రామంతాపూర్/మారేడ్‌పల్లి: జీవో నం.97ను రద్దు చేయడంతోపాటు పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావొద్దని డిమాండ్ చేస్తూ రామంతాపూర్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 20 రోజులకుపైగా తరగతులను బహిష్కరించి కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించారు.
పోలీసులు విద్యార్థులను అడ్డుకోగా.. అది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కొద్దిసేపు పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. వెంటనే పోలీసులు భారీ ఎత్తున చేరుకొని విద్యార్థులను శాంతింపజేశారు. అలాగే మారేడ్‌పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 97 తో పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాల పై ప్రభావం పడే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.