తెలంగాణ అంటే ఇప్పుడు అభివృద్ధికి ఐకాన్.. రంగమేదైనా దేశానికే రాష్ట్రమే రోల్‌మాడల్.. తెలంగాణ బిజినెస్ స్పిరిట్, పారిశ్రామిక అనుకూలతలు చూసి ప్రపంచ దిగ్గజాలే ముగ్ధులై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో దేశానికే టెక్ రాజధానిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు అడ్డాగా హైదరాబాద్ మారుతున్నదని, రియల్ ఎస్టేట్ కింగ్‌గా అవతరిస్తున్నదని అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అటు విదేశీయుల పొగడ్తలతోపాటు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలతో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకొన్నదని దేశీయ పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్‌షా లాంటివారు, హైదరాబాద్ వస్తే న్యూయార్క్‌లో ఉన్నట్టు అనిపిస్తున్నదని సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ సర్కారు.. ఒకే రోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తూ వైద్యవిద్యలో దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టిస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధిస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని స్థాపిస్తున్నది. ఇంకోవైపు టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్లాంటి అంకుర సంస్థలతో టెక్నాలజీ హబ్‌గా మారింది. మొత్తంగా తెలంగాణ సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి సాధిస్తున్నది.
మొన్న రజనీ మాట ఇది!
22 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ కోసం నైట్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లాను.
నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా?
అన్నది అర్థం కాలేదు. నేను చూసిన హైదరాబాద్‌కు, ఇప్పటి హైదరాబాద్‌కు ఎక్కడా పొంతన లేదు.
– రజనీకాంత్ (28-04-2023)
నిన్న ప్రముఖుల మాట ఇది!
తెలంగాణకు వచ్చే ముందు భారత్‌లో 8 ఇతర రాష్ర్టాలను సందర్శించాం. ఇక్కడ ఉన్న వ్యాపార అనుకూల దృక్పథం, ప్రోత్సాహం ఎక్కడా కనిపించలేదు. ఇక్కడి స్ఫూర్తి ఆ రాష్ర్టాల్లో లేదు. పరిశ్రమలపై తెలంగాణ పాలసీలు చూసి ఆశ్చర్యపోయాం. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
– ఒలివియర్ మోనిన్, జెర్మాన్ అరాడ్, మోనిన్ గ్రూప్ (13.09.2023)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఈ విభాగాల్లో ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.
-లాఫ్రాన్స్, వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ( 13.09.2023)