరో రూ.3.95 లక్షల కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 73 శాతం పెరిగాయి. తెలంగాణ వస్తే లక్షా 2 లక్షలు కూడా లేని వ్యవసాయ భూముల ధరలు నేడు రూ.25-30 లక్షలకు పెరిగాయి. గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక సదుపాయాలు పెరిగాయి. తెలంగాణ ఎవరికోసం అన్నవారు సైతం ఆశ్చర్యపడేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది.
8 ఏండ్లు.. 8.4 లక్షల కోట్లు ఇదీ పల్లెలపై కేసీఆర్ సర్కారు నిధుల కుమ్మరింత
1.04 లక్ష కోట్లు గ్రామాల్లో సగటున ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం పారించిన నిధులు
4.5 లక్షల కోట్లు ఇదీ 8 ఏండ్లలో నేరుగా ప్రజల ఖాతాల్లో వేసింది ( సగటున ఏడాదికి 56 వేల కోట్లు )
66 కోట్లు సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి 8 ఏండ్లలో అందిన మొత్తం ( మొత్తం గ్రామ పంచాయతీలు 12,769 )
3.36 లక్షలు సగటున ఒక్కో పౌరుడికి 8 ఏండ్లలో అందిన మొత్తం ( రాష్ట్ర గ్రామీణ జనాభా 2.5 కోట్లు )
8 ఏండ్లలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరు గా రూ.4,46,276 కోట్లు జమ అయ్యాయి. మరో రూ.3,94,803 కోట్లు వి విధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా రూ.8,41,079 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలను నేరుగా జమ చేస్తున్నది. రాష్ట్ర జీఎస్డీపీ తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం కేవలం రూ.4.51 లక్షల కోట్లు ఉంటే 2021-22లో రూ.11.48 లక్షల కోట్లకు చేరింది. వ్యవసాయాన్ని రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభు త్వం ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్నది. కావాల్సినంత సాగునీరు సరఫరా చేస్తున్నది. అవసరమైన పెట్టుబడిని ఇస్తున్నది. పంటలను ప్రభుత్వమే కొం టున్నది. వాటి డబ్బులను రైతు ఖాతాలో వేస్తున్నది. 2014-15లో క్యాపిటల్ వ్యయం కేవలం రూ.11,583 కోట్లు ఉండ గా.. 2021-22తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అది రూ.61,34 3 కోట్లకు చేరింది. అంటే 5 రెట్లకు పైనే వృద్ధి నమోదైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతిఆయోగ్ స్పష్టం చేస్తున్న గణాంకాలు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర పథకాలకు 87 శాతం క్యాపిటల్ వ్యయాన్ని అదనంగా నిధులను ఖర్చు చేసిందని లెక్కలు చెప్తున్నాయి.
ప్రభుత్వం గ్రామాలు, ప్రజల కు నేరుగా నిధుల్ని అందిస్తుండ టంతో ప్రజల ఆర్థికస్థితి మెరుగైంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఒకప్పుడు లక్ష, రూ.2 లక్షలకు ఎకరం ధర పలుకగా.. ఇప్పుడవి 25-30 లక్షలు ఉంది. ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా సాగు భూముల ధరలు 25 లక్షల కంటే ఎక్కువే. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెద్దఎత్తున చేపట్టిన రోడ్ల నిర్మాణం, వ్యవసా య భూములకు పుష్కలంగా సాగునీరు అం దించడం, 24 గంటల విద్యుత్తు, సరియైన సమయంలో ఎరువులు, విత్తనాల సరఫరా, అన్నింటికి మించి రైతుబంధుతో అన్నదాతలకు పం ట పెట్టుబడి సాయం అందుతుండటంతో వ్యవసాయ భూముల కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ద్వారానే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టమవుతున్నది. గ్రామీ ణ ప్రజల దగ్గర డబ్బులు ఉండ టం, వారి ఆదాయం, రాబడి పెరగడంతో ఇవి సాధ్యమయ్యాయి.
రైతుబంధు, ఆసరా పింఛను, రైతుబీమా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, దళితబంధు, ఉపాధిహామీ కూలీ, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, గొర్రెల కొనుగోలు, ఉద్యోగుల వేతనాలు ఇలా అనేక మార్గాల్లో ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నది. వ్యవసాయం దాని అనుబంధరంగాలు, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, పర్యాట కం, మెడికల్ టూరిజం రంగాల్లో జరుగుతున్న వర్తక, వాణిజ్యంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను ప్రోత్సహించడం మూలంగా జరుగుతున్న వాణిజ్య లావాదేవీలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తమ పిల్లలను మంచి స్కూల్లో చదివించడం, భూములు, వాహనాల కొనుగోలు, పట్టణాల్లో ఇండ్లు కొనుగోలు చేయడంతోపాటు పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవడంతోనే ఈ విజయం సాధ్యమైందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారింది. ప్రజల అకౌంట్లోకే ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేస్తున్నది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు విడతల్లోనూ ఉద్యోగులకు పెద్దఎత్తున పీఆర్సీని ప్రకటించింది. 2015లో 43 శాతం ఫిట్మెంట్ను, 2021లో రెండోసారి 30 శాతం ఫిట్మెంట్ను అందించింది. ఈ వేతనాల పెంపు ద్వారా దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు పొందారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వేతనాలను పెంచారు. విద్యుత్తు ఉద్యోగులకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వేతనాలు అందుతున్నాయి. అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, హోంగార్డులు తదితర ఉద్యోగులకు పెద్దఎత్తున వేతనాలను పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాల్లో, ఆర్థిక పరిస్థితుల్లోనూ మార్పు వచ్చేందుకు ఇది ఎంతగానో దోహదపడింది.
