ఒకే రోజు మూడు మతాలకు చెందిన ప్రార్థన మందిరాలను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉన్నది. మనందరిపై దేవుడి దయ ఉన్నది. ఆలయం, మసీదు, చర్చి ఒకేచోట ఉన్న ప్రదేశంగా మన సచివాలయం లౌకికత్వాన్ని చాటుతున్నది. దీన్ని చూసి యావత్తు దేశం నేర్చుకోవాలి. శాంతితో సౌభ్రాతృత్వ, సుహృద్భావ వాతావరణం రాష్ట్రంలో ఇలాగే కొనసాగాలి .
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): సంక్షేమం, అభివృద్ధితో పాటు భిన్న సంప్రదాయాలతో దేశాన్ని ఆకర్షించే తెలంగాణ శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తిని చాటింది. సర్వమత సమారాధనను చూపింది. రాష్ట్ర పరిపాలన సౌధం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఒకేరోజు వరుసగా ప్రారంభమయ్యాయి. సచివాలయ ఉద్యోగుల ఆధ్యాత్మిక అవసరాల కోసం నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ దేవాలయం, చర్చి, మసీదును గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు.
ముందుగా సీఎం కేసీఆర్ సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాగానే ఆమెకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎస్, అధికారులు ఆహ్వానం పలికారు. దేవాలయంలో శాస్ర్తోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో, పూజాకార్యక్రమాల్లో సీఎం, గవర్నర్ పాల్గొన్నారు. చండీయాగం, పూర్ణాహుతి అయ్యాక, ఆలయ ప్రాంగణంలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి ఆలయం నుంచి బ్యాటరీ వాహనంలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నూతనంగా నిర్మించిన చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. వీరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వాగతం పలికారు. గవర్నర్, సీఎం కేసీఆర్ కలిసి రిబ్బన్ కట్‌చేసి చర్చిని ప్రారంభించారు. క్రైస్తవ సంప్రదాయ ప్రకారం నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషన్ ఎంఏ డానియేట్ బైబిల్ పఠించగా, చర్చిలో పాస్టర్లు, ఇతర మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని చదివి వినిపించారు. కేక్‌ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఎండీ కాంతివెస్లీ, మైనార్టీ కమిషన్ వైస్‌చైర్మన్ శంకర్ లూక్.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైని శాలువాలతో సన్మానించి, మెమెంటోలు అందజేశారు. సచివాలయ క్రిస్టియన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు రవి, లాల్‌బహదూర్‌శాస్త్రి, చిట్టిబాబు, స్వర్ణరాజు, మనోహరమ్మ, ప్రేమలీల, జాకబ్రాస్ భూంపాగ్ పుష్పగుచ్చాలతో గవర్నర్, సీఎం కేసీఆర్‌ను సత్కరించారు.
చర్చి పకనే నిర్మించిన మసీదుకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై చేరుకోగా, ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో ఇమామ్‌లు, తదితర మతపెద్దలు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్‌ను కట్‌చేసి మసీదును ప్రారంభించారు. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఇస్లాం మత పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మూడు ప్రార్థన మందిరాలను ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ మసీదులో ముస్లిం మత పెద్దలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకే రోజు మూడు మతాలకు చెందిన ప్రార్థన మందిరాలను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. మనందరిపై అల్లా దయ ఉన్నదని, రాష్ట్రంలో ఇలాంటి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పాత సచివాలయంలోని మసీదును మించి, కొత్త మసీదును సుందరంగా నిర్మించుకోవటం సంతోషానిచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా యావత్తు దేశంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయం, మసీదు, చర్చి ఒకేచోట ఉన్న ప్రదేశంగా మన సచివాలయం లౌకికత్వాన్ని చాటుతున్నదని స్పష్టం చేశారు. దీన్ని చూసి యావత్తు దేశం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో శాంతితో ఇలాంటి సుహృద్భావ వాతావరణం కొనసాగాలని అల్లాను ప్రార్థించినట్టు పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై తొలిసారిగా నూతన సచివాలయంలో అడుగుపెట్టారు. సీఎం కేసీఆర్ తన వాహనంలో గవర్నర్‌ను తోడ్కోని సచివాలయానికి వచ్చారు. ఒక్కో అంతస్థు ప్రత్యేకతలను గవర్నర్‌కు వివరించారు. తన చాంబర్కి తోడ్కొనివెళ్లి పుష్పగుచ్ఛం, శాలువాతో సతరించారు. సీఎస్ శాంతికుమారి పసుపు కుంకుమతో గవర్నర్‌ను సంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం గవర్నర్‌కు సీఎం కేసీఆర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ నిర్మాణ కౌశలా న్ని, కల్పించిన అధునాతన మౌలిక వసతుల వివరాలను గవర్నర్ సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు.
సచివాలయ నిర్మా ణం గొప్పగా ఉన్నదని కొనియాడారు. సీఎం ఆతిథ్యాన్ని స్వీకరించిన గవర్నర్ కా సేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇష్టాగోష్టి జరిపారు. అనంతరం తిరుగు ప్రయాణమైన గవర్నర్‌కు ప్రధానద్వారం వరకు వెళ్లి సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వే ముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ, ఎర్రబెల్లి, సబితారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సీఎస్ శాంతికుమారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, మంగ తదితరులు పాల్గొన్నారు.