సూర్యాపేట : సంపదను పెంచి, ప్రజలకు పంచాలన్నదే కేసీఆర్ నినాదం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర టౌన్ షిప్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు ఉన్న పరిస్థితులను ఈ రోజు వరకు సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలోనే సూర్యాపేట అగ్రస్థానంలో ఉందన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెడికల్ కాలేజ్, మహా ప్రస్థానం, ట్యాంక్‌బండ్ వాటి నిర్మాణాలు సూర్యాపేటకే తలమానికంగా మారాయన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అన్న మంత్రి, దీని ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఇటీవల వచ్చిన ఐటీ పరిశ్రమను కూడా రాబోయే రోజుల్లో 5000 మందికి విస్తరిస్తానని తెలిపారు.
ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్న మంత్రి, గత పాలకుల హాయంలో జరిగిన దౌర్జన్యాలు ప్రజల మనసుల నుంచి ఇంకా చెరిగి పోలేదన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ప్రజలంతా సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.