కాగజ్‌నగర్/సిర్పూర్(టీ), సెప్టెంబర్ 7 : హైదరాబాద్‌లోని చర్లపల్లిలోగల ఓ కంపెనీలో రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ లభించడం దేశ చరిత్రలో ఇది రెండోదని, ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నాయకుల హస్తమున్నదని ఆరోపించారు.
డ్రగ్స్ పట్టుబడడం సిగ్గు చేటని మండిపడ్డారు. డ్రగ్స్ ఎక్కడున్నా వదిలేదిలేదని గొప్పలకు పోయిన సీఎం, చర్లపల్లిలో డ్రగ్స్‌ను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అనంతరం సిర్పూర్(టీ)లో పారిగాంకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారిని ఆహ్వానించారు.