Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖకు చెందిన ఓ ఫైల్ ఆరు నెలలు పెండింగ్ పడడంతో.. సీఎంవోలోని కీలక ఐఏఎస్ అధికారితోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. 207 ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల వినతిమేరకు ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ 2024 జూలైలో ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఫైల్‌ను సదరు అధికారి పెండింగ్ పెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు.
ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై..
వివిధ సమావేశాల్లో చర్చించిన అంశాలను బయటకు ఎందుకు లీక్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. శనివారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ ప్యాకేజీ పనులపై అధికారులతో సమావేశమైన సీఎం .. సమావేశంలో చర్చించిన విషయాలను ఎక్కడా లీక్ చేయొద్దని మందలించినట్టు సమాచారం. సమావేశంలో చర్చించిన విషయాలను బయటకు చేరవేసే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.