తిమ్మాపూర్, సెప్టెంబర్ 10 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. గురువారం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతిపై కాంగ్రెస్ నాయకుడు, నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి దాడి చేశాడు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గరువారం మొగిలిపాలెం చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్‌తోపాటు సొసైటీ చైర్మన్ వెళ్లారు.
పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న రమణారెడ్డి.. సర్పంచ్ తిరుపతి రాగానే కర్రతో దాడి చేయగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ తిరుపతి గ్రామస్తులతో కలిసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి ఘటనను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు పొన్నం సునీతాఅనిల్ గౌడ్, మండల సర్పంచులు ఖండించారు. సర్పంచ్ తిరుపతి నుంచి ఫిర్యాదు తీసుకుని, సొసైటీ చైర్మన్ రమణారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై అన్వర్ తెలిపారు.