CM KCR | సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
స్వతహాగా రైతు అయిన కేసీఆర్.. పంట నష్టపోయినవారిని అన్నివిధాలా ఆదుకుంటామని భుజంతట్టారు. గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. వారి ఆవేదనను చూసి చలించిపోయారు. అక్కడికక్కడే ఎకరానికి రూ.10 వేల చొప్పున పంట పరిహారాన్ని ప్రకటించారు.
గతంలో విపత్తులు వాటిల్లినప్పుడు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం ఏకాణా ఇవ్వలేదు. కేంద్రంలో చదువు లేని సన్నాసులు రాజ్యమేలుతున్నరు. రైతుల బాధలు వాళ్లకు చెప్పినా అర్థం కావు. కేంద్రానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒక్కటే. అందుకే రైతులకు నష్ట పరిహారంపై కేంద్రాన్ని అడగదల్చుకోలేదు.
మీ ధైర్యమే నా ధైర్యం. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీకోసం నేనున్నాను. నష్టపోయిన ప్రతి రైతునూ అన్నివిధాలా ఆదుకుంటాం. రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి దేశ చరిత్రలోనే మొదటిసారి ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించాం
నేను వ్యవసాయం చేస్తాను. మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు కూడా వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా మేమంతా రైతులం కాబట్టి.. వ్యవసాయాన్ని కింద పడనీయొద్దు. ఇంత అభివృద్ధి చేసిన వ్యవసాయాన్ని ఇక వెనకి పోనీయొద్దు. ముందుకే పోవాలె. అందుకే మేమంతా వచ్చినం. మీకు ధైర్యం చెప్పడానికే వచ్చినం.
-ముఖ్యమంత్రి కేసీఆర్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమస్కరిస్తున్న రైతులు. చిత్రంలోఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు
ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధులు)/ మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ), మార్చి 23: అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోనూ సవరిస్తామని మేలు చేస్తామని వెల్లడించారు. గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటించారు. పలుచోట్ల రైతులతో మాట్లాడిన ఆయన వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
‘వడగండ్లవాన వల్ల జరిగిన నష్టాన్ని చూసి న తర్వాత ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని, వెంటనే మంజూరు చేయాలని అధికారులకు చెప్పిన. నేను హైదరాబాద్ నుంచే ఈ ప్రకటన చేయవచ్చు. కానీ, స్వయంగా పంట నష్టాలను చూడాలనుకున్నాను. రైతులను ఓదార్చాలనుకున్నాను. రైతులతో మాట్లాడాలని భావించాను. అందుకే వచ్చాను’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘నేను వ్యవసాయం చేస్తాను. మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావు కూడా వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా మేమంతా రైతులం కాబట్టి.. వ్యవసాయాన్ని కింద పడనీయొద్దు.
ఇంత అభివృద్ధి చేసిన వ్యవసాయాన్ని ఇగ వెన కి పోనీయొద్దు. ముందుకే పోవాలె. అందుకే మేమంతా వచ్చినం. మీకు ధైర్యం చెప్పడానికే వచ్చినం’ అని సీఎం అన్నారు. ‘చాలా కష్టపడి రాష్ర్టాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి చేసుకున్నాం. కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చుకున్నాం. ఐదారేండ్లలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలో సాధారణంగా 75-80 లక్షల ఎకరాలు సాగైతే.. అం దులో 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్న ది. వ్యవసాయంలో మంచి వృద్ధిలోకి వచ్చాం. వ్యవసాయానికి జీడీపీ కూడా బాగుంది. రైతులు అప్పులు కట్టుకొని ఇప్పుడే వృద్ధిలోకి వస్తున్నారు. ఈ దశలో వడగండ్ల వాన రైతాంగాన్ని నష్టపరిచింది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గార్లపాడులో సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలు వివరిస్తున్న గ్రామ సర్పంచ్ దారెల్లి నర్సమ్మ
ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. ఈ నెల 15, 16 తేదీల్లో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2,28,250 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వీటిలో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. కర్బూ జా, కూరగాయల వంటివి మరో 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు చెప్పారు. పంటనష్టం వందశాతం జరిగిందని, పంటలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు ఎక్కడా లేదని తన పరిశీలనలోనూ తేలిందని సీఎం వివరించారు. ‘రాష్ట్రంలో సహజంగా ఇలాంటి వడగండ్లు పడవు.