ప్రజలకు నేరుగా వారి అకౌంట్లో డబ్బులు జమ చేసే పథకాలే కాకుండా.. పరోక్షంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలకు అవసరమైన రోడ్లపై పెద్దఎత్తున నిధులను ప్రభుత్వం వెచ్చింది. రోడ్లు, మిషన్ భగీరథ, రైతువేదికలు, ఉచితవిద్యుత్, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, పట్టణప్రగతి, పల్లెప్రగతి సహా అనేక పథకాలను అమలు చేసింది. వీటన్నింటితో గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు ఒనగూ రాయి. స్థానికంగా ఉన్న వనరులు, రవాణా వాహనా లు మొదలైన వాటికి డిమాండ్ ఏర్పడటంతోపాటు స్థానికులకు ఉపాధి దొరుకుతున్నది. రోడ్లు, భవనాలు, ఇతర మట్టి పనులకు స్థానికంగా అందుబాటులో ఉండే కూలీలనే వినియోగిస్తారు. స్థానికంగా ఉండే వాహనాలనే వినియోగిస్తారు.
ఒకనాడు గ్రామీణ ప్రాంత ప్రజల్లో పదులు, వందలు చేతుల్లో ఉంటే మహాగగనం. అలాంటిది ఇప్పడు పల్లె జనాల్లో వేలు, లక్షలు చేతుల్లో తిరుగుతున్నాయి. కొద్దిపాటి భూమి ఉన్నవారు సైతం ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకున్నారు. పంట పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చడంతో అప్పుల రంది లేకుండా పోయింది. సాగు లాభసాటిగా మారింది. ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో గ్రామీణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గ్రామాల్లో ఒకనాడు లగ్జరీ అనుకున్న వస్తువులు నేడు సాధారణమై పోయాయి. గ్రామాల్లోనూ వాహనాల కొనుగోలు చేసే సంఖ్య కూడా పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం.. దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందడాన్ని గమనించవచ్చు. 8 ఏండ్లలో జీఎస్డీపీ సుమారు మూడు రెట్లు పెరిగింది. ‘ఎకరం అమ్మితే 20-30లక్షలు వస్తయి నాకేంది! నా కుటుంబానికి ఏం తక్కువైంది. నా కొడుకును, బిడ్డను మంచిగా చదివించుకుంటా.. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటా’ అనే ఆత్మవిశ్వాసం గ్రామీణుల్లో కనపడుతున్నది. ఇది తెలంగాణ వచ్చిన తరువాత పల్లెల ఆర్థికస్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి సూచిక.
ఒక అంచనా ప్రకారం.. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి తదనంతరకాలంలో సగటున 18 రెట్ల్ల ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తల మాట. అంటే తెలంగాణలో గడిచిన 8 ఏండ్లలో వెచ్చించిన రూ. 8.41 లక్షల కోట్ల నిధులు.. సుమారు 151 లక్షల కోట్ల ప్రయోజనాలను చేకూర్చిందన్నమాట. ఇది కదా గ్రామీణ వికాసం. ఇదే కదా గ్రామస్వరాజ్యం.
ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి డైరెక్ట్ బెనిఫిట్ స్కీం(డీబీటీ) విధానం చాలా ఫలితాలను ఇస్తుంది. బీఆర్ఎస్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పడంతో వచ్చిన మార్పు ఇతర రాష్ర్టాల్లోనూ సాధ్యమవుతుంది. కేసీఆర్ ప్రజల కోణంలో ఆలోచిస్తున్నారు.
– పాపారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్ర జల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగ తులు చాలా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో లగ్జరీ వస్తు వులుగా గుర్తింపు పొందినవి ప్రస్తుతం కనీస అవసరాలుగా మారాయి. దీంతో పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి.
– ప్రొఫెసర్ రేవతి, సెస్ డైరెక్టర్
రైతుబంధు 65,481
రైతుబీమా 5,384
రైతు రుణమాఫీ 17,351
ఆసరా పింఛన్లు 57,650
కల్యాణలక్ష్మి 8,182
షాదీముబారక్ 1,902
ఉపాధిహామీ కూలీ 27,825
కేసీఆర్ కిట్ 1,420
దళితబంధు 4,404
ఆరోగ్యశ్రీ 8,000
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 1,325
మూడు ఎకరాల భూమి 768
రైతువేదికలు 572
దళితులకు ఉచిత విద్యుత్తు 251
ఎస్సీ సబ్ ప్లాన్ 70,965
ఎస్టీ సబ్ ప్లాన్ 37,779
ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ 639
ఎస్టీలకు ఉచిత విద్యుత్తు 192
సెలూన్లకు ఉచిత విద్యుత్తు 147
పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం 361
గేదెల పంపిణీ 370
పంటల కొనుగోలు 6,195
ధాన్యం కొనుగోలు 1,21,000
మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ 435
బతుకమ్మ చీరలు 1,536
క్రాప్ ఇన్సూరెన్స్ 2,463
రైతులకు వడ్డీ లేని రుణాలు 919
4,46,276 కోట్లు మొత్తం