ఈసారి సంభవించింది మామూలు ఉపద్రవం కాదు. ఖమ్మం, మహబూబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనాలను ఇప్పటికే నా దృష్టికి తెచ్చారు. కలెక్టర్లు సైతం అంచనాలపై నివేదికలను అందజేశారు’ అని సీఎం చెప్పారు. బీభత్సమైన వడగండ్ల వాన పడిందని, నర్సంపేట ప్రాంతంలో అయితే పెద్దపెద్ద చెట్లు దెబ్బతిన్నాయని అన్నారు.
మరో రెండు మూడుసార్లు వడగండ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నదని, నష్టం మరికొంత పెరుగవచ్చునని చెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వెనక్కు పోనియ్యవద్దనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. నేను కోరేదల్లా ఒక్కటే.. ఇలాంటి ఉపద్రవాలు ఎన్ని వచ్చినా రైతులు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దు. మీ వెంట నేను, ప్రభుత్వం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలే తప్ప మనసు చిన్న బుచ్చుకుని నారాజు కావద్దు. ఇంకా బలంగా పనిచేస్తూ ముందుకు పోవాలి’ అంటూ సీఎం రైతులకు ధైర్యం చెప్పారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో పంటల నష్టానికి సంబంధించిన ఏర్పాటు చేసిన ఫొటోలను సీఎం కేసీఆర్‌కు చూపిస్తూ వివరిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్. చిత్రంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు నష్టపరిహారం అందిస్తున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.10 వేల సాయం అందిస్తామని వెల్లడించారు ‘చార్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇం డియా, డ్రాట్, విపత్తుల నిర్వహణ కోడ్ ప్రకారం.. ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న ఎకరం మక్కజొన్నకు రూ.3,350, వరికి రూ.5,400, మామిడికి రూ.7,200 నష్ట పరిహారం చెల్లించాలి. మిగతా పంటలకు చాలా తక్కువగా చెల్లిస్తుంటారు. కానీ, తెలంగాణలో వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోవద్దు, రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతిన వద్దని ఆలోచించి దేశ చరిత్రలోనే మొదటిసారి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించాం’ అని తెలిపారు. నష్టపోయిన రైతులకు తక్షణమే అందించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చినట్టు కేసీఆర్ చెప్పారు. తక్షణమే జీవో విడుదల చేస్తున్నామని, త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
కౌలు రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదని, సాధారణ రైతులతోపాటు నష్టపోయిన కౌలు రైతులనూ ఆదుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘కౌలుకు తీసుకున్న రైతులనూ ఆదుకోవాలి. వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాలి. రైతులే దయతలచి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. రైతులు, కౌలు రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడతారు. రైతులు పొందే పరిహారంలోనే ఎంతోకొంత కౌలు రైతులకూ అందేలా చూస్తే బాగుంటుంది. ఈ మేరకు కలెక్టర్లు రైతులను సమన్వయపరిచి కౌలుదార్లకూ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతు ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటలో రాలిన మామిడి కాయలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్ అర్వీ కర్ణన్
సుడిగాలిలా చుట్టేసి..
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. నాలుగు జిల్లాలను చుట్టేశారు. గురువారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన ఆయన, ఉదయం 11.50 గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చేరుకున్నారు. రామాపురం, రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న ఆయన, పెద్దవంగర మం డలం రెడ్డికుంటతండాలో పర్యటించారు.
మక్కజొన్న, మిర్చితో పాటు దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు. అనంతరం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో పంటలను పరిశీలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు బయల్దేరిన సీఎం, రామడుగు మండలం లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించా రు. సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. నాలుగు జిల్లాల్లో జరిగిన పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సంతోష్‌కుమార్,
ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, భూ పరిపాలనాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, టీ రాజయ్య, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, బిందు, గండ్ర జ్యోతి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆయా జిల్లాల కలెక్టర్లు గౌతమ్, శశాంక్, ప్రావీణ్య, ఆర్వీ కర్ణన్ తదితరులు ఉన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో మొక్కజొన్న తోటను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి